Share News

చర్చలు, దౌత్యంతోనే యద్ధానికి పరిష్కారం.. జెలెన్‌స్కీతో ఫోన్‌లో మోదీ

ABN , Publish Date - Nov 09 , 2026 | 08:56 PM

ఉక్రెయిన్‌ అధ్యక్షుడు ఓలోదిమిర్ జెలెన్‌స్కీకి ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఫోన్ చేశారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి చర్చలు, దౌత్య మార్గాల ద్వారా పరిష్కారం కనుగొనాలని ఆయన సూచించారు.

చర్చలు, దౌత్యంతోనే యద్ధానికి పరిష్కారం.. జెలెన్‌స్కీతో ఫోన్‌లో మోదీ

ఇంటర్నెట్ డెస్క్: ఉక్రెయిన్‌ అధ్యక్షుడు ఓలోదిమిర్ జెలెన్‌స్కీకి ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఫోన్ చేశారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి చర్చలు, దౌత్య మార్గాల ద్వారా పరిష్కారం కనుగొనాలని ఆయన సూచించారు. యుద్ధానికి శాంతియుత పరిష్కారం లభించేలా చేసే అన్ని ప్రయత్నాలకు భారత్‌ మద్దతు ఇస్తుందని ఆయన పునరుద్ఘాటించారు. ప్రస్తుత సంక్షోభంలో మానవతా కోణానికే భారత్‌ అత్యంత ప్రాధాన్యమిస్తోందని చెప్పారు. అలాగే ఇరు దేశాల మధ్య వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకునే అంశాలపైనా ఇద్దరు నేతలు చర్చించారు.


రష్యా కూడా ముందుకు రావాలి: జెలెన్‌స్కీ

మోదీతో ఫోన్‌లో మాట్లాడిన విషయాన్ని జెలెన్‌స్కీ ‘ఎక్స్‌’లో వెల్లడించారు. తాజా దౌత్య పరిణామాలతో పాటు అబుధాబిలో జరగనున్న సమావేశానికి ఉక్రెయిన్‌ చేస్తున్న సన్నాహాల గురించి కూడా మోదీకి వివరించానని ఆయన తెలిపారు. యుద్ధాన్ని ముగించేందుకు ఉక్రెయిన్‌ ముందుకు వెళ్తోందని, రష్యా కూడా అదే విధంగా ఉద్రిక్తతలను తగ్గించేందుకు ముందుకు రావాలన్నారు. ఇది యుద్ధాన్ని కొనసాగించే సమయం కాదని, ముగించాల్సిన సమయమని మోదీ పలుమార్లు స్పష్టం చేసినట్లు జెలెన్‌స్కీ గుర్తుచేశారు.


ఆహార భద్రతపైనా చర్చ

నల్ల సముద్రం మీదుగా ధాన్యం ఎగుమతులకు రష్యా అడ్డంకులు కలిగిస్తుండడంతో తలెత్తిన పరిణామాలపైనా మోదీతో చర్చించానని జెలెన్‌స్కీ తెలిపారు. ఆహార భద్రతకు భంగం కలగకుండా ధాన్యం రవాణా కోసం ప్రత్యేక మార్గాలను ఏర్పాటు చేసే విషయంలో మధ్యవర్తిత్వం వహించేందుకు భారత్‌ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఈ దిశగా న్యూఢిల్లీ తన ప్రయత్నాలను కొనసాగిస్తుందని ఆశిస్తున్నట్లు జెలెన్‌స్కీ చెప్పారు. ఆహార భద్రత కూడా యుద్ధ పరిష్కారానికి దోహదపడే అంశాల్లో ఒకటిగా నిలుస్తుందని పేర్కొన్నారు. నల్ల సముద్రం మీదుగా ధాన్యం ఎగుమతులకు ఆటంకాలు తొలగించి, ఆహార రవాణా మార్గాలను ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో భారత్‌ తన సహకారాన్ని కొనసాగిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.


ఈ వార్తలనూ చదవండి:

ఎన్విడియా సీఈఓపై మేము గూఢచర్యం చేయలేదు: చైనా

వాళ్లు చాలా క్లోజ్.. ఎన్విడియా సీఈఓ ఎఫైర్‌పై 6 నెలల క్రితమే డౌట్

Updated Date - Nov 09 , 2026 | 08:57 PM