మియామి ఎయిర్‌పోర్ట్‌లో రెండు విమానాల ఢీ.. ఇద్దరికి గాయాలు
ABN , Publish Date - Nov 15 , 2026 | 01:21 PM
అమెరికాలోని మియామి అంతర్జాతీయ విమానాశ్రయంలోని రన్‌వేపై నిన్న (శనివారం) రెండు విమానాలు ఒకదానినొకటి ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు స్వల్పంగా గాయపడినట్టు కోపా విమానయాన సంస్థ తెలిపింది.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలోని మియామి అంతర్జాతీయ విమానాశ్రయంలోని రన్‌వేపై నిన్న (శనివారం) రెండు విమానాలు ఒకదానినొకటి ఢీకొట్టాయి. 168 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో ఉన్న కోపా ఎయిర్‌లైన్స్ బోయింగ్ 737 అనే విమానం రెక్క.. యూపీఎస్ బోయింగ్ 767 అనే కార్గో విమానం ముందు భాగాన్ని ఢీకొట్టింది. అమెరికా వ్యాప్తంగా విమాన సేవలకు అంతరాయం ఏర్పడిన ఒక రోజు తరువాత ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు స్వల్పంగా గాయపడినట్టు కోపా విమానయాన సంస్థ తెలిపింది. మిగతా ప్రయాణికులందరూ క్షేమంగా ఉన్నారని వెల్లడించింది. అలాగే సిబ్బందికి ఎలాంటి గాయాలూ కాలేదని వివరించింది.
ప్రయాణికుల్లో ఆందోళనలు
ఈ ప్రమాదం చోటుచేసుకున్న సమయంలో ప్రయాణికులు ఆందోళన చెందారు. తమకు పెద్ద పెద్ద శబ్దాలు వినిపించాయని చెప్పారు. ‘విమానం ల్యాండింగ్ తరువాత అకస్మాత్తుగా నా చుట్టూ ఉన్న సంభాషణలు బిగ్గరగా వినిపించాయి. ఆ తరువాత ప్రయాణికులు కేకలు వేశారు. ఆపై మరో విమానం మా విమానాన్ని ఢీకొట్టిన శబ్దం వచ్చింది’ అని ఓ ప్రయాణికుడు మీడియాకు తెలిపారు.
విమాన సేవలకు అంతరాయం
కాగా నిన్న (శనివారం) అమెరికాలో ఓ చిన్న సాంకేతిక సమస్య విమానయాన సేవలను కుదిపేసింది. టెలికమ్యూనికేషన్ వ్యవస్థలో డేటా ఓవర్‌లోడ్ కారణంగా ఎదురైన సాంకేతిక సమస్యతో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల నుంచి బయల్దేరాల్సిన విమానాలు (సుమారు 8,000) కొన్ని గంటలపాటు ఎక్కడివి అక్కడే నిలిచిపోయాయి. దీంతో 15 లక్షల మంది ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఈ వార్తలూ చదవండి
చరిత్ర సృష్టించిన స్పేస్ఎక్స్.. గాల్లోనే స్టార్‌షిప్‌ను పట్టుకున్న స్టార్‌బేస్..
ఇజ్రాయెల్ వైమానిక దాడిలో హమాస్ కీలక కమాండర్ హతం