ఇదిగో.. నాకు ఐదు వేళ్లే ఉన్నాయ్! నెతన్యాహు కొత్త వీడియో
ABN , Publish Date - Mar 15 , 2026 | 09:34 PM
తాను క్షేమంగానే ఉన్నానంటూ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మరో వీడియోను రిలీజ్ చేశారు. తనపై వచ్చిన వదంతులను ఖండించారు.
ఇంటర్నెట్ డెస్క్: ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తనపై వస్తున్న వదంతులకు చెక్ పెట్టారు. ఇరాన్ దాడుల్లో నెతన్యాహు మరణించారన్న వార్తలు ప్రస్తుతం చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ఈ వార్తలను ఆయన ఖండించారు. కాఫీ తాగుతూ ఆయన ఈ వార్తలపై సెటైరికల్‌గా స్పందించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
ఈ వీడియోలో నెతన్యాహు ఓ షాపులో కాఫీ ఆర్డరిస్తూ వందతులపై స్పందించారు. తన మరణంపై వచ్చిన వార్తలు అవాస్తవమని అన్నారు. తనకేమీ కాలేదని స్పష్టం చేశారు. ప్రాణాలు పోయినా తన దేశాన్ని అభిమానిస్తూనే ఉంటానని అన్నారు. ఈ క్లిష్ట పరిస్థితులను ఇజ్రాయెల్ ప్రజలు గొప్పగా ఎదుర్కున్నారని కూడా కితాబునిచ్చారు.
ఇక ఇటీవల విడుదలైన వీడియోలో తన చేతికి ఆరు వేళ్లు ఉన్నట్టు కనిపించడంపై కూడా ఇజ్రాయెల్ ప్రధాని సెటైరికల్‌గా స్పందించారు. తన చేతికి ఐదే వేళ్లు ఉన్నాయని చేయి చూపిస్తూ కామెంట్ చేశారు. రెండు చేతులనూ చూపిస్తూ వదంతులను కొట్టిపారేశారు. ఎప్పటిలాగే తాను తన విధుల్లో నిమగ్నమయ్యానని చెప్పారు. ఇక నెతన్యాహుపై వస్తున్న వార్తలను అంతకుముందు ఆయన కార్యాలయం కూడా ఖండించింది. అవన్నీ అసత్యాలని, ప్రధాని క్షేమంగా ఉన్నారని స్పష్టం చేసింది.
మరోవైపు, నెతన్యాహును వెంటాడి అంతమొందిస్తామని ఇరాన్ మిలిటరీ ఆదివారం తేల్చి చెప్పింది. చిన్నారులను పొట్టనపెట్టుకున్న ఇజ్రాయెల్ ప్రధానిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. మరోవైపు, గల్ఫ్ ప్రాంతంలో పలు చోట్ల ఇరాన్ నేడు కూడా తన దాడులను కొనసాగించింది. ఇజ్రాయెల్‌పై క్లస్టర్ బాంబులను కూడా ప్రయోగించినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ఇవి కూడా చదవండి:
నెతన్యాహును వెంటాడి చంపుతాం: ఇరాన్ మిలిటరీ
మా డ్రోన్లు కాపీ చేసి మాపైనే నిందలు.. ఇరాన్ ఘాటు వ్యాఖ్యలు