Share News

నైట్‌ షిఫ్టులతో క్యాన్సర్‌ ముప్పు పెరుగుతుందా? వైద్యులు ఏం చెబుతున్నారంటే..?

ABN , Publish Date - Oct 19 , 2026 | 07:01 AM

రాత్రి వేళల్లో పనిచేసి, పగటిపూట నిద్రించే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అయితే దీర్ఘకాలం పాటు నైట్‌ షిఫ్టుల్లో పనిచేయడం వల్ల క్యాన్సర్‌ ముప్పు పెరుగుతుందా? అనే సందేహాలు చాలామందిలో ఉన్నాయి.

నైట్‌ షిఫ్టులతో క్యాన్సర్‌ ముప్పు పెరుగుతుందా? వైద్యులు ఏం చెబుతున్నారంటే..?
Night Shift Cancer Risk

ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం ఐటీ, వైద్య రంగాలతో పాటు పలు పరిశ్రమల్లో చాలామంది రాత్రి వేళల్లో విధులు నిర్వహిస్తున్నారు. రాత్రంతా మేల్కొని పగటిపూట నిద్రపోవడం కొందరికి అలవాటుగా మారింది. అయితే దీర్ఘకాలం పాటు నైట్‌ షిఫ్టుల్లో పనిచేయడం వల్ల క్యాన్సర్‌ ముప్పు పెరుగుతుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.


గురుగ్రామ్‌లోని ఫోర్టిస్‌ మెమోరియల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌‌లో సర్జికల్‌ ఆంకాలజీ విభాగానికి చెందిన డాక్టర్‌ వేదాంత్‌ ఈ అంశంపై పలు విషయాలు వెల్లడించారు. ఎక్కువకాలం రాత్రి వేళల్లో పనిచేయడం వల్ల శరీర జీవక్రియల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని తెలిపారు. మన శరీరంలో సహజమైన జీవ గడియారం ఉంటుంది. దీనినే సర్కేడియన్‌ రిథమ్‌ అంటారు. ఇది నిద్ర, మెలకువ సమయాలను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. రాత్రిపూట పనిచేస్తూ పగటిపూట నిద్రపోవడం వల్ల ఈ వ్యవస్థపై ప్రభావం పడుతుంది. అలాగే హార్మోన్ల సమతుల్యత సహా శరీరంలోని ఇతర ప్రక్రియలూ ప్రభావితమవుతాయి. దీంతో పలు రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదముంది. అయితే నైట్‌ షిఫ్టుల్లో పనిచేసే ప్రతి ఒక్కరికీ క్యాన్సర్‌ వస్తుందని భావించకూడదు. దీర్ఘకాలంగా రాత్రి విధులు నిర్వహించేవారు తగినంత నిద్రకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. అవసరాన్ని బట్టి వైద్యులను సంప్రదించి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం మంచిది.


ఇవి గుర్తుపెట్టుకోండి

రాత్రి వేళల్లో పనిచేసేవారు పగలు తగినంత సేపు నిద్రపోవాలి. ఇలాంటి వారు ఆహారంపై కూడా శ్రద్ధ వహించాలి. రాత్రి తరచుగా తినడం మానుకోవాలి. నిద్రలేచినప్పుడు వ్యాయామం చేయడానికి కొంత సమయం కేటాయించాలి. అంతేకాకుండా ఏవైనా అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వైద్యుడిని సంప్రదించాలి. ఈ విషయంలో నిర్లక్ష్యం తగదు.


ఇవీ చదవండి

డెంగ్యూతో ప్లేట్‌లెట్స్‌ తగ్గుతున్నాయా..? ఈ ఆహారాలు తీసుకోండి..

గుప్పెడంత మనస్సుకు దిగులు

Updated Date - Oct 19 , 2026 | 07:09 AM