హలీమ్‌లో పోషక విలువలు
ABN , Publish Date - Mar 22 , 2026 | 12:17 PM
రంజాన్ మాసంలో ఎక్కువగా హలీమ్ వంటకం గురించి వింటుంటాం. హైదరాబాద్ బిర్యానీలా హలీమ్ కూడా చాలా ప్రసిద్ధి పొందింది.
రంజాన్ మాసంలో ఎక్కువగా హలీమ్ వంటకం గురించి వింటుంటాం. హైదరాబాద్ బిర్యానీలా హలీమ్ కూడా చాలా ప్రసిద్ధి పొందింది. హలీమ్‌లో ఉన్న పోషక విలువలు తెలియజేస్తారా?
- పర్వీన్, మహబూబ్‌నగర్
రంజాన్ మాసంలో ప్రత్యేకంగా తయారుచేసే హలీమ్ కూడా హైదరాబాద్ బిర్యానీలా ఎంతో ప్రసిద్ధి చెందిన వంటకం. ఇది గోధుమ రవ్వ/గోధుమలు, పప్పులు (మినప్పప్పు, శెనగపప్పు, కందిపప్పు మొదలైనవి), మాంసం (సాధారణంగా మటన్ లేదా చికెన్), నెయ్యి, మసాలాలతో నెమ్మదిగా ఉడికించి తయారు చేస్తారు. అందువల్ల ఇందులో కార్బోహైడ్రేట్లు, మంచి ప్రొటీన్, కొంత ఫైబర్, ఐరన్ లాంటి పోషకాలు ఉంటాయి. ఎక్కువసేపు ఉడకడం వల్ల మాంసం తేలికగా అరిగేందుకు కూడా వీలుంటుంది. దీర్ఘకాల ఉపవాసం (12 గంటలకుపైగా) చేసిన తర్వాత తక్కువ మోతాదులో తీసుకుంటే శరీరానికి త్వరగా శక్తి అందించడానికి ఇది సహాయకరంగా ఉంటుంది. అయితే ఉపవాసం లేకుండా సాధారణ రోజుల్లో ఎక్కువ పరిమాణంలో తీసుకోకూడదు. అధిక నెయ్యి, మాంసం నుంచి వచ్చే కొవ్వు కారణంగా క్యాలరీలు చేరడం వల్ల బరువు పెరుగుతారు. కొలెస్ట్రాల్, మధుమేహం లాంటి సమస్యలుంటే, అవి అధికమవుతాయి. మసాలాల వల్ల జీర్ణ సమస్యలు రావచ్చు. కాబట్టి హలీమ్‌లో చక్కటి పోషకాలున్నప్పటికీ మితంగా, సందర్భానికి అనుగుణంగా తీసుకోవడం ఆరోగ్యానికి ఉత్తమం.
మా అమ్మాయికి 18 ఏళ్ళు. ఆమెకు ఏదైనా ఆహారం పడనప్పుడు వెంటనే గొంతు నొప్పి వస్తుంది. ఆహారం తీసుకొనేందుకు ఇబ్బంది అవుతుంది. ఈ సమస్యకి ఆహారపరంగా ఏదైనా పరిష్కారం ఉంటుందా?
- రాధ, తిరుపతి
ఏదైనా ఆహారం పడనప్పుడు గొంతు నొప్పి, వాయునాళం, ఆహారనాళం వాపు రావడం, దద్దుర్లు, దగ్గు, శ్వాస తీసుకోవడానికి కష్టంగా ఉండడం మొదలైనవి అలర్జీ వల్ల వచ్చే కొన్ని లక్షణాలు. ఇలాంటి పరిస్థితి తరచూ ఎదురవుతుంటే ఆహార దినచర్య (ఫుడ్ డైరీ) - అనగా రోజూ ఏ సమయంలో ఎటువంటి ఆహారం తీసుకుంటున్నారు, తీసుకొన్న తరువాత పైన పేర్కొన్న లక్షణాలేమైనా వస్తుంటే వాటిని కూడా పుస్తకంలో రాసి ఉంచాలి. మీరు వైద్యుడిని సంప్రదించినప్పుడు ఈ పుస్తకాన్ని మీతో తీసుకెళ్లినట్టయితే, మీకు ఏ ఆహారం వల్లఅలర్జీ కలుగుతుందో తేలికగా తెలుసు కొనేందుకు అవకాశం ఉంది. దీని వల్ల సమస్యకు తగ్గ చికిత్సా పరిష్కారం సూచించగలుగుతారు. ఎటువంటి ఆహారం వల్ల ఇబ్బందో తెలుసుకోకుండా పరిష్కారం సూచించడం వీలుకాదు.
మన వంటకాలలో మెంతుల వాడకం ఎక్కువగా ఉంటుంది. మెంతుల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి? చక్కెర రోగులకు మెంతులు ఎలా ఉపయోగపడతాయి?
- ప్రసాద్, కాకినాడ
వంటకాల్లో తరచూ వాడే మెంతుల్లో చాలా ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. నీటిలో నానబెట్టినప్పుడు మెంతిపిండి జిగురుగా అయ్యేందుకు తోడ్పడే గాలాక్టోమానన్ అనే పదార్థం ఓ రకమైన పీచుపదార్థం. ఇది ప్రీబయాటిక్‌గా ఉపయోగపడి జీర్ణవ్యవస్థకి, గుండె ఆరోగ్యానికి, కొలెస్ట్రాల్ నియంత్రణకు ఉపయోగపడుతుంది. మెంతుల్లో ఉండే 4-హైడ్రాక్సీఐసోల్యూసిన్ అనే పదార్థం యాంటీ ఆక్సిడెంట్‌గా పని చేస్తుంది. మెంతుల్లో ఐరన్, మెగ్నీషియం లాంటి ఖనిజాలు కూడా ఉంటాయి. మెంతులు సరైన పరిమాణంలో తీసుకుంటే జీర్ణక్రియను నెమ్మది చేసి ఆహారంలోని కార్బోహైడ్రేట్ల నుంచి వచ్చే గ్లూకోజు ఒక్కసారిగా రక్తంలో కలవకుండా సహాయ పడుతుంది. అందువల్ల భోజనం చేసిన తర్వాత రక్తంలో చక్కెర ఒక్కసారిగా పెరగకుండా నియంత్రించడంలో మెంతులు ఉపయోగపడతాయి. అలాగే ఇన్సులిన్ పనితీరుకు మెంతులు కొంతవరకు ఉపయోగపడతాయి. ఇన్ని రకాల ఆరోగ్యప్రయోజ నాలున్నా ఇవి మందులకు ప్రత్యామ్నాయం కావు; పరిమిత మోతాదులో మాత్రమే తీసుకోవాలి. ఎక్కువగా తీసుకుంటే గ్యాస్ లేదా జీర్ణ సమస్యలు రావచ్చు. సమతుల ఆహారం, జీవనశైలిలో భాగంగా మెంతులు చేర్చుకుంటే డయాబెటీస్ నియంత్రణకు సహాయకరంగా ఉంటాయి.
డా. లహరి సూరపనేని
న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్
(పాఠకులు తమ సందేహాలను
sunday.aj@gmail.comకు పంపవచ్చు)
ఈ వార్తలు కూడా చదవండి:
మరో 260 వందేభారత్ స్లీపర్ రైళ్ల తయారీ
ఆర్టీసీలో 198 పోస్టులకు 29న రాత పరీక్ష
Read Latest Telangana News and National News