విమాన నియంత్రణ వ్యవస్థ ఆధునికీకరణకు తక్షణమే నిధులివ్వాలి.. కాంగ్రెస్‌కు ట్రంప్ విజ్ఞప్తి
ABN , Publish Date - Nov 15 , 2026 | 08:40 PM
అమెరికాలో తలెత్తిన విమానయాన సంక్షోభంపై నాలుగు రోజుల తర్వాత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. దేశంలోని పాతబడిన విమాన రాకపోకల నియంత్రణ వ్యవస్థను మరింత దిగజార్చిన ఘనత గత జో బైడెన్ ప్రభుత్వానిదేనని ఆరోపించారు.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలో తలెత్తిన విమానయాన సంక్షోభంపై నాలుగు రోజుల తర్వాత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. దేశంలోని పాతబడిన విమాన రాకపోకల నియంత్రణ వ్యవస్థను మరింత దిగజార్చిన ఘనత గత జో బైడెన్ ప్రభుత్వానిదేనని ఆరోపించారు. ఈ మేరకు తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో పోస్టు చేశారు. విమాన నియంత్రణ వ్యవస్థలో తలెత్తిన సాంకేతిక సమస్యతో దేశవ్యాప్తంగా విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడిన విషయం తెలిసిందే. విమానాల బయలుదేరే ప్రక్రియ నిలిచిపోవడంతో వేలాది సర్వీసులు రద్దయ్యాయి. ఈ పరిణామాలపై ట్రంప్ ట్రూత్ సోషల్‌లో స్పందించారు.
‘గత బైడెన్ ప్రభుత్వం ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) ను పూర్తిగా దెబ్బతీసింది. వారు చేపట్టిన ప్రతి పని విఫలమైంది. భారీగా నిధులు ఖర్చు చేసినా.. ఇప్పటికే పాతబడిన వ్యవస్థను మరింత అధ్వానంగా మార్చారు. విమాన నియంత్రణ వ్యవస్థను ఆధునికీకరించేందుకు మా వద్ద ప్రణాళిక, నైపుణ్యం ఉన్నాయి. అయితే కాంగ్రెస్ త్వరగా నిధులు మంజూరు చేయాలి’ అని ట్రంప్ పేర్కొన్నారు. ఎఫ్‌ఏఏ సమర్థంగా పనిచేస్తోందని, అవసరమైన చర్యలకు సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు.
23 నిమిషాలకే మరో పోస్టు
విమాన నియంత్రణ వ్యవస్థ ఆధునికీకరణకు నిధులు మంజూరు చేయాలని ట్రంప్ తొలి పోస్టు చేసిన 23 నిమిషాలకే మరో పోస్టు పెట్టారు. కాంగ్రెస్ అవసరమైన నిధులు మంజూరు చేస్తే.. అత్యంత వేగంగా, సమర్థంగా కొత్త వ్యవస్థను నిర్మించగలమని, ప్రపంచంలోనే అత్యుత్తమ విమాన నియంత్రణ వ్యవస్థగా తీర్చిదిద్దుతామని ఆయన పేర్కొన్నారు. అమెరికాలో విమాన రాకపోకలను నియంత్రించే వ్యవస్థలోని చాలా భాగాలు 50 ఏళ్ల నాటివని తెలిపారు. ఇలాంటి పరిస్థితి ఆమోదయోగ్యం కాదని వ్యాఖ్యానించారు. కాగా, దేశవ్యాప్తంగా విమానాల రాకపోకలకు అంతరాయం కలిగించిన సాంకేతిక సమస్యకు ఓ కాంట్రాక్టర్ చేసిన పొరపాటు లేదా రౌటర్‌లో తలెత్తిన లోపం కారణమని ప్రాథమిక విచారణలో తేలినట్లు రవాణా శాఖ మంత్రి సీన్ డఫీ వెల్లడించారు. విమానయాన మౌలిక సదుపాయాలను ఆధునికీకరించేందుకు కాంగ్రెస్ 50 బిలియన్ డాలర్లు (సుమారు రూ.4.4 లక్షల కోట్లు) మంజూరు చేయాలని ఆయన కోరారు.
ఈ వార్తలనూ చదవండి:
మియామి ఎయిర్‌పోర్ట్‌లో రెండు విమానాల ఢీ.. ఇద్దరికి గాయాలు
చరిత్ర సృష్టించిన స్పేస్‌ఎక్స్.. గాల్లోనే స్టార్‌షిప్‌ను పట్టుకున్న స్టార్‌బేస్..