Share News

పెద్దిరెడ్డి కోటకు బీటలు!

ABN , Publish Date - Oct 19 , 2026 | 05:48 AM

పుంగనూరు మున్సిపల్‌ ఎన్నికల నుంచి తప్పుకొంటున్నామంటూ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తొలుత ప్రకటించి, ఆ తర్వాత వెనక్కి తగ్గడం ఆసక్తి రేపింది.

పెద్దిరెడ్డి కోటకు బీటలు!
PEDDIREDDY

  • చేజారిపోతున్న పుంగనూరు

  • ‘మున్సి’ పోరులో వరుస ఎదురు దెబ్బలు

  • పుంగనూరులోకి రానివ్వబోమని నాడు

  • చంద్రబాబుకు సవాల్‌..అంగళ్లలో దాడి

  • ఇప్పుడు సీన్‌ పూర్తిగా రివర్స్‌

  • సొంత ఇలాకాలోనే ఆయనకు చుక్కెదురు

    (తిరుపతి - ఆంధ్రజ్యోతి)

పుంగనూరు మున్సిపల్‌ ఎన్నికల నుంచితప్పుకొంటున్నామంటూ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తొలుత ప్రకటించి, ఆ తర్వాత వెనక్కి తగ్గడం ఆసక్తి రేపింది. అయితే, ఆదివారం సాయంత్రం గడువు ముగిసేనాటికి అక్కడ నామినేషన్‌ పడలేదు. దీంతో సొంత ఇలాకాలోనే పెద్దిరెడ్డి రాజకీయ ప్రాబల్యం బలహీనపడుతోందంటూ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చర్చ మొదలైంది. ఇంతకాలం భయపడుతూ, వెనక్కు తగ్గుతూ వచ్చన టీడీపీ శ్రేణులు, ఇప్పుడు ఎదురు దాడికి దిగడంతో పుంగనూరులో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. నామినేషన్ల కేంద్రం వద్ద దౌర్జన్యానికి ప్రయత్నించిన మిధున్‌రెడ్డిని టీడీపీ శ్రేణులు గట్టిగా ప్రతిఘటించడం, ఆయన వాహనాలను ధ్వంసం చేశారు. ఈ ఘటన తర్వాతే పెద్దిరెడ్డి ప్రకటన వెలువడింది. అధిష్ఠానం జోక్యంతోనో, మరో కారణంతోనో, పెద్దిరెడ్డి ఆ ప్రకటనను వెనక్కి తీసుకున్నారు. పోటీలో కొనసాగుతామని ప్రకటించారు. పుంగనూరు నియోజకవర్గాన్ని పెట్టనికోటగా మార్చుకున్న పెద్దిరెడ్డికి కూటమి ప్రభుత్వంలో వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. 2024 ఎన్నికలు జరిగి ప్రభుత్వం మారిన వెంటనే జూన్‌ 15న పార్టీ శ్రేణులను కలిసేందుకు పుంగనూరుకు వస్తుండగా, టీడీపీ శ్రేణులు ‘గోబ్యాక్‌ పెద్దిరెడ్డి’ అంటూ ఆందోళనకు దిగాయి. దీంతో పోలీసులు పులిచెర్ల మండలం కల్లూరు వద్దే పెద్దిరెడ్డిని అడ్డుకుని వెనక్కి పంపేశారు. సొంత నియోజకవర్గంలో అడుగుపెట్టలేక వెనుదిరిగి పోవాల్సి రావడం ఆయనకు మొదటి చేదు అనుభవం. 2024లోనే జూలై 18న పెద్దిరెడ్డి తనయుడు, రాజంపేట ఎంపీ మిథున్‌ రెడ్డి పుంగనూరులోని మాజీ ఎంపీ రెడ్డెప్ప నివాసంలో ఉండగా, భూసేకరణ బాధితులైన రైతులు పరిహారం కోసం నిలదీసేందుకు వెళ్లారు. వారిపై వైసీపీ వర్గీయులు రాళ్లతో దాడి చేయగా, రైతులకు టీడీపీ శ్రేణులు అండగా నిలిచి ఎదురు దాడికి దిగాయి. ఆ దాడిలో మిథున్‌ వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటన పెద్దిరెడ్డి వర్గానికి షాక్‌ ఇచ్చింది.


