నెతన్యాహును వెంటాడి చంపుతాం: ఇరాన్ మిలిటరీ
ABN , Publish Date - Mar 15 , 2026 | 03:28 PM
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆచూకీపై వదంతులు వ్యాపిస్తున్న వేళ ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ఘాటు హెచ్చరిక చేసింది. ఆయన బతికి ఉంటే వెంటాడి మరీ అంతమొందిస్తామని సోషల్ మీడియాలో ప్రకటించింది.
ఇంటర్నెట్ డెస్క్: ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు గత కొంతకాలంగా బహిరంగ కార్యక్రమాల్లో కనిపించకపోవడంతో రకరకాల వదంతులు బయలుదేరాయి. ఈ నేపథ్యంలో ఆదివారం ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్ ఘాటు హెచ్చరిక చేసింది. నెతన్యాహు బతికి ఉన్నట్టే అయితే ఆయనను వెంటాడి మరీ అంతమొందిస్తామని హెచ్చరించింది. సోషల్ మీడియాలో ఈ మేరకు గట్టి వార్నింగ్ ఇచ్చింది. చిన్నారులను పొట్టనపెట్టుకున్న ఆయనను వదిలిపెట్టబోమని స్పష్టం చేసింది.
ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా ఘర్షణలు మొదలై ఇప్పటికే రెండు వారాలు గడిచిపోయాయి. మరోవైపు, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కొన్ని రోజులుగా బహిరంగ ప్రదేశాల్లో కనిపించకపోవడంతో ఆయన ఆచూకీ విషయంలో రకరకాల వదంతులు వ్యాపించాయి. ఈ క్రమంలో ఇటీవల నెతన్యాహు పత్రికా సమావేశానికి సంబంధించిన వీడియో విడుదల కావడంతో అనుమానాలు మరింత బలపడ్డాయి. వీడియోలో నెతన్యాహు చేతికి ఏకంగా ఆరు వేళ్లు ఉండటం గమనించిన కొందరు అది ఏఐతో చేసిన వీడియో అని కామెంట్ చేశారు. ఈ క్రమంలో అమెరికా రాజకీయాల విశ్లేషకురాలు కాండిస్ ఓవెన్స్ కూడా నెతన్యాహు ఎక్కడ? అని ప్రశ్నించడం మరింత కలకలం రేపింది.
ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం కూడా స్పందించింది. ప్రధాని క్షేమంగా ఉన్నారని ఎక్స్ వేదికగా స్పష్టం చేసింది. నెట్టింట ప్రచారంలో ఉన్న వదంతులను కొట్టిపారేసింది. ఇక నెతన్యాహు తనయుడు కూడా కొన్ని రోజులుగా కనిపించట్లేదన్న వార్త కూడా ప్రస్తుతం కలకలం రేపుతోంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆయన మార్చ్ 9 నుంచి ఎలాంటి పోస్టులు పెట్టకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక ఈ యుద్ధంలో ఇప్పటివరకూ దాదాపు 2 వేల మంది మరణించగా వారిలో అధిక శాతం మంది ఇరాన్ పౌరులేనని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ఇవి కూడా చదవండి:
మా డ్రోన్లు కాపీ చేసి మాపైనే నిందలు.. ఇరాన్ ఘాటు వ్యాఖ్యలు
నెతన్యాహు మరణవార్త 'ఫేక్ న్యూస్'.. క్లారిటీ ఇచ్చిన ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం