Share News

వంటింటి దినుసులతో ఔషధం

ABN , Publish Date - Apr 02 , 2026 | 09:51 AM

వంటిల్లు అద్భుత ఔషధాలయం అని పెద్దలు ఊరికే అనలేదు. పోపులపెట్టెలోని దినుసులు, పదార్థాలే అతిపెద్ద జబ్బులను కూడా కట్టడి చేస్తాయనడానికి నిదర్శనం జాతీయ పోషకాహార సంస్థ(ఎన్‌ఐఎన్‌) పరిశోధన.

వంటింటి దినుసులతో ఔషధం

  • మధుమేహుల పాలిట వరం

  • కిడ్నీ, కంటి, నరాల సమస్యలను నియంత్రించే పాలి హెర్బల్‌ ఎక్స్‌ట్రాక్టు అభివృద్ధికి ఎన్‌ఐఎన్‌ కృషి

  • ఎలుకలపై ప్రయోగంలో సత్ఫలితాలు...క్లినికల్‌ ట్రయిల్స్‌తర్వాత మరొక రెండేళ్లలో మార్కెట్లోకి

హైదరాబాద్‌ సిటీ: వంటిల్లు అద్భుత ఔషధాలయం అని పెద్దలు ఊరికే అనలేదు. పోపులపెట్టెలోని దినుసులు, పదార్థాలే అతిపెద్ద జబ్బులను కూడా కట్టడి చేస్తాయనడానికి నిదర్శనం జాతీయ పోషకాహార సంస్థ(ఎన్‌ఐఎన్‌) పరిశోధన. మానవాళిని పీడిస్తోన్న అతిపెద్ద సమస్య మధుమేహం. ధనిక, పేద... చిన్న, పెద్ద... పల్లె, పట్టణమన్న తేడాల్లేకుండా... అందరినీ ఇక్కట్లపాలు చేస్తోంది. మధుమేహ నియంత్రణకు మార్కెట్లో ఎన్నోరకాల ఔషధాలు అందుబాటులోకి వచ్చాయి. అయితే దీర్ఘకాలంగా డయాబెటీస్‏తో బాధపడుతున్న వారిలో మూత్రపిండాల వ్యాధులు(నెఫ్రోపతి), నరాలు దెబ్బతినడం(న్యూరోపతి),


కంటి చూపు మందగించడం లేదా కొన్నిసార్లు పూర్తిగా కోల్పోవడం (రెటినోపతి), కంటి శుక్లాలు వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తడం చూస్తుంటాం. మధుమేహ బాధితుల పాలిట ముప్పుగా పరిణమించే ఈ ఆరోగ్య సమస్యలను నియంత్రించే చక్కటి ఔషధాన్ని అందించేందుకు తార్నాకలోని జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్‌) శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. అదీ పోపులపెట్టెలోని దినుసుల ఆధారంగా. అల్లం, దాల్చిన చెక్క, నల్ల మిరియాలు, ఉసిరి, పసుపు... ఈ ఐదు రకాల పదార్థాల మిశ్రమంతో ఓ పాలి హెర్బల్‌ ఎక్స్‌ట్రాక్టును అభివృద్ధి చేస్తున్నట్లు శాస్త్రవేత్త డా. జి. భానుప్రకాశ్‌ రెడ్డి తెలిపారు. ఇది మధుమేహాన్ని నియంత్రిస్తుందని చెబుతున్నారు.


రెండేళ్లలో అందుబాటులోకి..

డయాబెటీస్‌ రోగుల ప్రాణప్రదాయినిగా నిలిచే ఈ ఔషధం అభివృద్ధిపై ఎన్‌ఐఎన్‌లో 15ఏళ్లుగా పరిశోధన జరుగుతున్నట్లు శాస్త్రవేత్త భానుప్రకాష్‌ రెడ్డి చెప్పారు. సాధారణంగా రక్తంలో అధికంగా పోగుపడిన గ్లూకోజ్‌ను అల్డోస్‌ రిడక్టేజ్‌ అనే ఎంజైమ్‌ సార్బిటాల్‌గా మారుస్తుంది. కణాలలో పేరుకుపోయిన సార్బిటాల్‌ ఆక్సిడేటివ్‌ ఒత్తిడిని కలిగించడం వల్ల నరాలు దెబ్బతినడం, మూత్రపిండాల వ్యాధులు, చూపు మందగించడం, శుక్లాలు రావడం వంటి సమస్యలకు దారితీస్తుంది. అయితే భారతీయ వంటింటి దినుసులైన అల్లం,


city5.jpgదాల్చిన చెక్క, నల్ల మిరియాలు, ఉసిరి, పసుపు... పదార్థాల మిశ్రమం నుంచి తీసిన హెర్బల్‌ ఎక్స్‌ట్రాక్టుకు అల్డోస్‌ రిడక్జేజ్‌ ఎంజైమ్‌ను నిరోధించే సామర్థ్యం ఉన్నట్లు ఎన్‌ఐఎన్‌ పరిశోధనలో తేలింది. అంతేకాదు, ఊబకాయంతో బాధపడేవారిలో కొన్నిరకాల ప్రొటీన్లు మారుతుండడంతో తలెత్తే సమస్యలను సైతం ఈ హెర్బల్‌ ఔషధం నియంత్రిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పటికే అధికబరువున్న ఎలుకలపై హెర్బల్‌ ఔషధాన్ని ప్రయోగించగా సత్ఫలితాలు వచ్చాయని తెలిపారు.


ముఖ్యంగా రెటినోపతి, నెఫ్రోపతి సమస్యలు తగ్గుముఖం పట్టినట్లు గుర్తించామని శాస్త్రవేత్త భానుప్రకాశ్‌ రెడ్డి తెలిపారు. మనుషులపై క్లినికల్‌ ట్రయల్స్‌ జరగాల్సి ఉందని చెప్పారు. ఇప్పటికే ఈ పరిశోధనపై 30కుపైగా పత్రాలు అంతర్జాతీయ జర్నల్స్‌లో ప్రచురితమైనట్లు సమాచారం. అంతా సజావుగా సాగితే మరొక రెండు సంవత్సరాల్లో ఈ హెర్బల్‌ ఔషథం మార్కెట్లోకి వస్తుంది అని పరిశోధకులు చెబుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు

లైంగిక వాంఛ తీర్చితే ఒక రొట్టె!

Read Latest Telangana News and National News

Updated Date - Apr 02 , 2026 | 09:51 AM