Share News

మా డ్రోన్లు కాపీ చేసి మాపైనే నిందలు.. ఇరాన్ ఘాటు వ్యాఖ్యలు

ABN , Publish Date - Mar 15 , 2026 | 12:47 PM

ఇజ్రాయెల్, అమెరికాలపై ఇరాన్ ఘాటు విమర్శలు చేసింది. అమెరికా, ఇజ్రాయెల్‌లు తమ షాహెద్‌-136 మోడల్ డ్రోన్లను రూపొందించి పలు దేశాలపై దాడులకు పాల్పడుతూ.. ఆ నిందను తమపై మోపుతున్నాయని ఇరాన్ మండిపడింది.

మా డ్రోన్లు కాపీ చేసి మాపైనే నిందలు.. ఇరాన్ ఘాటు వ్యాఖ్యలు
Iran US Israel drone conflict

ఇంటర్నెట్ డెస్క్: ఇజ్రాయెల్, అమెరికాలపై ఇరాన్ ఘాటు విమర్శలు చేసింది. అమెరికా, ఇజ్రాయెల్‌లు తమ షాహెద్‌-136 మోడల్ డ్రోన్లను రూపొందించి పలు దేశాలపై దాడులకు పాల్పడుతూ.. ఆ నిందను తమపై మోపుతున్నాయని ఇరాన్ మండిపడింది. ప్రపంచ దేశాల ముందు ఇరాన్‌ను ఉద్దేశపూర్వకంగా ఇరికించేందుకు ఆ డ్రోన్లను జనావాసాలపైకి ప్రయోగిస్తున్నాయని ఇరాన్ సైనిక అధికారి చెప్పినట్లు స్థానిక మీడియా ప్రెస్ టీవీ తెలిపింది.


తమ సైనిక సవాళ్లను ఎదుర్కోవడంతో పాటు టెహ్రాన్‌కు వ్యతిరేకంగా రాజకీయ శక్తులను కూడగట్టడంలో అమెరికా, ఇజ్రాయెల్‌ విఫలమయ్యాయని, దీంతో మోసపూరిత పనుల వైపు మొగ్గు చూపుతున్నారని ఇరాన్ ఆరోపించింది. తుర్కియే, కువైట్, ఇరాక్ వంటి దేశాల్లో ఇటీవల అనేక అనుమానాస్పద దాడులు జరిగాయని, ఈ ఘటనలకు ఇరాన్‌ బలగాలే కారణమని పాశ్చాత్య మీడియా, శత్రు సంస్థలు నిందలు మోపాయని ఇరాన్ ఆరోపించింది. ఇలా దాడులు చేసి ఇరాన్‌పై అనుమానాలు రేకెత్తించడంతోపాటు పొరుగు దేశాలతో సంబంధాలను దెబ్బతీయడమే లక్ష్యంగా శత్రు దేశాలు పనిచేస్తున్నాయని ఇరాన్ సైనిక ప్రతినిధి ఒకరు పేర్కొన్నట్లు ప్రెస్ టీవీ తెలిపింది.


ఇటీవల సైప్రస్‌లోని బ్రిటన్‌ రాయల్ ఎయిర్ ఫోర్స్ అక్రోటిరి స్థావరంపై ఓ డ్రోన్‌ దాడి జరిగిందని.. అయితే దీని వెనుక తమ ప్రమేయం లేదని ఇరాన్ సైనిక అధికారి స్పష్టం చేశారు. ఇరాన్ సైనిక కార్యకలాపాలు అత్యంత క్రమశిక్షణతో కొనసాగుతున్నాయని, ఎంపిక చేసిన లక్ష్యాలపైనే తాము దాడులు చేస్తున్నామని తెలిపారు. వారి మోసాలను అడ్డుకునేందుకు ప్రాంతీయ సహకారం అవసరమని సదరు అధికారి వెల్లడించారని ప్రెస్ టీవి పేర్కొంది.


ప్రాంతీయ దేశాలు ఐక్యత, సహకారాన్ని కొనసాగిస్తూ శత్రువుల దురాక్రమణను నిలువరించడం చాలా అవసరమని ఇరాన్ తెలిపినట్లు ప్రెస్ టీవీ వెల్లడించింది. మరోవైపు గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఇజ్రాయెల్‌-అమెరికా, ఇరాన్‌ల మధ్య యుద్ధంలో డ్రోన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. అగ్రరాజ్య స్థావరాలపై దాడుల పేరిట పశ్చిమాసియాలోని ఆయా దేశాలపై ఇరాన్‌ పెద్దఎత్తున షాహెద్‌ డ్రోన్లను ప్రయోగిస్తోంది. ఈ నేపథ్యంలోనే అమెరికా, ఇజ్రాయెల్ పై ఇరాన్ ఈ విమర్శలు చేసింది.


ఇవి కూడా చదవండి:

నెతన్యాహు మరణవార్త 'ఫేక్ న్యూస్'.. క్లారిటీ ఇచ్చిన ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం!

సీబీఎస్ఈ షాకింగ్ నిర్ణయం..12వ తరగతి పరీక్షలు రద్దు

Updated Date - Mar 15 , 2026 | 01:32 PM