Share News

పాల అలర్జీ ఉన్నవారు పెరుగు తినవచ్చా?

ABN , Publish Date - Jan 27 , 2026 | 02:18 PM

చాలా మందికి పాలు తాగితే అలర్జీ సమస్యలు వస్తుంటాయి. అయితే అలాంటి వారు పెరుగు తినవచ్చా? పెరుగు తిన్న తర్వాత ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటారనే వివరాలను ఓసారి పరిశీలిస్తే...

పాల అలర్జీ ఉన్నవారు పెరుగు తినవచ్చా?
Milk Allergy And Curd

ఇంటర్నెట్ డెస్క్: ఇటీవలి కాలంలో పాలు తాగడం వల్ల వచ్చే అలర్జీల సమస్య పెరుగుతోంది. చాలా మందికి పాలు తాగిన తర్వాత కడుపు నొప్పి, వాంతులు, చర్మంపై దద్దుర్లు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి వివిధ ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. పాల అలర్జీ ఉన్నవారు.. పెరుగు తినాలా? వద్దా? అని అయోమయంలో పడతారు. నిజానికి పెరుగును పాలతో తయారు చేసినప్పటికీ, ఆ ప్రక్రియ భిన్నంగా ఉంటుంది. అయితే పాల అలర్జీలు ఉన్నవారు పెరుగు తిన్న తర్వాత ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటారు? పెరుగు తినడం మానేయాలా? వద్దా? అనే విషయం తెలుసుకుందాం..


పాల అలర్జీ ఉన్నవారు పెరుగు తినకూడదా?

ఆరోగ్య నిపుణుల ప్రకారం.. ఈ విషయంలో అందరికీ ఒకే సమాధానం ఉండదు. ఎందుకంటే పాలలో ఉండే ప్రోటీన్ల వల్లే ఎక్కువగా అలర్జీ వస్తుంది. అయితే పెరుగు తయారయ్యే సమయంలో ఈ ప్రోటీన్ల స్వభావం కొంత మారుతుంది. అందుకే కొందరికి పాలు తాగితే సమస్యలు వస్తాయి. కానీ పెరుగు తింటే ఎలాంటి ఇబ్బంది ఉండదు.


కానీ.. పాల ప్రోటీన్లకు తీవ్రమైన అలర్జీ ఉన్నవారికి పెరుగు తిన్న తర్వాత కూడా సమస్యలు రావచ్చు. కడుపు నొప్పి, దురద, వాపు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపించవచ్చు. అందువల్ల పాల అలర్జీ ఉన్నవారికి పెరుగు పూర్తిగా సురక్షితమని కూడా చెప్పలేం. పెరుగు మీకు సరిపోతుందా? లేదా? అనేది మీ శరీరం ఎలా స్పందిస్తుందో చూసి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.


ఈ సమస్యను ఎలా నివారించాలి?

మీకు పాల అలర్జీ ఉంటే.. పెరుగు తినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మొదటిసారి కొద్ది మోతాదులో మాత్రమే పెరుగు తీసుకుని, శరీరంలో ఏమైనా అసౌకర్యం వస్తుందా అనే విషయాన్ని గమనించాలి. ఏమైనా ఇబ్బంది అనిపిస్తే వెంటనే పెరుగు తినడం మానేయాలి. పాలతో తయారైన పెరుగుకు బదులుగా సోయా, కొబ్బరి వంటి వాటితో తయారైన పెరుగు సంబంధిత పదార్థాలూ ఇప్పుడు మార్కెట్లో లభిస్తున్నాయి. వీటిని కూడా ఒక ప్రత్యామ్నాయంగా ఉపయోగించుకోవచ్చు. పాలు లేదా పెరుగు వల్ల వచ్చే అలర్జీలను తేలికగా తీసుకోకూడదు. కాబట్టి అలర్జీ పరీక్షలు చేయించుకుని, వైద్యుడి సలహాతో మీకు సరిపడే ఆహారాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ఇది కేవలం ప్రజల సాధారణ ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

Also Read:

థాయ్ మసాజ్ ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా?

పానిక్ అటాక్‌ని ఎలా గుర్తించాలో తెలుసా?

For More Latest News

Updated Date - Jan 27 , 2026 | 03:55 PM