పాకిస్థాన్‌లో కలకలం.. 20 మంది పోలీసు కానిస్టేబుళ్ల కిడ్నాప్!
ABN , Publish Date - Oct 17 , 2026 | 09:55 PM
శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్లు తమ ఇళ్లకు వెళ్తుండగా.. సినీ ఫక్కీలో సాయుధులు అడ్డుకొని వారిని కిడ్నాప్ చేశారు. ఈ ఘటన పాకిస్థాన్‌లోని క్వెట్టా-కరాచీ హైవేపై చోటుచేసుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: శిక్షణ పూర్తి చేసుకున్నపోలీసు కానిస్టేబుళ్లను సినీ ఫక్కీలో సాయుధులు కిడ్నాప్ చేశారు. ఈ ఘటన పాకిస్థాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో క్వెట్టా-కరాచీ హైవేపై చోటుచేసుకుంది. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. కలత్ పోలీస్ శిక్షణ కేంద్రంలో ఇటీవల పోలీసు కానిస్టేబుళ్లు తమ శిక్షణ పూర్తి చేసుకున్నారు. మరికొద్ది రోజుల్లో విధుల్లో చేరాల్సింది. ఈ క్రమంలో విధులకు చేరే ముందు 20మంది కానిస్టేబుళ్లు తమ ఇళ్లకు బయల్దేరారు. శనివారం క్వెట్టా-కరాచీ హైవేపై ఒక వ్యాన్ లో వెళ్తుండగా.. మోటార్ సైకిళ్లపై వచ్చిన కొందరు సాయుధులు వాహనాన్ని అడ్డుకున్నారు.
అనంతరం వాహనంతో పాటు అందులోని 20మంది కానిస్టేబుళ్లను కూడా తమ అదుపులోకి తీసుకొని, గుర్తు తెలియని ప్రదేశానికి తీసుకువెళ్లారు. వ్యాన్ డ్రైవర్, మరో ముగ్గురు ప్రయాణికులను మాత్రం వారు విడిచిపెట్టినట్లు స్థానిక మీడియాలు పేర్కొన్నాయి. అపహరణకు గురైన సిబ్బంది లెవీస్ ఫోర్స్‌కు చెందినవారని పేర్కొన్నారు. వారి ఆచూకీ కనుగొనేందుకు పాక్ భద్రతా దళాలు క్వెట్టా-కరాచీ ప్రాంతాల్లోని పర్వతాల్లో గాలింపు చర్యలు చేపట్టాయి.
20 మంది కానిస్టేబుళ్ల కిడ్నాప్‌నకు బాధ్యత వహిస్తూ ఇప్పటి వరకు ఏ ఉగ్రసంస్థ ప్రకటన వెలువరించలేదు. చాలా కాలంగా ఆఫ్గనిస్థాన్ సరిహద్దుగా ఉన్న బలూచిస్తాన్ ప్రావిన్స్ లో అశాంతి నెలకొంది. తరచూ పౌరులను, భద్రతా సిబ్బందిపై అక్కడి ఉగ్రవాదులు దాడులకు తెగబడుతుంటారు. ఈ ఏడాది జూలైలో ఉగ్రవాదులు ఇదే ప్రావిన్స్‌లోని మూడు ప్రదేశాలలో దాడులు జరిపారు. జియారత్‌లోని మంగి డ్యామ్ వద్ద ఉన్న పోలీస్ చెక్‌పాయింట్‌పై జరిగిన దాడిలో 27 మంది పోలీసు సిబ్బంది మరణించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్.. కూటమి అభ్యర్థుల ఎంపికపై కసరత్తు
మహిళలు స్వయంకృషితో ఎదిగేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ చేయూత: నారా భువనేశ్వరి
ద్వారకా తిరుమలలో 21 నుంచి 28 వరకు బ్రహ్మోత్సవాలు