ఎక్కువగా స్వీట్లు తింటున్నారా? శరీరంలో జరిగే మార్పులు ఇవే.!
ABN , Publish Date - Jan 27 , 2026 | 01:50 PM
పదే పదే స్వీట్లు తింటే ఆరోగ్య సమస్యలు వస్తాయా? స్వీట్లు తినాలనే కోరిక ఎందుకు వస్తుంది? ఎక్కువగా తింటే ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయి? అనే విషయాలను ఒకసారి పరిశీలిస్తే...
ఇంటర్నెట్ డెస్క్: కొంతమందికి తీపి పదార్థాలంటే చాలా ఇష్టం. రోజూ తినే ఆహారం కంటే ఎక్కువగా స్వీట్లే కావాలనిపిస్తుంది. ఇలా స్వీట్లు తినాలనే కోరిక క్రమంగా ఒక అలవాటుగా మారుతుంది. భోజనం తర్వాతైనా, మధ్యలో చిరుతిండిగా అయినా.. సమయం ఏమిటన్నది లేకుండా తీపి తినాలనిపిస్తుంది. మొదట ఇది చిన్న విషయంగా అనిపించినా, తరచూ ఇలా జరుగుతుంటే ఆలోచించాల్సిన విషయమే. అలసటగా ఉన్నప్పుడు లేదా ఒత్తిడిలో ఉన్నప్పుడు చాలామంది స్వీట్ల వైపు ఎక్కువగా ఆకర్షితులవుతారు. అయితే ఎక్కువగా తింటే శరీరంపై దుష్ప్రభావాలు పడతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
స్వీట్లు తినాలనే కోరిక ఎందుకు వస్తుంది?
ఆరోగ్య నిపుణుల ప్రకారం.. స్వీట్లు తినాలనే కోరిక కేవలం రుచికి సంబంధించినది మాత్రమే కాదు. మన రోజువారీ జీవనశైలి కూడా దీనికి కారణం. సరిగా భోజనం చేయకపోవడం, ఎక్కువసేపు ఆకలితో ఉండడం, ఎక్కువగా జంక్ ఫుడ్ తినడం వల్ల ఈ కోరిక పెరుగుతుంది. అలాగే ఒత్తిడి, నిద్రలేమి, మానసిక అలసట కూడా స్వీట్లపై ఆసక్తిని పెంచుతాయి. కొంతకాలానికి ఇది అలవాటుగా మారి, స్వీట్లు లేకుండా ఉండలేనట్టు అనిపించవచ్చు.
తరచూ స్వీట్లు తింటే వచ్చే సమస్యలు..
ఎక్కువగా స్వీట్లు తినడం వల్ల బరువు వేగంగా పెరిగే అవకాశం ఉంటుంది. ఊబకాయం వచ్చే ప్రమాదం ఉంది. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపు తప్పి డయాబెటిస్ వచ్చే అవకాశం కూడా పెరుగుతుంది. దంత సమస్యలు, అలసట, బలహీనత వంటి సమస్యలూ రావచ్చు. కొందరిలో జీర్ణ సమస్యలు, చర్మ సమస్యలు కూడా కనిపిస్తాయి. ఈ అలవాటు ఎక్కువకాలం కొనసాగితే గుండె ఆరోగ్యంపైనా ప్రభావం పడుతుంది.
ఈ కోరికను ఎలా తగ్గించుకోవాలి?
స్వీట్లు తినాలనే కోరికను తగ్గించుకోవాలంటే సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి. సమయానికి భోజనం, స్నాక్స్ తినాలి. ఎక్కువసేపు ఆకలితో ఉండకూడదు. రోజూ తగినంత నీరు తాగాలి, మంచిగా నిద్రపోవాలి. ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా లేదా తేలికపాటి వ్యాయామం చేయవచ్చు. స్వీట్లకు బదులుగా పండ్లు, డ్రై ఫ్రూట్స్ లేదా ఆరోగ్యకరమైన స్నాక్స్ ఎంచుకోవడం మంచిది. అలాగే క్రమంగా స్వీట్లు తినే పరిమాణాన్ని తగ్గిస్తే ఈ అలవాటు అదుపులోకి వస్తుంది.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ఇది కేవలం ప్రజల సాధారణ ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
థాయ్ మసాజ్ ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా?
పానిక్ అటాక్‌ని ఎలా గుర్తించాలో తెలుసా?
For More Latest News