సీబీఎస్ఈ షాకింగ్ నిర్ణయం..12వ తరగతి పరీక్షలు రద్దు
ABN , Publish Date - Mar 15 , 2026 | 11:42 AM
ఇరాన్ , అమెరికా- ఇజ్రాయెల్‌ల పరస్పర దాడులతో పశ్చిమాసియా దేశాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యూకేషన్ కీలక నిర్ణయం తీసుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్ , అమెరికా- ఇజ్రాయెల్‌ల పరస్పర దాడులతో పశ్చిమాసియా దేశాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యూకేషన్(CBSE) కీలక నిర్ణయం తీసుకుంది. గల్ఫ్ దేశాల్లో ఈనెల 16 నుంచి జరగాల్సిన 12వ తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు సీబీఎస్ఈ ప్రకటించింది. ఈ మేరకు సీబీఎస్ఈ మార్చి15న( ఆదివారం) ప్రకటన వెలువరించింది.
'గల్ఫ్ దేశాలైన బహ్రెయిన్, ఇరాన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యుఏఇ విద్యార్థుల విషయంలో 2026 మార్చి 16 నుంచి 2026 ఏప్రిల్ 10 వరకు 12వ తరగతి పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ఈ పరీక్షలు రద్దయ్యాయి. ఈ దేశాల్లో 12వ తరగతి విద్యార్థుల పరీక్షలు, ఫలితాల ప్రకటన విధానంపై తగిన సమయంలో విడిగా తెలియజేస్తాము' అని సర్క్యులర్‌లో పేర్కొంది. పశ్చిమాసియాలో మార్చి 11 వరకు నిర్వహించాల్సిన 10వ తరగతి బోర్డు పరీక్షలన్నింటినీ రద్దు చేస్తున్నట్లు ఇప్పటికే సీబీఎస్‌ఈ ప్రకటన వెలువరించిన సంగతి తెలిసిందే. పశ్చిమాసియా దేశాల్లోని సీబీఎస్ఈ అనుబంధ పాఠశాలల ప్రిన్సిపాల్‌లు ఈ మేరకు విద్యార్థులకు తెలియజేయాలని తన ప్రకటనలో పేర్కొంది.
గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు
2026 ఫిబ్రవరి 28న, అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై సైనిక దాడులు ప్రారంభించాయి. తొలి రోజే ఈదాడుల్లో అప్పటి ఇరాన్ సుప్రీం నాయకుడు ఆయతుల్లా అలీ ఖమేనీ మృతి చెందారు. ఇజ్రాయెల్, యుఏఇ, బహ్రెయిన్, కువైట్, జోర్డాన్, సౌదీ అరేబియాతో సహా అనేక గల్ఫ్ దేశాలలోని అమెరికన్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ కూడా దాడులు చేస్తోంది. ఇరువైపుల దాడులు కారణంగా పశ్చిమాసియా ప్రాంతాల్లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఈ క్రమంలో విద్యార్థుల మానసిక స్థితి, వారి పరిస్థితులను పరిగణలోకి తీసుకుని అక్కడ నిర్వహించాల్సిన పలు పరీక్షలను రద్దు చేసేందుకు సీబీఎస్ఈ మొగ్గు చూపింది.
ఇవి కూడా చదవండి:
ఉగాది నుంచి ఈ రాశులకు బంగారు సిరులు..!
ప్రజాసమస్యల పరిష్కారంలో ‘ఆంధ్రజ్యోతి’ది కీలక పాత్ర: ఎమ్మెల్యే పులివర్తి నాని