Share News

ఏఐఏడీఎంకేతో విజయ్‌ చేతులు కలుపుతారా?

ABN , Publish Date - May 04 , 2026 | 12:49 PM

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో దళపతి విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ దూసుకుపోతోంది. అధికార డీఎంకే, ప్రతిపక్ష ఏఐఏడీఎంకేలను వెనక్కి నెట్టి టీవీకే పార్టీ అగ్రస్థానానికి దూసుకుపోతోంది.

ఏఐఏడీఎంకేతో విజయ్‌ చేతులు కలుపుతారా?
TVK Chief Vijay

చెన్నై, మే 04: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో దళపతి విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ దూసుకుపోతోంది. అధికార డీఎంకే, ప్రతిపక్ష ఏఐఏడీఎంకేలను వెనక్కి నెట్టి టీవీకే పార్టీ అగ్రస్థానానికి దూసుకుపోతుంది. మొత్తం 234 స్థానాలకు గాను 110 స్థానాల్లో హీరో విజయ్ పార్టీ స్పష్టమైన అధిక్యత కనబరుస్తోంది. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ 100 స్థానాలకు పైగా గెలుచుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ కోసం మరో పార్టీతో టీవీకే పొత్తు పెట్టుకునే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. ఈ సందర్భంగా ఏఐఏడీఎంకేతో విజయ్ పార్టీ పొత్తు పెట్టుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయనే చర్చ జరుగుతుంది.


ఇప్పటికే ఈ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకునేందుకు ప్రయత్నం చేశాయి. ఆ క్రమంలో టీవీకే అధినేత విజయ్ కొన్ని కీలక షరతులు విధించడంతో.. ఏఐఏడీఎంకే వెనక్కి తగ్గింది. ఆ తర్వాత ఎన్డీయేతో ఏఐఏడీఎంకే జత కట్టింది. దీంతో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రెండు పార్టీలకు చెందిన నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు చాలా ఘాటుగా చేసుకున్నారు. దీంతో ఈ రెండు పార్టీల మధ్య గ్యాప్ బాగా పెరిగిపోయింది.


అయితే అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ తన సత్తా చాటింది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు 10 మంది కంటే తక్కువ మంది ఎమ్మెల్యేలు అవసరం అవుతారు. దీంతో ఈ ఎన్నికల్లో టీవీకే తర్వాత స్థానంలో నిలిచిన ఏఐఏడీఎంకేతో పొత్తు పెట్టుకునే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం సాగుతోంది. ఇంకోవైపు తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఇప్పటికే విజయ్ పార్టీకి చెందిన నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తమకు ఏ పార్టీతో పొత్తు అవసరం లేదని వారు కుండ బద్దలు కొడుతున్నారు.


పొత్తు వేళ.. విజయ్ షరతులు..

తానే సీఎం అభ్యర్థిని అని, అత్యధిక స్థానాల్లో అభ్యర్థులను బరిలో నిలుపుతామని.. ఇలా పలు కండిషన్లను పొత్తు వేళ ఏఐఏడీఎంకే ఎదుట టీవీకే అధినేత విజయ్ ఉంచారు. రెండేళ్ల క్రితం స్థాపించిన పార్టీ ఇలా షరతులు విధిస్తే ఎలా అంటూ ఏఐఏడీఎంకే నేతలు ఈ పొత్తుపై వెనకడుగు వేశారు. దాంతో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కుదరలేదు. కానీ ఎన్నికల్లో బలమైన శక్తిగా ఎదిగిన టీవీకేతో పొత్తు పెట్టుకునేందుకు ఏఐఏడీఎంకేలోని పలువురు నేతలు ఆసక్తిని కనబరుస్తున్నట్లు సమాచారం.


ఈ వార్తలు కూడా చదవండి..

బెంగాల్‌లో ఇక్కడ గెలిచిన పార్టీదే ‘అధికారం’

బీజేపీపై దీదీ తీవ్ర ఆరోపణలు

For More National News And Telugu News

Updated Date - May 04 , 2026 | 01:51 PM