Share News

మీ కిడ్నీలు ఎంత సురక్షితం?

ABN , Publish Date - Mar 16 , 2026 | 11:49 AM

ఏటా కిడ్నీ సమస్యలతో బాధితులు పెరుగుతున్నారు. దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం లక్షకుపైగా కొత్త మూత్రపిండ వైఫల్యాల కేసులు బయటపడుతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.

మీ కిడ్నీలు ఎంత సురక్షితం?

  • ఏటా పెరుగుతున్న బాధితులు

  • బీపీ, షుగర్‌ బాధితులూ జాగ్రత్త

  • జీవనశైలిలో మార్పుతో మూత్రపిండాలకు గండం

సంగారెడ్డి: ఏటా కిడ్నీ సమస్యలతో బాధితులు పెరుగుతున్నారు. దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం లక్షకుపైగా కొత్త మూత్రపిండ వైఫల్యాల కేసులు బయటపడుతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో మన కిడ్నీలు కాపోడుకోవడం మన చేతుల్లోనే ఉందని వైద్యులు సూచిస్తున్నారు. కిడ్నీలు మన శరీరంలో రక్తాన్ని శుద్ధిచేయడం, వ్యర్థపదార్ధాలను బయటకు పంపించడం, శరీరంలో ద్రవ సమతౌల్యాన్ని నిలుపుకోవడం, రక్తపోటును నియంత్రించడం వంటి ముఖ్యమైన పనులు చేస్తాయి.


కిడ్నీ వ్యాధికి కారణాలు

సాధారణంగా కిడ్నీ జబ్బులను సైలెంట్‌ కిల్లర్‌ అని అంటారు. చాలా మందికి సమస్య బయటపడే సమయానికి మూత్రపిండాలు 60-70 శాతం పాడైపోయి ఉంటున్నాయి. కిడ్నీ సమస్యలకు ప్రధాన కారణాలు హైబీపీ, మధుమేహం. ఈ రెండు ఇప్పుడు కిడ్నీ సమస్యలను తెచ్చిపెడుతున్నాయి. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, చక్కెర, ఉప్పు అధిక వినియోగం, ఊబకాయం వంటివి ఈ సమస్యను మరింత జటిలం చేస్తున్నాయి. ముఖ్యంగా 30 ఏళ్లలోపు వారిలో కూడా మధుమేహం, హైబీపీ వంటి సమస్యలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.


city9.2.jpgమూత్రపిండాల సంరక్షణకు ఏం చేయాలి?

రోజుకు సరిపడా నీరుతాగాలి. మధుమేహం ఉన్న వారు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రణలో ఉంచాలి. రక్తపోటు నియంత్రణలో ఉంచుకోవాలి. ఉప్పు వినియోగాన్ని తగ్గించాలి. డాక్టర్‌ సలహా లేకుండా నొప్పి నివారణ మాత్రలు, స్టెరాయిడ్స్‌ ఎక్కువగా వాడకూడదు. నిత్యం వ్యాయామం చేసి ఆరోగ్యకరమైన బరువును నియంత్రించుకోవాలి. పొగత్రాగడం, మద్యం సేవించడం మానుకోవాలి. కుటుంబచరిత్ర వంటి రిస్క్‌ ఫ్యాక్టర్లను తెలుసుకోవాలి. సమతుల ఆహారం తీసుకోవాలి. బీపీ, షుగర్‌ బాధితులు క్రమం తప్పకుండా కిడ్నీ పరీక్షలు నిరంతరం చేయించుకోవాలి. కాళ్లు ఉబ్బడం, మూత్ర పరిమాణం తగ్గడం, అలసట, రక్తపోటు పెరగడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.


కిడ్నీ జబ్బు సైలెంట్‌ కిల్లర్‌

వేసవిలో అధిక చెమటతో శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంది. సరిపడా తీరు తాగకపోతే రక్త గడ్డకట్టినట్లు మందగిస్తుంది. దీంతో కిడ్నీలు ఎక్కువ శ్రమ పడాల్సి వస్తుంది. శరీరానికి సరిపడా నీరు అందక కిడ్నీ స్టోన్స్‌, యూరినరీ ఇన్ఫెక్షన్లు వస్తాయి. డీ హైడ్రేషన్‌తో కిడ్నీ పనితీరు తగ్గడం కారణంగా కిడ్నీ సమస్యలు ఉన్న వారు జాగ్రత్తగా ఉండాలి. కిడ్నీ వ్యాధులు ప్రారంభదశలో గుర్తిస్తే చికిత్స ద్వారా నియంత్రించుకోవచ్చు. సమస్య వచ్చిన తర్వాత డాక్టర్ల దగ్గరికి పరిగెత్తడం కంటే ముందు జాగ్రత్తలు పాటించడం మేలు. డయాలసిస్‌ కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సల వరకూ పోకుండా కిడ్నీలు కాపాడుకోవడం మన చేతుల్లోనే ఉంది.

- డా.ఎస్.ఆనంద్‌, యూరాలజిస్ట్‌, జీజీహెచ్‌, సంగారెడ్డి


ఈ వార్తలు కూడా చదవండి:

రుచిగా ఉందని తిన్నారో..!

బ్రికెట్స్‌ స్టవ్‌ C/O బాలానగర్‌

Read Latest Telangana News and National News

Updated Date - Mar 16 , 2026 | 11:49 AM