వివాదంలో బీఎస్ఎన్ఎల్ డైరెక్టర్ పర్యటన.. కేంద్రం షోకాజ్ నోటీసు
ABN , Publish Date - Feb 25 , 2026 | 04:01 PM
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ సీనియర్ డైరెక్టర్ వివేక్ బంజల్ వివాదంలో చిక్కుకున్నారు. యూపీలోని ప్రయాగ్‌రాజ్ పర్యటనకు వెళ్లేందుకు ఆయన విస్తృత ఏర్పాట్లు చేసుకోవడం, ఇందుకు సంబంధించిన ఆయన చేసిన డిమాండ్లు వైరల్ కావడంతో కేంద్రం సీరియస్ అయింది.
న్యూఢిల్లీ: భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSLN) సీనియర్ డైరెక్టర్ వివేక్ బంజల్ (Vivek Banzal) వివాదంలో చిక్కుకున్నారు. యూపీలోని ప్రయాగ్‌రాజ్ పర్యటనకు వెళ్లేందుకు ఆయన విస్తృత ఏర్పాట్లు చేసుకోవడం, ఇందుకు సంబంధించిన ఆయన చేసిన డిమాండ్లు వైరల్ కావడంతో కేంద్రం సీరియస్ అయింది. ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ వ్యవహారం తమకు దిగ్భ్రాంతి కలిగించిందని, ఇదెంతమాత్రం ఆమోదయోగ్యం కాదని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. అధికారి వివరణ తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
వివాదం ఇలా..
షెడ్యూల్ ప్రకారం వివేక్ బంజాల్ ఈనెల 25-26 తేదీల్లో ప్రయాగ్‌రాజ్ పర్యటనకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఆయన పర్యటనకు ఏర్పాట్లు చేయాలని డిప్యూటీ మేనేజర్ స్థాయి కార్యాలయం నుంచి ఆదేశాలు వెళ్లాయి. సుమారు 50 మంది బీఎస్ఎన్ఎల్ సిబ్బందిని కేటాయించాలని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. సిబ్బందికి 20 పనులు కూడా కేటాయించారు. ప్రయాగ్‌రాజ్‌లో అడుగుపెట్టగానే సంగమంలో స్నానం, పడవపై విహారం, హనుమాన్ మందిరం, అక్షయ్ వాత్, పాటల్పురి ఆలయాల దర్శనం చేయించడం వంటి పనులు సిబ్బంది చూసుకోవాల్సి ఉంటుంది. తువాలు, అండర్ గార్మెంట్స్, చెప్పులు, దువ్వెన, అద్దం, షాంపూ, ఆయిల్ బాటిల్, ఘాట్ వద్ద వినియోగానికి ఒక బెడ్‌షీటు వంటివి అందుబాటులో ఉంచాలి. హోటల్, సర్క్యూట్ హౌస్ వంటి సదుపాయాలు కల్పించాలి.
బంజల్ పర్యటనకు సంబంధించిన ఆదేశాలు ఆన్‌లైన్‌లో వెలుగుచూడటంతో ఈ వ్యవహారం సంచలనమైంది. కేంద్ర వెంటనే చర్యలకు దిగడం, షోకాజ్ నోటీస్ జారీచేయడంలో బంజల్ పర్యటన రద్దయింది. అయితే, అధికారిక పర్యటనలో ఇచ్చే స్థాయీ ఉత్తర్వులనే తాము ఇచ్చినట్టు బీఎస్ఎన్ఎల్ ఇండియా వర్గాలు చెబుతున్నాయి.
ఎవరీ బంజల్
బంజల్ 1987 బ్యాచ్ ఇండియన్ టెలికమ్యూనికేషన్ సర్వీస్ అధికారి. ఎలక్ట్రానిక్స్‌లో బ్యాచిలర్ ఆఫ్ ఇంజినీరింగ్ డిగ్రీ, కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్ ఆఫ్ ఇంజినీరింగ్ డిగ్రీ చేసారు. ఎంబీఏ కూడా చదివారు. ఇండియాలో టెలికామ్ నెట్‌వర్క్ నిర్వహణలో 34 ఏళ్ల అనుభవం ఉంది.
ఇవి కూడా చదవండి..
న్యాయవ్యవస్థలో అవినీతిపై పాఠ్యాంశం.. ఎన్‌సీఈఆర్‌టీపై సుప్రీం సీరియస్
ప్రధాని మోదీకి అరుదైన గౌరవం.. ఇజ్రాయెల్ పార్లమెంటు భవనం త్రివర్ణ మయం.!