Share News

మొటిమలతో విసిగిపోయారా..? వేప నీటితో ఇలా చేస్తే..

ABN , Publish Date - Oct 10 , 2026 | 08:32 PM

వేప ఆకులు బ్యాక్టీరియా, ఫంగస్‌లను నాశనం చేయగలవు. అలాగే ఇవి చర్మంపై వ్యాధికారక సూక్ష్మజీవులు పేరుకుపోకుండా నిరోధించగలవు.

మొటిమలతో విసిగిపోయారా..? వేప నీటితో ఇలా చేస్తే..
Neem Water Facewash

ఇంటర్నెట్ డెస్క్: చాలా మంది మొటిమల సమస్య నుంచి విముక్తి పొందడానికి రకరకాల రసాయనాలు కలిగిన క్రీములు, సబ్బులను వాడుతుంటారు. కానీ వీటిని ఎక్కువ కాలం వాడితే చర్మంలోని సహజ తేమ తగ్గిపోతుంది. ఇంకా అనేక సమస్యలు తలెత్తవచ్చు. అయితే ఇలాంటి దుష్ప్రభావాలు లేకుండా వేప నీటితో మొటిమలను పూర్తిగా దూరం చేయవచ్చని ఆయుర్వేదం చెబుతోంది.


ఆయుర్వేదం ప్రకారం వేపను వినియోగిస్తే మొటిమలు పోయి ముఖానికి సహజమైన కాంతి వస్తుంది. ప్రతిరోజూ ఉదయం వేప నీటితో ముఖం కడుక్కోవడం వల్ల చర్మం అందంగా ఆరోగ్యంగా ఉంటుంది. వేప ఆకులు బ్యాక్టీరియా, ఫంగస్‌ను నాశనం చేయగలవు. అలాగే ఇవి చర్మంపై వ్యాధికారక సూక్ష్మజీవులు పేరుకుపోకుండా నిరోధించగలవు. ఈ వేప నీటిని తయారు చేసుకునేందుకు గుప్పెడు వేప ఆకులను తీసుకుని, శుభ్రంగా కడగాలి. తరువాత వాటిని ఒక గ్లాసు నీటిలో వేసి రాత్రంతా ఫ్రిజ్‌లో ఉంచాలి. అంతే వేప నీరు సిద్ధమవుతుంది. దీనితో ఫేస్‌వాష్ చేసుకుంటే మొటిమలు క్రమంగా తగ్గుతాయి.


ఈ వేపనీటితో నల్ల మచ్చలూ నయమవుతాయి. వేపలో ఉండే యాంటీఆక్సిడెంట్లు (విటమిన్ సీ, విటమిన్ ఈ) చర్మాన్ని హానికరమైన ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి. వీటి కారణంగా నల్ల మచ్చలు తగ్గుతాయి. వేప నీటిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలూ ఉన్నాయి. ఇవి అలర్జీలు, దురద నుంచి ఉపశమనం కలిగిస్తాయి.


సున్నితమైన చర్మం ఉన్న వారు దీనిని ఉపయోగిస్తే చర్మం పొడిబారడం, ఎర్రబడడం వంటి సమస్యలు వస్తాయి. అందుకే వాడే ముందు వేపనీటిని చేతిపైన రాసి పరీక్షించాలి. గర్భిణులు, తీవ్రమైన చర్మ సమస్యలున్న వారు దీన్ని ఉపయోగించే ముందు వైద్యుడి సలహా తీసుకోవాలి. వేప నీరు మందులకు ప్రత్యామ్నాయం కాదనే విషయం గుర్తించాలి. మీకు తీవ్రమైన చర్మ సమస్యలుంటే చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదించాలి.


ఇవీ చదవండి

వైరల్ జ్వరం తగ్గినా దగ్గు తగ్గడం లేదా?

ఇంటి వైద్యం.. నిండు నూరేళ్ల భాగ్యం!

Updated Date - Oct 10 , 2026 | 08:35 PM