ఇది అమెరికాకు స్వర్ణయుగం: ట్రంప్
ABN , Publish Date - Feb 25 , 2026 | 11:21 AM
అమెరికా గతంలో కన్నా దృఢంగా, మెరుగ్గా, సుసంపన్నంగా మారిందని ఆ దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఇది అమెరికాకు స్వర్ణయుగం అని పేర్కొన్నారు. స్టేట్ ఆఫ్ ది యూనియన్ కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ.. ఇది చారిత్రాత్మక క్షణంగా అభివర్ణించారు.
వాషింగ్టన్, ఫిబ్రవరి 25: అమెరికా గతంలో కన్నా దృఢంగా, మెరుగ్గా, సుసంపన్నంగా మారిందని ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఇది అమెరికాకు స్వర్ణయుగం అని ఆయన వెల్లడించారు. మంగళవారం స్టేట్ ఆఫ్ ది యూనియన్ కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ.. ఇది చారిత్రాత్మక కాలంగా అభివర్ణించారు. తన పరిపాలన ప్రయాణం.. యుగాలకు మలుపుగా ఉంటుందని తెలిపారు. దేశ ఆర్థికాభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు. భవిష్యత్తులో దేశాన్ని మరింత మెరుగు పరుస్తామని ట్రంప్ విశ్వాసం వ్యక్తం చేశారు.
అలాగే జాతీయ పునరుజ్జీవం, ఆర్థిక వృద్ధితోపాటు ప్రపంచ ప్రభావంపై దృష్టి సారించినట్లు డొనాల్డ్ ట్రంప్ వివరించారు. ప్రపంచ స్థాయిలో అమెరికా మెరుగుపడిందని ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల వరకు అమెరికా సాదాసీదాగా ఉండేదని.. కానీ ప్రస్తుతం ప్రపంచంలోనే అగ్ర భాగాన నిలిచిందని ధీమా వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం.. ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ప్రీడమ్‌ను పురుషుల హాకీ ఒలింపిక్స్ విజేత కానర్ హెల్లెబ్యూక్‌కు ప్రదానం చేయనున్నట్లు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. గత తొమ్మిది మాసాల్లో అమెరికాలోకి ప్రవేశించిన అక్రమ వలసదారులు శాతం సున్నాకు చేరిందని పేర్కొన్నారు. 2028లో ఒలింపిక్స్‌కు అమెరికా వేదిక కానుందని ప్రకటించారు. ప్రజలకు జవాబుదారీగా ఉండే ప్రభుత్వాన్ని నిర్మిస్తున్నామని ప్రజలకు భరోసా ఇచ్చారు. పౌరుల సంక్షేమానికే తమ తొలి ప్రాధాన్యమన్నారు. బిగ్ బ్యూటిపుల్ బిల్‌తో అమెరికన్లకు ఉపశమనం కలిగిందన్నారు.
అలాగే సరిహద్దు భద్రత, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా పూర్తిగా నిరోధించామని ట్రంప్ చెప్పారు. దేశంలోని ఆర్థిక అంశాలను సైతం ఈ సందర్భంగా ట్రంప్ ప్రస్తావించారు. గ్యాస్ ధరలు తగ్గించామని.. ఆ తర్వాత అంటే.. మూడు నెలల్లో యూఎస్ ఆర్థిక వ్యవస్థ పుంజుకుందన్నారు.
తమ కొత్త స్నేహితుడు, భాగస్వామి అయిన వెనిజులా నుంచి 80 మిలియన్ బ్యారెళ్ల చమురును తీసుకున్నామని ఆయన వివరించారు. ఇదంతా ఆ దేశ నాయకుడు నికోలస్ మదురోను పదవీచ్యుతుడిని చేసిన నాటి నుంచి నేటి వరకు ఇది చోటు చేసుకుందన్నారు. దాంతో ఆమెరికా చమురు ఉత్పత్తి రోజుకు 60 వేల బ్యారెళ్ల మేర పెరిగిందని సోదాహరణగా విపులీకరించారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారంలో చేసిన ప్రతిజ్ఞ.. డ్రిల్, బేబీ, డ్రిల్‌ను ట్రంప్ ఉటంకించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Read Latest International News and National News