Share News

న్యాయవ్యవస్థలో అవినీతిపై పాఠ్యాంశం.. ఎన్‌సీఈఆర్‌టీపై సుప్రీం సీరియస్

ABN , Publish Date - Feb 25 , 2026 | 02:48 PM

నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ 8వ తరగతి పాఠ్యాంశంలో 'న్యాయవ్యవస్థలో అవినీతి' అంశాన్ని ప్రవేశపెట్టడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇది అందరినీ కలవరపాటుకు గురిచేసిందని సీజేఐ సూర్యకాంత్ అన్నారు.

న్యాయవ్యవస్థలో అవినీతిపై పాఠ్యాంశం.. ఎన్‌సీఈఆర్‌టీపై సుప్రీం సీరియస్
Supreme Court on NCERT row

న్యూఢిల్లీ: నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) 8వ తరగతి పాఠ్యాంశంలో 'న్యాయవ్యవస్థలో అవినీతి' అంశాన్ని ప్రవేశపెట్టడంపై సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇది అందరినీ కలవరపాటుకు గురిచేసిందని, న్యాయవ్యవస్థను కించపరచే ఎలాంటి చర్యలను అనుమతించేది లేదని సీజేఐ సూర్యకాంత్ స్పష్టం చేశారు. దీనిపై సుమోటో చర్య తీసుకుంటామన్నారు.


'న్యాయవాదులు, న్యాయమూర్తులతో సహా అందరినీ ఈ అంశం కలవరపాటుకు గురిచేసింది. కొన్ని రోజులు ఆగండి. దీనిపై నేను సుమోటో విచారణ చేపడతాను. సంస్థను అప్రతిష్ఠపాలు చేసే ఎలాంటి చర్యను అనుమతించేది లేదు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది' అని సీజేఐ అన్నారు. 8వ తరగతి విద్యార్థులకు 'న్యాయవ్యవస్థలో అవినీతి' అంశాన్ని ఎన్‌సీఈఆర్‌టీ బోధిస్తోందని సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ అత్యున్నత న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. ఇది తీవ్ర ఆందోళన కలిగిస్తోందని అన్నారు. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు స్పందించింది.


కపిల్ సిబల్ పోస్ట్

దీనికి ముందు, కపిల్ సిబల్ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ఒక పోస్ట్ పెట్టారు. ఎన్‌సీఈఆర్‌టీ 8వ తరగతి పాఠ్యపుస్తకంలో 'న్యాయవ్యవస్థపై అవినీతి' అంశం చేర్చారు. మంత్రులు, ప్రభుత్వోద్యోగులు, విచారణ సంస్థలు సహా రాజకీయవేత్తలు పెద్దఎత్తున అవీనీతికి పాల్పడుతున్నారు. ప్రభుత్వాలు ఎందుకు వీటిని దాచిపెడుతున్నాయి? అని సిబల్ ప్రశ్నించారు. న్యాయ మంత్రిత్వ శాఖ సైతం 2016-2025 మధ్య సుప్రీంకోర్టు-హైకోర్టు సిట్టింగ్ జడ్జిలపై సీజేఐ కార్యాలయానికి 7,528 ఫిర్యాదులు వచ్చినట్టు ఇటీవల వెల్లడించింది.


ఇవి కూడా చదవండి..

ప్రధాని మోదీకి అరుదైన గౌరవం.. ఇజ్రాయెల్ పార్లమెంటు భవనం త్రివర్ణ మయం.!

ఢిల్లీలో కాల్పుల కలకలం.. లారెన్స్ బిష్ణోయ్ లీగల్ టీమ్‌పై అటాక్

Updated Date - Feb 25 , 2026 | 03:52 PM