మీ పిల్లలు వయసుకు తగ్గట్టు బరువు పెరగడం లేదా? కారణాలు తెలుసుకోండి.!
ABN , Publish Date - Jan 27 , 2026 | 04:33 PM
పిల్లలు వయసుకు తగ్గట్టు బరువు పెరగకపోతే తల్లిదండ్రుల్లో ఆందోళన సహజం. తక్కువ బరువు అనేది పిల్లల ఆరోగ్యంపై దీర్ఘకాల ప్రభావం చూపుతుంది. పిల్లల బరువు పెరగకపోవడానికి కారణాలు ఏమిటి, ఎలాంటి ఆహారం ఇవ్వాలి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: మీ పిల్లు వయసుకు తగినట్టుగా బరువు పెరగడం లేదా? బలహీనంగా కనిపిస్తున్నారా? అయితే ఈ విషయం తప్పకుండా తెలుసుకోవాలి. పిల్లలు తక్కువ బరువుగా ఉండటమనేది వారి ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది. చాలామంది తల్లిదండ్రులు ఈ విషయంపై ఆందోళన పడుతుంటారు. పిల్లలు ఎందుకు బరువు పెరగడం లేదో తెలుసుకుని, సరైన జాగ్రత్తలు తీసుకుంటే వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది.
పిల్లలు బరువు పెరగకపోవడానికి అనేక కారణాలు ఉండొచ్చు. తక్కువ కేలరీల ఆహారం తీసుకోవడం, పోషక లోపాలు, ఐరన్ లోపం, సరైన ఆహార అలవాట్లు లేకపోవడం, తల్లిపాలు సరిగా అందకపోవడం వంటి కారణాలు ప్రధానమైనవి. ఇవన్నీ పిల్లల పెరుగుదలపై ప్రభావం చూపుతాయి. అందుకే తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
బలవంతంగా తినిపించకండి..
పిల్లల బరువు తక్కువగా ఉందని భావించి కొందరు తల్లిదండ్రులు వారికి బలవంతంగా తినిపిస్తుంటారు. అయితే ఆరోగ్య నిపుణుల ప్రకారం.. ఇది సరైన పద్ధతి కాదు. ఇలా చేయడం వల్ల పిల్లలకు ఆహారం మీద ఆసక్తి తగ్గుతుంది. బలవంతంగా తినిపించడం వల్ల పిల్లలు మరింత మొండిగా మారి తక్కువగా తినే అవకాశముంది. అందుకే పిల్లలకు బలవంతంగా కాకుండా.. రోజుకు అల్పాహారం, భోజనం, రాత్రి భోజనం, మధ్యలో స్నాక్స్ ఇలా ఒక పద్ధతి ప్రకారం ఇవ్వాలి. ఇది పిల్లల ఆరోగ్యకరమైన పెరుగుదలకు సాయపడుతుంది.
టీవీ చూడకుండా ఉండాలి..
చాలా మంది పిల్లలు భోజనం చేస్తూ టీవీ లేదా మొబైల్ చూస్తుంటారు. భోజనం సమయంలో టీవీ చూడటం వల్ల పిల్లలు ఏమి తింటున్నారో దానిపై దృష్టి పెట్టలేరు. ఇది వారి ఆహార అలవాట్లు, మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.
తల్లిదండ్రులు భోజన సమయంలో టీవీని ఆపివేయాలి. మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు వంటి గాడ్జెట్లను పిల్లలకు దూరంగా ఉంచాలి. బదులుగా పిల్లలతో కలిసి కూర్చుని భోజనం చేయడం, ఆహారం గురించి మాట్లాడటం మంచిది. ఆహారం రంగు, రుచి, వాసన బాగుండేలా చూసుకుంటే పిల్లలకు తినాలనే ఆసక్తి పెరుగుతుంది.
ఈ జాగ్రత్తలు తీసుకోండి..
పిల్లలు బరువు పెరగాలంటే సరైన కేలరీలు తప్పనిసరి. అయితే కేకులు, స్వీట్లు, బర్గర్లు, పిజ్జా వంటి జంక్ ఫుడ్ ఇవ్వకూడదు. నిపుణుల ప్రకారం.. పిల్లల ఆహారంలో కండెన్స్‌డ్ మిల్క్, క్రీమ్, పెరుగు, నెయ్యి వంటి పోషకాహారాలు ఉండాలి. అలాగే విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు కూడా ఇవ్వాలి. ఏ వయసు పిల్లలు ఎంత బరువు ఉండాలనే వివరాలు తెలుసుకోవడానికి డాక్టర్‌ను సంప్రదించాలి.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ఇది కేవలం ప్రజల సాధారణ ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
థాయ్ మసాజ్ ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా?
పానిక్ అటాక్‌ని ఎలా గుర్తించాలో తెలుసా?
For More Latest News