భారత మూలాలున్న మహిళకు నోబెల్ శాంతి పురస్కారం
ABN , Publish Date - Oct 09 , 2026 | 04:02 PM
భారతీయ మూలాలున్న దక్షిణాఫ్రికాకు చెందిన నవనీతమ్ ‘నవీ’ పిళ్లైకి అరుదైన గౌరవం లభించింది. ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతి పిళ్లైని వరించింది.
ఇంటర్నెట్ డెస్క్: భారతీయ మూలాలున్న దక్షిణాఫ్రికాకు చెందిన నవనీతమ్ ‘నవీ’ పిళ్లైకి అరుదైన గౌరవం లభించింది. ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతి (Nobel Peace Prize 2026) పిళ్లైని వరించింది. శాంతి, అంతర్జాతీయ చట్టాలను ప్రోత్సహించడానికి కృషి చేసినందుకు గాను నోబెల్ శాంతి పురష్కారానికి నవీ పిళ్లైని ఎంపిక చేసినట్లు నార్వే నోబెల్ కమిటీ వెల్లడించింది. నవనీతమ్ అంతర్జాతీయంగా మానవ హక్కుల కోసం విశేషంగా కృషి చేశారు. ఈమె పూర్వీకులు తమిళనాడుకు చెందిన వారు కాగా.. చాలా ఏళ్ల క్రితం అక్కడి నుంచి దక్షిణాఫ్రికాకు వలస వెళ్లారు. ఆమె పూర్వీకులు 1890లో దక్షిణాఫ్రికాలోని చక్కెర తోటలలో పనిచేయడానికి ఒప్పంద సేవకులుగా భారతదేశం నుంచి వెళ్లారు.
ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల విభాగం హైకమిషనర్‌గా (2008-14) నవనీతమ్ పని చేశారు. 2003-2008 కాలంలో అంతర్జాతీయ నేర న్యాయస్థానం న్యాయమూర్తిగా పనిచేశారు. దక్షిణాఫ్రికాలో తొలి నల్లజాతి మహిళా న్యాయమూర్తిగానూ పిళ్లై అరుదైన ఘనత సాధించారు. నవనీతమ్ పిళ్లై తల్లిదండ్రులు శాంతమ్మ నాయుడు, నారాయణస్వామి నాయుడు. 1941లో ఈమె దక్షిణాఫ్రికాలోని నాటల్ ప్రావిన్స్‌లోని డర్బన్‌లో జన్మించారు.
ప్రపంచ వ్యాప్తంగా అనేక సంఘర్షణలు దౌత్యం, ఒప్పందాలు, చట్టపరమైన మార్గాల్లోనే పరిష్కారం అవుతున్నాయని నార్వే నోబెల్ కమిటీ పేర్కొంది. మరింత శాంతియుత ప్రపంచానికి అంతర్జాతీయ చట్టం ఓ పునాది అని.. ప్రస్తుతం అనేక సంఘర్షణలు, సవాళ్లు ఎదుర్కొంటున్న సమయంలో ఇది అత్యంత అవసరమని నోబెల్ కమిటీ అభిప్రాయపడింది. గతేడాది వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరినా మచాడోను ఈ నోబెల్ శాంతి బహుమతి వరించింది. దక్షిణ అమెరికా దేశంలో ప్రజాస్వామ్యం కోసం చేసిన పోరాటానికి గాను మచాడో నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకున్నారు.
ఇవి కూడా చదవండి:
బీసీసీఐ క్రీడా కమిటీ బడ్జెట్ భారీగా పెంపు.. ఏకంగా రూ. 127 కోట్లు
అదంతా ఫేక్.. నేను ఏ మతాన్నీ కించపరచలేదు: ఇర్ఫాన్ పఠాన్
శాండ్ పేపర్ వివాదంపై లక్షలసార్లు సమాధానం చెప్పా: ప్యాట్ కమిన్స్