అటు అరాచకాలు..ఇటు పెడబొబ్బలు
ABN , Publish Date - Oct 19 , 2026 | 05:13 AM
ఉద్రిక్తతలు రెచ్చగొట్టేదీ వాళ్లే.. ముందస్తు వ్యూహంతో దాడులు చేసేదీ వాళ్లే.. టీడీపీ శ్రేణులపైనా, అడ్డొచ్చిన పోలీసులపైనా రాళ్ల దాడి! మరోవైపు దారుణం జరుగుతోందంటూ పెడబొబ్బలు పెట్టేదీ వాళ్లే.. పైగా సుద్దులు.. కూటమి ప్రభుత్వంపై ఎదురుదాడి.. పోలీసులు, అధికారులకు వార్నింగ్‌లు.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్, గవర్నర్‌ను కలసి ఫిర్యాదులు! పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సందర్భంగా వైసీపీ, ఆ పార్టీ అధినేత జగన్ తీరు ఇదీ.
అటు అరాచకాలు..ఇటు పెడబొబ్బలు
స్థానిక సమరంలో ఇదీ జగన్ తీరు!
నామినేషన్ల 3 రోజూలూ వైసీపీ అరాచకం
టీడీపీ శ్రేణులపై పలుచోట్ల దాడులు
పోలీసులపైనా రాళ్లు, కర్రలతో దాడి
పుంగనూరులో ఎంపీ మిథున్ దౌర్జన్యం
రాయచోటిలో ఆయుధాలతో పంజాబ్ గ్యాంగ్
జగన్ అడ్డా పులివెందులలో దండయాత్ర
చివరి రోజూ దర్శిలో వీరంగం
ఇతర రాష్ట్రాల నుంచి అల్లరి మూకలు
మరోవైపు వైసీపీ అధినేత జగన్ సుద్దులు
రచ్చ చేసి కూటమి ప్రభుత్వంపై ఎదురుదాడి
పోలీసులు, అధికారులకు వార్నింగ్‌లు
ఎస్‌ఈసీ, గవర్నర్‌కు ఫిర్యాదులు
మరోవైపు కోర్టులో పిటిషన్లు
ఉద్రిక్తతలు రెచ్చగొట్టేదీ వాళ్లే.. ముందస్తు వ్యూహంతో దాడులు చేసేదీ వాళ్లే.. టీడీపీ శ్రేణులపైనా, అడ్డొచ్చిన పోలీసులపైనా రాళ్ల దాడి! మరోవైపు దారుణం జరుగుతోందంటూ పెడబొబ్బలు పెట్టేదీ వాళ్లే.. పైగా సుద్దులు.. కూటమి ప్రభుత్వంపై ఎదురుదాడి.. పోలీసులు, అధికారులకు వార్నింగ్‌లు.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్, గవర్నర్‌ను కలసి ఫిర్యాదులు! పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సందర్భంగా వైసీపీ, ఆ పార్టీ అధినేత జగన్ తీరు ఇదీ. నామినేషన్ల తొలిరోజు శుక్రవారం ప్రారంభమైన వైసీపీ దౌర్జన్యకాండ.. చివరి రోజు ఆదివారం కూడా కొనసాగింది. శుక్రవారం పుంగనూరు నామినేషన్ కేంద్రంలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి టీడీపీ శ్రేణులపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. రాయచోటిలో అయితే మున్సిపల్ చైర్మన్ వైసీపీ అభ్యర్థి జిన్నా షరీఫ్ పంజాబ్‌కు చెందిన సాయుధులను రంగంలోకి దింపారు. ఇక శనివారం జగన్ అడ్డా పులివెందులలో వైసీపీ ఏకంగా దండయాత్ర చేసింది. టీడీపీ నామినేషన్లను అడ్డుకోవడానికి రాళ్లు, బీరు బాటిళ్లతో ఏకంగా పోలీసులపైనే దాడులకు తెగబడింది.

