Share News

ఎప్‌స్టీన్ సంబంధాలపై ఫౌండేషన్ సిబ్బందికి బిల్ గేట్స్ క్షమాపణలు

ABN , Publish Date - Feb 25 , 2026 | 04:51 PM

ప్రపంచ టెక్ దిగ్గజం బిల్ గేట్స్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఎప్‌స్టీన్‌తో తనకున్న సంబంధాలపై మరోసారి స్పష్టతనిచ్చారాయన. ఈ సందర్భంగా ఫౌండేషన్ సిబ్బందికి క్షమాపణలు చెప్పారు. అలాగే రష్యన్ అమ్మాయిలతో తనకు సంబంధాలున్నట్టు వస్తోన్న ఆరోపణలపై కూడా క్లారిటీ ఇచ్చారాయన. వివరాల్లోకెళితే...

ఎప్‌స్టీన్ సంబంధాలపై ఫౌండేషన్ సిబ్బందికి బిల్ గేట్స్ క్షమాపణలు
Bill Gates Apologizes to Foundation Staff

ఇంటర్నెట్ డెస్క్: మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు బిల్ గేట్స్(Bill Gates) మరోసారి వార్తల్లో నిలిచారు. అమెరికా కోర్టు ఇటీవల విడుదల చేసిన జెఫ్రీ ఎప్‌స్టీన్(Jeffrey Epstein) పత్రాల్లో బిల్ గేట్స్ పేరు ఉండటం తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఈ విషయమై ప్రపంచ టెక్ దిగ్గజం గేట్స్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే ఎప్‌స్టీన్‌తో తనకున్న సంబంధాలపై స్పందించిన ఆయన.. తాజాగా ఆ రహస్య ఫైళ్ల గురించి ప్రస్తావించారు. ఈ సందర్భంగా గేట్స్ ఫౌండేషన్ సిబ్బందికి క్షమాపణలు చెప్పారాయన. కానీ తాను ఏనాడూ చట్టవిరుద్ధ పనులు చేయలేదని పేర్కొన్నారు.


లైంగిక నేరగాడు ఎప్‌స్టీన్‌తో గతంలో తనకున్న సంబంధాలపై స్పందిస్తూ తీవ్ర విచారం వ్యక్తం చేశారు గేట్స్. తన దాతృత్వ సంస్థ 'బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్' ఉద్యోగులతో నిర్వహించిన ఒక ప్రత్యేక భేటీ సందర్భంగా.. ఈ అంశంపై బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. ఎప్‌స్టీన్‌తో సమయం గడపడం తన జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు అని ఆయన అంగీకరించారు. అలాగే రష్యన్ అమ్మాయిలతో సంబంధాలున్నాయంటూ తనపై వస్తోన్న ఆరోపణలపైనా గేట్స్ స్పష్టతనిచ్చారు.

ఈ సమావేశంలో గేట్స్ తన తప్పును ఒప్పుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారని వాల్ స్ట్రీట్ జర్నల్ తన కథనంలో రాసుకొచ్చింది. 'ఎప్‌స్టీన్‌తో సమయం గడపడం నాడు నేను చేసిన అతిపెద్ద తప్పు. గేట్స్ ఫౌండేషన్ కార్య నిర్వాహకులను అతడి సమావేశాలకు తీసుకురావడమూ తప్పే. నా పొరపాటు వల్ల ఈ వివాదంలో ఇరుక్కున్న ప్రతి ఒక్కరికీ నేను క్షమాపణలు చెబుతున్నాను. మా ఫౌండేషన్ విలువలకు, లక్ష్యాలకు ఇది పూర్తిగా విరుద్ధం' అని గేట్స్ చెప్పినట్టు తెలిపింది. ఫౌండేషన్ ప్రతిష్ఠ చాలా సున్నితమైనదని.. ఇలాంటి సంఘటనలు తమతో కలిసి పనిచేసే ప్రజల నిర్ణయంపై తీవ్ర ప్రభావం చూపుతాయని టెక్ దిగ్గజం ఆందోళన వ్యక్తం చేశారని అందులో పేర్కొంది.


అమెరికా న్యాయ శాఖ ఇటీవల విడుదల చేసిన పత్రాల్లో.. ఎప్‌స్టీన్ రాసిన కొన్ని ఇ-మెయిల్ డ్రాఫ్టులు వెలుగులోకి వచ్చాయి. అందులో బిల్ గేట్స్‌కు డ్రగ్స్ సరఫరా చేయడం సహా రష్యన్ అమ్మాయిలతో సంబంధాలు ఏర్పాటు చేసేందుకు తాను సహకరించానని ఎప్‌స్టీన్ పేర్కొన్నాడు. ఈ ఆరోపణలను నాటి నుంచీ గేట్స్ ఖండిస్తూనే ఉన్నారు. తాను ఎలాంటి చట్టవిరుద్ధమైన పనులు చేయలేదని స్పష్టం చేశారు. ఆ ఫొటోల్లో తన పక్కన ఉన్న మహిళలు ఎప్‌స్టీన్ సహాయకులు మాత్రమేనని.. కావాలనే వారి ముఖాలకు మాస్క్ వేశారన్నారు. అలాగే ఎప్‌స్టీన్ వేధింపులకు గురైన బాధితులతో తాను ఏనాడూ సమయం కేటాయించలేదని గేట్స్ చెప్పుకొచ్చారు.


ఇక.. ఎప్‌స్టీన్‌తో తన సంబంధాలపై గేట్స్ ప్రస్తావిస్తూ.. 2011-14 మధ్య కాలంలో ఎప్‌స్టీన్‌ను పలుమార్లు కలిసినట్టు అంగీకరించారు. అయితే.. ఆ సమయంలో అతడికున్న క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్ గురించి అంత లోతుగా తనకు తెలియదన్నారు. తన మాజీ భార్య మెలిండా గేట్స్ మొదటి నుంచీ ఎప్‌స్టీన్ విషయంలో తనను హెచ్చరించిందని.. ఆ విషయంలో మెలిండాకు క్రెడిట్ ఇవ్వాల్సిందేనని పేర్కొన్నారు గేట్స్. ప్రస్తుతం జరుగుతున్న చర్చలను బట్టిచూస్తే.. నాడు తాను చేసిన పొరపాటు నేడు వందల రెట్లు పెద్దదిగా కనిపిస్తోందని ఆయన ఆవేదన చెందారు.


ఇవీ చదవండి:

ఇది అమెరికాకు స్వర్ణయుగం: ట్రంప్

భారత్-పాక్ యుద్ధాన్ని ఆపకపోయి ఉంటే..

కుక్క నోటిలో మనిషి కాలు.. వైరల్‌గా మారిన వీడియో..

Updated Date - Feb 25 , 2026 | 05:13 PM