తాజాగా పుంగనూరు మున్సిపల్‌ ఎన్నికలను పురస్కరించుకుని ఈనెల 16న వైసీపీ అభ్యర్థులతో నామినేషన్లు వేయించేందుకు ఎంపీ మిథున్‌ పుంగనూరు వచ్చారు. నామినేషన్‌ కేంద్రంలోకి ఆయనను అనుమతించవద్దని అక్కడున్న కొందరు టీడీపీ కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో మిఽథున్‌ కాన్వాయ్‌లోని కొన్ని వాహనాలు వారిపైకి దూసుకెళ్లాయి. ఎంపీ అనుచరులు కర్రలు తీసుకుని టీడీపీ కార్యకర్తలపై దాడి చేసి కొట్టారు. సమాచారమందుకుని భారీగా చేరుకున్న టీడీపీ శ్రేణులు తమ వారి రక్త గాయాలు చూసి రెచ్చిపోయాయి. మిథున్‌పైన, ఆయన అనుచరులపైనా ఎదురుదాడికి దిగాయి. వీరి దాడిలో మిఽథున్‌ అనుచరులు, సెక్యూరిటీ సిబ్బంది గాయపడ్డారు. ఎంపీ కాన్వాయ్‌ వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. మిఽథున్‌ను ఓ గదిలో పెట్టి రక్షణ కల్పించిన పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి మరీ అతికష్టమ్మీద ఆయనను సురక్షితంగా వెనక్కి పంపించారు. ఈ ఘటనతో పెద్దిరెడ్డి కుటుంబం దిగ్ర్భాంతికి గురైందని తెలిసింది. ఏకంగా మిథున్‌పైనే దాడికి దిగడాన్ని జీర్ణించుకోలేకపోతున్నట్టు సమాచారం.

దౌర్జన్యకర సంస్కృతికి పెట్టింది పేరు

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వర్గం అనుసరించిన దౌర్జన్యకర సంస్కృతిపై అసంఖ్యాక ఆరోపణలున్నాయి. అసలు తిరుపతి ఎస్వీయూలో విద్యార్థి రాజకీయాల దశలోనే ఆయన అనుచరవర్గం దాడులు, దౌర్జన్యాలు సాగించిందని ఆయన ప్రత్యర్థులు తరచూ ఆరోపిస్తుంటారు. తర్వాత 1989లో పీలేరు నుంచీ కాంగ్రెస్‌ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసింది మొదలు దాడులు, దౌర్యన్యాలకు సంబంధించి లెక్కకు మించి ఆరోపణలు ఎదుర్కొన్నారు.

జిల్లా రాజకీయాల్లో పట్టు కోసం నల్లారి కిరణ్‌ కుమార్‌రెడ్డి వర్గంతో వైరం పెంచుకుని కలికిరిలో నల్లారి కుటుంబానికి చెందిన రైస్‌ మిల్లు ఆవరణలో కిరణ్‌ చిన్నాన్న నల్లారి తిమ్మారెడ్డి నిర్వహిస్తుండిన సారా గోడౌన్‌పై దాడి చేసి ధ్వంసం చేశారు.

ఎర్రావారిపాలెం మండలం బోడేవాండ్లపల్లిలో ఫ్యాక్షన్‌ రాజకీయాలు, వరుస హత్యలకు సంబంధించి పెద్దిరెడ్డి అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

2004 ఎన్నికల్లో సదుం పోలీస్‌ స్టేషన్‌ సమీపంలోనే అప్పటి టీడీపీ అభ్యర్థి జీవీ శ్రీనాధరెడ్డిపై మిఽథున్‌రెడ్డి దాడికి పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి.

2020 డిసెంబరు 20న పీలేరు టీడీపీ నేత నల్లారి కిషోర్‌ కుమార్‌రెడ్డి తంబళ్లపల్లె నియోజకవర్గ పర్యటనకు వెళుతుంటే కురబలకోట మండలం అంగళ్లు వద్ద పెద్దిరెడ్డి వర్గీయులు దాడి చేసి వాహనాలు ధ్వంసం చేశారు.


