Share News

గాడిదల బండిపై అసెంబ్లీకి వెళ్లిన పాకిస్థాన్ శాసనసభ్యులు.. వీడియో వైరల్

ABN , Publish Date - Sep 20 , 2026 | 07:25 AM

ఇంధన ధరలకు వ్యతిరేకంగా పాకిస్థాన్‌లో చట్టసభ సభ్యులు వినూత్న నిరసన చేపట్టారు. గాడిద బండిపై అసెంబ్లీకి వెళ్లి వినూత్న రీతిలో నిరసన చేపట్టారు.

గాడిదల బండిపై అసెంబ్లీకి వెళ్లిన పాకిస్థాన్ శాసనసభ్యులు.. వీడియో వైరల్
Donkey Carts

ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్‌లో పెరుగుతున్న ఇంధన ధరలకు వ్యతిరేకంగా అక్కడి రాజకీయ నాయకులు వినూత్న నిరసన చేపట్టారు. గత శుక్రవారం ఒక్కసారిగా పెరిగిన ధరలను నిరసిస్తూ ఇమ్రాన్ ఖాన్ పార్టీకి చెందిన చట్టసభ సభ్యులు గాడిద బండ్లతో అసెంబ్లీకి చేరుకున్నారు. పెట్రోల్ ఖర్చులు సామాన్యులపై భారం మోపుతున్నాయని మండిపడ్డారు.


చట్టసభ సభ్యుడు సజ్జద్ ఆలీ ఈ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం జరిగింది. పెట్రోల్ ధరలను విమర్శిస్తూ.. ఆయనే స్వయంగా గాడిద బండిని నడిపారు. ఇందులో పలువురి రాజకీయ నాయకులూ పాల్గొన్నారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. అనంతరం ఆలీ మీడియాతో మాట్లాడుతూ.. తక్షణమే ఇంధన ధరలను ప్రభుత్వం తగ్గించాలని డిమాండ్ చేశారు. పెట్రోల్ రేట్లు ఆకాశాన్నంటాయని, అందుకే తాము గాడిద బండిపై వచ్చామని వివరించారు. పెట్రోల్ ధరలను ఆయన పెట్రోల్ బాంబ్‌గా అభివర్ణించారు. సామాన్యులపై పెను భారం పడుతోందనేది పాలకులు గుర్తించాలని చెప్పారు.


కాగా అక్కడ ప్రస్తుతం లీటర్ సాధారణ పెట్రోల్ ధర రూ.390.76గా ఉండగా, హైస్పీడ్ పెట్రోల్ రూ.424.92గా ఉంది. ఇందులో ప్రభుత్వ ఛార్జీలే రూ.114 మేర ఉన్నట్టు తెలుస్తోంది. కాగా.. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా కొన్ని నెలలుగా పాక్‌లో ఇంధన ధరలకు రెక్కలొచ్చాయి.

పాకిస్థాన్ కొత్త పథకం

మరోవైపు.. పెట్రోల్ ధరల నుంచి ప్రజలుకు కాస్త ఊరట కల్పించడానికి పాక్ ప్రభుత్వం కొత్త పథకం రూపొందించింది. మోటర్‌సైకిళ్లు, రిక్షాలు, ఇతర ద్విచక్ర, త్రిచక్ర వాహనదారులకు నెలకు 20 లీటర్ల పెట్రోల్‌ కొనుగోలుపై రాయితీ ఉంటుందని ప్రకటించింది.


ఈ వార్తలూ చదవండి

పాకిస్థాన్‌పై డబ్బుల వర్షం కురిపిస్తున్న గాడిదలు.. ఎలాగంటే?

పెళ్లిళ్లల్లో ఇకపై ఒకటే వంటకం.. పాక్‌లో ఆదేశాలు జారీ

Updated Date - Sep 20 , 2026 | 09:16 AM