భారత్‌లో స్టార్‌లింక్ సిగ్నల్స్ ఆఫ్‌లోనే ఉన్నాయి.. తీవ్రవాదుల వినియోగం ఆరోపణలను ఖండించిన మస్క్
ABN , Publish Date - Oct 08 , 2026 | 07:07 AM
భారత్‌లో స్టార్‌లింక్ టెర్మినళ్లను తీవ్రవాదులు ఉపయోగిస్తున్నారంటూ వచ్చిన వార్తలనను ఎలాన్ మస్క్ ఖండించారు. భారత భూభాగంపై స్టార్‌లింక్ సిగ్నల్ బీమ్‌లు ఇంకా ఆఫ్‌లోనే ఉన్నాయని, అందువల్ల ఈ వాదనలు అసత్యమని చెప్పారు.
Starlink Signals India: భారత్‌లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్న వేళ, ప్రముఖ వ్యాపారవేత్త, స్పేస్‌ఎక్స్ (SpaceX) సీఈఓ ఎలాన్ మస్క్ (Elon Musk) కీలక వ్యాఖ్యలు చేశారు. మణిపూర్-మ్యాన్మార్ సరిహద్దు సమీపంలో తిరుగుబాటు ముఠాల నుంచి స్టార్‌లింక్ టెర్మినళ్లను భారత భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయని, తీవ్రవాదులు దానిని ఉపయోగిస్తున్నారంటూ వస్తున్న వార్తలను ఆయన తీవ్రంగా ఖండించారు.
భారత భూభాగంపై స్టార్‌లింక్ సాటిలైట్ బీమ్‌లు (Signal Beams) ఇంకా అసలు ఆన్‌లోనే లేవని, అలాంటప్పుడు దానిని ఎవరూ ఉపయోగించే అవకాశమే లేదని సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశారు. 'భారతదేశంపై స్టార్‌లింక్ బీమ్‌లు పూర్తి స్థాయిలో నిలిపివేసి (Turned Off) ఉన్నాయి. కాబట్టి ఎవరైనా, ఏ కారణం చేతనైనా దానిని ఉపయోగించారనే వాదన పూర్తిగా అసత్యం' అని మస్క్ తన ఎక్స్ (X) ఖాతాలో పేర్కొన్నారు.
సరిహద్దుల్లో ఎవరైనా అనధికారికంగా ఉపగ్రహ టెర్మినల్/పరికరాన్ని కలిగి ఉన్నంత మాత్రాన ఇంటర్నెట్ పనిచేయదని, ఉపగ్రహం నుంచి సిగ్నల్ బీమ్ రానంత వరకు ఆ డివైజ్ ద్వారా కనెక్టివిటీ సాధ్యపడదని సాంకేతిక వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. నిన్న (అక్టోబర్ 7న) జరిగిన ఇండియా మొబైల్ కాంగ్రెస్ (IMC 2026)లో స్పేస్‌ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ లోరెన్ డ్రేయర్ మాట్లాడుతూ భారత్ భద్రతా నిబంధనలు, చట్టాలకు కట్టుబడి ఉండేలా ప్రత్యేకంగా 20 గేట్‌వే సైట్‌లను కూడా ఏర్పాటు చేశామని చెప్పారు. భారత వినియోగదారుల డేటా దేశ సరిహద్దులు దాటకుండా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.
భారత్‌లోని సుమారు 11,000 పైగా గ్రామాలకు ఇంకా 4G సదుపాయం లేదని, స్టార్‌లింక్ ద్వారా కొండ ప్రాంతాలు, మారుమూల గ్రామాలు, విపత్తుల సమయంలో వేగవంతమైన ఇంటర్నెట్ అందించవచ్చని కంపెనీ ప్రతినిధులు పేర్కొంటున్నారు. భారత ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా టెలికాం అనుమతులు, స్పెక్ట్రమ్ కేటాయింపులు రాగానే కమర్షియల్ సేవలను ప్రారంభించేందుకు స్టార్‌లింక్ సిద్ధమవుతోంది.
ఇవి కూడా చదవండి...
జోరుగా యంగ్ ఇండియా స్కూళ్ల నిర్మాణాలు
చికిత్సకు ముందు-తర్వాత ప్రచారం ఇక కుదరదు!
రోడ్డు ప్రమాదాల నివారణకు ‘4ఈ’ అస్త్రం
Read Latest AP News And Telugu News