రూ. 30 వేలు ఎర వేస్తే.. రూ. 4 కోట్ల రూపాయలు బయటపడింది..
ABN , Publish Date - Feb 25 , 2026 | 03:39 PM
30 వేల రూపాయలు లంచం తీసుకుంటూ దొరికిన ప్రభుత్వ ఉన్నతాధికారి ఇంట్లో కోట్ల రూపాయల సొమ్ము బయటపడింది. డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ ఇంట్లో విజిలెన్స్ అధికారులు సోదాలు చేయగా రూ. 4 కోట్ల నగదు దొరికింది.
భువనేశ్వర్, ఫిబ్రవరి 25: ఒడిశా విజిలెన్స్ అధికారుల చేతికి భారీ అవినీతి తిమింగలం దొరికింది. 30 వేల రూపాయలు లంచం తీసుకుంటూ దొరికిన ప్రభుత్వ ఉన్నతాధికారి ఇంట్లో కోట్ల రూపాయల సొమ్ము బయటపడింది. ఈ సంఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. కటక్‌కు చెందిన దేబబ్రత మొహంతి డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ మైన్స్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. దేబబ్రత లంచాలకు అలవాటు పడ్డాడు.
తన దగ్గరకు అనుమతుల కోసం వచ్చే వారినుంచి పెద్ద మొత్తంలో లంచాలు తీసుకునే వాడు. ఈ నేపథ్యంలోనే స్థానిక బొగ్గు వ్యాపారి ట్రాన్స్‌పోర్ట్ పర్మిషన్‌ల కోసం దేబబ్రత దగ్గరకు వెళ్లాడు. ట్రాన్స్‌పోర్ట్ పర్మిషన్ ఇవ్వడానికి దేబబ్రత 30 వేల రూపాయలు లంచం అడిగాడు. దీంతో ఆగ్రహానికి గురైన బొగ్గు వ్యాపారి విజిలెన్స్ అధికారులను ఆశ్రయించాడు. మంగళవారం రాత్రి 30 వేల రూపాయల లంచం తీసుకుంటూ ఉండగా అధికారులు దేబబ్రతను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
భువనేశ్వర్, పటియాలోని దేబబ్రత ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో అధికారుల కళ్లు చెదిరేలా భారీ స్థాయిలో డబ్బు, బంగారం దొరికింది. లెక్కల్లో చూపని నాలుగు కోట్ల రూపాయల్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విజిలెన్స్ డైరెక్టర్ యశ్వంత్ జెత్వా మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇది ఒక సాధారణ లంచం కేసు అనుకున్నాం. కానీ, లంచం కేసులో ఇంత పెద్ద మొత్తంలో డబ్బు దొరుకుతుందని ఊహించలేదు. రాష్ట్రంలో ఇంత పెద్ద మొత్తంలో నగదు దొరకటం ఇదే మొదటి సారి’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి
బట్లర్.. పవర్ హౌస్ ఆఫ్ వరల్డ్ క్రికెట్: హ్యారీ బ్రూక్
భారత్-పాక్ యుద్ధాన్ని ఆపకపోయి ఉంటే.. డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్పారంటే..