కడప, రాజంపేట, బద్వేలులోనూ వైసీపీ అదే స్థాయిలో అరాచకానికి పాల్పడింది. చివరి రోజు ఆదివారం ప్రకాశం జిల్లా దర్శిలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు బందోబస్తుకు వెళ్లిన పోలీసులపై కర్రలు, రాళ్లతో దాడులు చేశారు. ఇంత చేస్తూ కూడా.. అన్యాయం జరిగిపోతోందంటూ వైసీపీ అధినేత జగన్ గగ్గోలు పెడుతున్నారు. ఓవైపు ప్రెస్‌మీట్ పెట్టి ప్రభుత్వానికి, పోలీసులకు వార్నింగ్‌లు ఇస్తూనే.. మరోవైపు రాష్ట్ర ఎన్నికల కమిషనర్, గవర్నర్‌ను కలసి ఫిర్యాదులు చేశారు. పోలీసులే గూండాల్లా ప్రవర్తించారని, సీఎం చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆరోపించారు. మరోవైపు పారాబలగాలను రప్పించాలని, నామినేషన్ల గడువు పెంచాలని పిటిషన్లు దాఖలు చేయగా న్యాయస్థానం కొట్టివేసింది. వైసీపీ, జగన్ తీరుపై అంతా విస్తుపోతున్నారు.
దర్శి, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి) : ప్రకాశం జిల్లా దర్శి మున్సిపాలిటీ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా వైసీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. నామినేషన్ల స్వీకరణ చివరి రోజున, ఓటమి భయంతో ఉద్దేశపూర్వకంగా ఆ పార్టీ నాయకులు,కార్యకర్తలు గొడవలకు దిగారు. అనుమతి లేకుండా వందలాది మంది కార్యకర్తలు, మహిళలతో ర్యాలీ చేపట్టారు. బందోబస్తుకు వెళ్లిన పోలీసులపై కర్రలు, రాళ్లతో దాడులు చేశారు. ఈ దాడిలో దర్శి ఎస్‌ఐ జి.ఏడుకొండలుకు తీవ్రగాయాలయ్యాయి. మరికొందరు కానిస్టేబుళ్లు కూడా గాయపడ్డారు. ఓటమి భయంతో వైసీపీ క్యాడర్ నామినేషన్ వేయకుండా దర్శి డీఎస్పీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగింది. ఉద్దేశపూర్వకంగా రోడ్డుపై భైఠాయించి గొడవ చేసింది. నామినేషన్లు వేసేందుకు వెళ్లలేదు. వివరాల్లోకి వెళితే.. దర్శి మున్సిపాలిటీ వైసీపీ చైర్మన్ అభ్యర్థి వెన్నపూస వెంకటరెడ్డి, ఆ పార్టీకి చెందిన కౌన్సిలర్ అభ్యర్థులు కొందరితో కలిసి నామినేషన్ వేసేందుకు ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో దర్శి-పొదిలి రోడ్డులోని వైసీపీ కార్యాలయం నుంచి నిబంధనలకు విరుద్ధంగా భారీ ర్యాలీతో బయల్దేరారు. విషయం తెలుసుకున్న దర్శి ఎస్‌ఐ జి.ఏడుకొండలు సిబ్బందితో కలిసి వైసీపీ కార్యాలయం సమీపంలోకి వెళ్లారు. అప్పటికే ర్యాలీ అక్కడికి చేరుకుంది.