2022 నవంబరు 11న పుంగనూరులో టీడీపీ కార్యాలయ భవన యజమానిని మున్సిపల్‌ అధికారుల ద్వారా బెదిరించి రాత్రికి రాత్రి ఖాళీ చేయించారు.

సదుం మండలం పచ్చార్లవారిపల్లికి చెందిన రాజారెడ్డి టీడీపీ నేతలతో తిరుగుతున్నారని కిడ్నాప్‌ చేసి కాళ్లు విరిచేసి కల్లూరు ఘాట్‌లో పడేశారు.

చౌడేపల్లిలో టీడీపీ జెండా దిమ్మెను ఆర్‌ అండ్‌ బీ అధికారులతో కూల్చివేయించారు.

2022 డిసెంబరు పుంగనూరు మండలం నడిమిగడిదేటి గ్రామంలో తన ఇంటిపై వైసీపీ జెండాలు కట్టద్దని వారించిన న్యాయవాది నవీన్‌ యాదవ్‌పై దాడిచేసి కొట్టి, కిడ్నాప్‌ చేశారు.

భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్‌ను అడ్డుకుని, కరోనా సంక్షోభ సమయంలో పుంగనూరును మేలు చేసేందుకు ఆయన తెస్తున్న మాస్కులు, శానిటైజర్లు, పేదలకు బట్టలను అడ్డుకున్నారు. 2022 డిసెంబరు 4న పుంగనూరులో ఆయన ఇంటిపై దాడి చేసి ధ్వంసం చేశారు. వాహనాలకు నిప్పు పెట్టారు. కేంద్ర హోమ్‌ మంత్రి అమిత్‌ షాకు మొరపెట్టుకుని సీఆర్‌పీఎఫ్‌ రక్షణతో నియోజకవర్గంలో పర్యటించాల్సి వచ్చింది.

వందకు పైగా ఆలయాల పునర్నిర్మాణానికి, అభివృద్ధికి భారీగా విరాళాలిచ్చిన దాత, బోయకొండ గంగమ్మ ఆలయానికి ఛైర్మన్‌గా పనిచేసిన ఎస్‌కే రమణారెడ్డి దర్శనానికి వెళ్లగా, గేట్లు వేసి అవమానించారు.

సీన్‌ రివర్స్‌

టీడీపీ అధినేత చంద్రబాబును పుంగనూరులో అడుగుపెట్టనివ్వమని బహిరంగంగా హెచ్చరికలు జారీ చేసిన పెద్దిరెడ్డి వర్గీయులు అన్నంత పనీ చేశారు. 2023 ఆగస్టు 4న చంద్రబాబు ప్రతిపక్ష నేతగా సాగునీటి ప్రాజెక్టులు పరిశీలించేందుకు తంబళ్లపల్లి, పుంగనూరు నియోజకవర్గాల్లో పర్యటించినపుడు అడుగడుగునా అడ్డుకున్నారు. కురబలకోట మండలం అంగళ్లు వద్ద చంద్రబాబు కాన్వాయ్‌పై రాళ్ల దాడి చేశారు. వాహనాలు ధ్వంసం చేశారు. సుమారు 520 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలపై కేసులు పెట్టించి వేధించారు. ఇపుడు అదే పెద్దిరెడ్డి పుంగనూరు నియోజకవర్గంలో అడుగుపెట్టలేని పరిస్థితి రావడం చర్చనీయాంశమైంది.

ఈ వార్తలు కూడా చదవండి..

వైసీపీకి హైకోర్టులో ఎదురుదెబ్బ.. స్థానిక ఎన్నికల నామినేషన్ల గడువు పిటిషన్ కొట్టివేత

మున్సిపల్ ఎన్నికలు.. మేయర్ అభ్యర్థులపై ఉత్కంఠ.. సీఎం నిర్ణయంపై ఆసక్తి

Updated Date - Oct 19 , 2026 | 05:48 AM