Share News

‘డ్యాన్సింగ్ మిసైల్స్‌‌’తో ఇరాన్ దాడులు!

ABN , Publish Date - Mar 16 , 2026 | 08:54 AM

ఇరాన్ తొలిసారిగా ‘డ్యాన్సింగ్ మిసైల్స్‌’తో అమెరికా, ఇజ్రాయెల్ స్థావరాలపై విరుచుకుపడ్డట్టు అక్కడి మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ మిసైల్ విశేషాలు ఏంటంటే..

‘డ్యాన్సింగ్ మిసైల్స్‌‌’తో ఇరాన్ దాడులు!
Iran dancing missile

ఇంటర్నెట్ డెస్క్: గల్ఫ్‌లోని అమెరికా, ఇజ్రాయెల్ స్థావరాలపై ఇరాన్ దాడులు కొనసాగిస్తోంది. ఆదివారం తొలిసారిగా ‘డ్యాన్సింగ్ మిసైల్స్‌’‌తో ఇరాన్ దాడులకు దిగినట్టు స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి. డ్యాన్సింగ్ మిసైల్‌తో పాటు ఇరాన్ ఈసారి తన అమ్ములపొదిలోంచి పలు ఇతర అస్త్రాలను ప్రయోగించినట్టు తెలిసింది.

ఏమిటీ ‘డ్యాన్సింగ్ మిసైల్’?

ఈ మిసైల్ అసలు పేరు సెజిల్-2. ఇది బాలిస్టిక్ క్షిపణి అయినప్పటికీ దీనికి శత్రుదేశాలకు చిక్కకుండా పలుమార్లు తన దిశను స్వల్ప స్థాయిలో మార్చుకునే సామర్థ్యం ఉంది. డ్యాన్స్ చేస్తున్నట్లు పలుమార్లు దిశను మార్చుకునే ఈ మిసైల్‌ను అక్కడి మీడియా డ్యాన్సింగ్ మిసైల్‌గా పిలుస్తోంది.

18 మీటర్ల పొడవు, 1.25 మీటర్ల వ్యాసార్థం ఉండే ఈ మిసైల్ గరిష్ఠంగా 2 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. 700 కిలోగ్రాముల పేలుడు పదార్థాలను తీసుకెళ్లగలదు. ఘన ఇంధనం వినియోగించే ఈ మిసైల్‌ను ప్రయోగించడం షహాబ్ మిసైల్స్‌తో పోలిస్తే మరింత సులువని నిపుణులు చెబుతున్నారు.


సెజిల్ రకం మిసైల్స్‌ అభివృద్ధిపై ఇరాన్ 1990ల నుంచే దృష్టి సారించింది. 2008లో తొలిసారిగా ఈ మిసైల్‌ను ప్రయోగించింది. అప్పట్లో ఈ క్షిపణి గరిష్ఠంగా 800 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించింది. ఆ మరుసటి ఏడాది మిసైల్ నావిగేషన్, గైడెన్స్ వ్యవస్థలను మరింతగా అభివృద్ధి పరిచారు. ఈ క్రమంలో మరో నాలుగు సార్లు క్షిపణి ప్రయోగాలు నిర్వహించారు. చివరకు 2 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను సైతం ఛేదించేలా మిసైల్‌ను అభివృద్ధి చేశారు.

రెండు వారాలుగా సాగుతున్న ఈ యుద్ధంలో దాదాపు 2 వేల మంది సామాన్యులు మరణించారు. వీరిలో అత్యధికులు ఇరాన్‌కు చెందిన వారే. ఇక ఇరాన్ దాడుల్లో అమెరికా కూడా పలువురు సైనిక సిబ్బందిని కోల్పోయింది.


ఇవి కూడా చదవండి:

ఇదిగో.. నాకు ఐదు వేళ్లే ఉన్నాయ్! నెతన్యాహు కొత్త వీడియో

నెతన్యాహును వెంటాడి చంపుతాం: ఇరాన్ మిలిటరీ

Updated Date - Mar 16 , 2026 | 09:31 AM