ఒక్కసారిగా వైసీపీ శ్రేణులు కర్రలు, రాళ్లతో పోలీసులపై దాడికి దిగాయి. ఎస్‌ఐకు తీవ్రగాయాలయ్యాయి. ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లతోపాటు, మరికొందరు కానిస్టేబుళ్లు గాయపడ్డారు. దర్శి డీఎస్పీ బాలమురళీకృష్ణ ఘటనా స్థలానికి బయల్దేరగా, అప్పటికే వైసీపీ మూకలు అదేరోడ్డులో ఉన్న డీఎస్పీ కార్యాలయం వద్దకు చేరుకున్నాయి. అక్కడ పోలీసులు ర్యాలీని అడ్డుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ర్యాలీని అనుమతించేది లేదని స్పష్టం చేశారు.దీంతో వైసీపీ శ్రేణులు అక్కడ బైఠాయించి ధర్నాకు దిగాయి. వాహనంలో తీసుకెళ్లి నామినేషన్లు వేయిస్తామని డీఎస్పీ బాలమురళీకృష్ణ భరోసా ఇచ్చినప్పటికీ వినిపించుకోకుండా ఆందోళనను కొనసాగించాయి. అదేసమయంలో పోలీసుల సమక్షంలోనే కొందరు నామినేషన్ పత్రాలను చించివేశారు. మధ్యాహ్నం మూడు గంటల వరకూ సమయం ఉండటంతో ఎవరైనా వస్తే కేంద్రానికి తీసుకెళ్లి నామినేషన్ వేయించాలని పోలీసులు ఎదురుచూశారు. అయినప్పటికీ ఎవ్వరూ రాలేదు. నామినేషన్లకు సమయం మించిపోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోవాలని పోలీసులు సూచించినప్పటికీ వైసీపీ నేతలు వినిపించుకోకుండా భీష్మించారు. భారీగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో పోలీసులు లాఠీచార్జి చేసి వైసీపీ మూకలను చెదరగొట్టారు.
చైర్మన్ ఎన్నిక ఏకగ్రీవం?
దర్శి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఏకగ్రీవమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం ఐదు నామినేషన్లు దాఖలుకాగా, అందులో జనసేన పార్టీ తరఫున మూడు, టీడీపీ తరఫున ఒకటి, ఇండిపెండెంట్ ఒకటి ఉన్నాయి. కూటమి పొత్తులో భాగంగా దర్శి మున్సిపాలిటీని జనసేనకు కేటాయించిన విషయం విదితమే. జనసేన పార్టీ నుంచి దారం సుబ్బారావు మూడు సెట్ల నామినేషన్లు దాఖలు చేయగా.. ఆయనకు మద్దతుగా టీడీపీ, ఇండిపెండెంట్ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. వైసీపీ అభ్యర్థి నామినేషన్ వేయలేదు. దీంతో టీడీపీ, ఇండిపెండెంట్ అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్న తర్వాత దారం సుబ్బారావు చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికవుతారు.
దర్శిలో హౌస్ అరెస్టులు
నామినేషన్ల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యగా వైసీపీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డిని దర్శిలోని ఆయన నివాసంలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి గొట్టిపాటి లక్ష్మిని కూడా గృహ నిర్బంధంలో ఉంచారు.
ఉద్దేశపూర్వకంగానే పోలీసులపై దాడి : డీఎస్పీ మురళీకృష్ణ
‘‘పోలీసులపై వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఉద్దేశపూర్వకంగానే దాడి చేశారు. అనుమతి లేకుండా వందలాది మంది కర్రలు, కారం తీసుకొని ర్యాలీగా బయలుదేరారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా బందోబస్తు కోసం వెళ్లిన పోలీసులపై కర్రలు, రాళ్లతో దాడి చేశారు. వైసీపీ నాయకులకు నామినేషన్లు వేసే ఉద్దేశంలేదు. తాము వాహనంలో తీసుకెళ్లి భద్రంగా నామినేషన్లు వేయిస్తామని చెప్పినప్పటికీ వినిపించుకోకుండా పోలీసుల ఎదుటే నామినేషన్లు చించివేశారు. నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేందుకు పటిష్ట చర్యలు తీసుకున్నప్పటికీ వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఇష్టానుసారంగా వ్యవహరించి గొడవలు సృష్టించారు.’’
ఈ వార్తలు కూడా చదవండి..
వైసీపీకి హైకోర్టులో ఎదురుదెబ్బ.. స్థానిక ఎన్నికల నామినేషన్ల గడువు పిటిషన్ కొట్టివేత
మున్సిపల్ ఎన్నికలు.. మేయర్ అభ్యర్థులపై ఉత్కంఠ.. సీఎం నిర్ణయంపై ఆసక్తి