బ్రికెట్స్ స్టవ్ C/O బాలానగర్
ABN , Publish Date - Mar 16 , 2026 | 10:41 AM
ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ప్రజలను గ్యాస్ కష్టాలు వెంటాడుతున్నాయి. పరిశ్రమలు, రెస్టారెంట్లు, హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, ఆటోలు ఇలా అన్ని రంగాలకు గ్యాస్ కష్టాలు తప్పడం లేదు.
గ్యాస్‌కు ప్రత్యామ్నాయంగా తెరపైకి
హైదరాబాద్: ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ప్రజలను గ్యాస్ కష్టాలు వెంటాడుతున్నాయి. పరిశ్రమలు, రెస్టారెంట్లు, హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, ఆటోలు ఇలా అన్ని రంగాలకు గ్యాస్ కష్టాలు తప్పడం లేదు. ఇప్పటికే కొన్ని హోటల్స్, రెస్టారెంట్లు, హాస్టళ్లు మూతపడ్డాయి. గత 4 రోజుల నుంచి బుకింగ్స్ అమాంతం పెరగడంతో సర్వర్లు సైతం మొరాయిస్తుండడంతో గ్యాస్ ఏజెన్సీల వద్ద వినియోగదారులు క్యూ కడుతున్నారు.
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు..
గ్యాస్ కొరతతో తప్పనిసరి పరిస్థితిలో కొందరు వ్యాపారులు, హోటల్స్ నిర్వాహకులు కట్టెల పొయ్యిపై వంటలు చేస్తుంటే, స్టార్ హోటల్స్ సైతం చేసేది లేక ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటున్నాయి. ఈ క్రమంలో బ్రికెట్స్ (బయో డీగ్రేడబుల్ వ్యర్థాలతో తయారు చేసిన ఇందనం) వినియోగించి తయారు చేసిన స్టవ్‌లకు ఆదరణ పెరుగుతోంది. వీటిని కొనుగోలు చేసేందుకు హోటళ్ల వారు ముందుకు వస్తున్నారు.
రోజుకు 2 వేల టన్నుల బ్రికెట్స్..
గ్యాస్ కొరత కారణంగా చాలా మంది బయోమాస్ బ్రికెట్స్‌ను వినియోగించేందుకు మొగ్గుచూపుతున్నారు. నగర శివారు ప్రాంతాలు మేడ్చెల్, పటాన్‌చెరువు, శంషాబాద్, దండుమల్కాపూర్ పారిశామ్రిక ప్రాంతాలలో సుమారు 30కి పైగా పరిశ్రమలు రోజుకు 2వేల టన్నుల బయోమాస్ బ్రికెట్స్‌ను తయారు చేసేవి. ఎల్‌పీజీ కొరత కారణంగా ఇప్పుడు 4 వేల టన్నుల వరకు ఉత్పత్తి చేస్తున్నట్లు దండు మల్కాపూర్ పారిశ్రామికవాడకు చెందిన బ్రికెట్స్ పరిశ్రమ నిర్వాహకుడు ఆంధ్రజ్యోతికి వివరించారు.
పెరుగుతున్న ఆదరణ..
ఎల్‌పీజీకి ప్రత్యామ్నాయ ఇందనంగా బ్రికెట్స్ ఇప్పటికే పరిశ్రమలను ఆకర్షించాయి. ప్రస్తుతం బాలానగర్ ఫిరోజ్‌గూడలో ఉన్న శ్రీ ఇంజనీరింగ్ వారి బ్రికెట్స్ ఇందనంగా మండే జ్వాల స్టవ్‌లను కొనుగోలు చేసేందుకు హోటల్, రెస్టారెంట్లు, హాస్టళ్లు, టిఫిన్ సెంటర్ల నిర్వాహకులు ఆసక్తి చూపుతున్నారు. 9, 12, 16 అంగుళాల వెడల్పు గల బర్నర్లతో తయారుచేసిన పొయ్యిలు రూ.19 నుంచి 36 వేల వరకు లభిస్తున్నాయి. ఈ జ్వాల స్టవ్‌లతో 4 నుంచి 12 కేజీల బ్రికెట్స్‌ను వినియోగించి 100కిలోల వరకు వంటపదార్థాలు వండ వచ్చునని తయారీదారులు చెబుతున్నారు. 19 కేజీల కమర్షియల్ సిలిండర్‌కు సుమారు. రూ.2వేల ఖర్చు అయితే, జ్వాల స్టౌవ్‌లలో వినియోగించే బ్రికెట్స్ కిలో రూ. 12 చొప్పున 50 కిలోలకు రూ.600 మాత్రమే అవుతుందని శ్రీ ఇంజనీరింగ్ నిర్వాహకుడు అనిల్‌కుమార్ చెప్పారు.
రోడ్ల పక్కన పడి ఉన్న చెట్ల కొమ్మలు, ఆకులు, తాగి పడేసిన కొబ్బరి బొండాలు, ఊక పొట్టు, పల్లి పొట్టు, ఎండిపోయిన కంది, సోయాబీన్, ఆయుర్వేద మొక్కల వ్యర్థాలు, తిని పడేసిన మొక్కజొన్న కండెలను వివిధ ప్రాంతాల నుంచి సేకరిస్తారు. ఈ వ్యర్థాలను పొట్టుగా మార్చి చిన్న మిషన్‌లో గట్టిగా కుదించి వివిధ సైజుల్లో బ్రికెట్స్‌గా తయారు చేస్తారు. మామూలు రోజుల్లో కిలో బ్రికెట్స్ ధర రూ.10లు ఉండగా, గ్యాస్ కొరత కారణంగా తయారీదారులు వీటిని కిలో రూ.12-16కు పెంచి విక్రయిస్తున్నారు.
బల్క్ ఆర్డర్లు వస్తున్నాయి
బ్రికెట్స్ ఇందనంగా పనిచేసే డొమెస్టిక్, కమర్షియల్ స్టవ్‌లను శ్రీ ఇంజనీరింగ్‌లో తయారు చేశాం. వీటిని మన దేశంతో పాటు భూటాన్, నేపాల్, బర్మా, టాంజానియా, వంటి దేశాల్లో వినియోగిస్తున్నారు. 19కేజీల సిలిండర్ సుమారు 60 కిలోల బ్రికెట్స్‌కు సమానం. ఎల్‌పీజీ కొరత కారణంగా వీటికి ఆదరణ మరింత పెరిగింది. మన రాష్ట్రంతో పాటు పొరుగు రాష్ట్రాలకు చెందిన పెద్ద పెద్ద హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులు బల్క్‌గా బుక్ చేసుకుంటున్నారు.
- వి.అనిల్‌కుమార్, శ్రీ ఇంజనీరింగ్ సీఈవో, బాలానగర్
బ్రికెట్ స్టవ్ కొంటున్నా
కొండాపూర్‌లో టిఫిన్ సెంటర్ నిర్వహిస్తున్నాం. హాస్టళ్లు, క్యాటరింగ్ వారితో పాటు ఆన్‌లైన్‌లో ఆర్డర్లు తీసుకుని టిఫిన్లు అందజేస్తుంటాం. ఎల్‌పీజీ కొరత కారణంగావ్యాపారం దెబ్బ తినకూడదని ఆన్‌లైన్‌లో వెతికి బ్రికెట్స్ ఇందనంగా మండే స్టవ్‌లను కొనుగోలు చేస్తున్నా.
- చంద్రశేఖర్, టిఫిన్ సెంటర్ నిర్వాహకుడు
ఈ వార్తలు కూడా చదవండి:
‘డ్యాన్సింగ్ మిసైల్స్’తో ఇరాన్ దాడులు!
Read Latest Telangana News and National News