స్టాలిన్ సార్‌కు ఇవే చివరి ఎన్నికలు
ABN , Publish Date - Mar 31 , 2026 | 12:46 PM
డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి స్టాలిన్‌కు ఇవే చివరి ఎన్నికలని, ఆయన్ని ఇంటికి సాగనంపాలని ప్రజలు నిర్ణయించారని ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) అధ్యక్షుడు విజయ్ పేర్కొన్నారు.
ప్రచారంలో విజయ్
చెన్నై: డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి స్టాలిన్‌కు ఇవే చివరి ఎన్నికలని, ఆయన్ని ఇంటికి సాగనంపాలని ప్రజలు నిర్ణయించారని ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) అధ్యక్షుడు విజయ్ పేర్కొన్నారు. ఏప్రిల్ 23న ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో, టీవీకే తరుఫున 234 నియోజకవర్గాల్లో ‘విజిల్’ గుర్తుపై టీవీకే ఒంటరిగా పోటీచేయనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో తిరుచ్చి (ఈస్ట్), పెరంబూరు నియోజకవర్గాల్లో పోటీచేసేందుకు నిర్ణయించిన విజయ్ సోమవారం పెరంబూరు నియోజకవర్గంలో పోటీచేసేందుకు వ్యాసర్పాడి ప్రభుత్వ కళాశాల ప్రాంగణంలో రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలు సమర్పించారు.
ఆయన నామినేషన్ పత్రాల్లో సి.జోసెఫ్ విజయ్ అని ఉండటం గమనార్హం. ఆ తర్వాత ఆయన తన ప్రచారానికి శ్రీకారం చుట్టారు. పెద్దసంఖ్యలో గుమిగూడిన పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజల మధ్య విజయ్ మాట్లాడుతూ.. పెరంబూరు ప్రాంతం తనకు తల్లిలాంటిదని, తనను అభిమానంగా ప్రేమించే వారు నివసిస్తున్న ప్రాంతం నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించడం శుభ సూచికమన్నారు. ఉత్తర చెన్నైకి మంచి గుర్తింపు తీసుకొచ్చిన సెయింట్ లూర్థు చర్చి, పురాతన ఆలయాలు, మసీదులున్న ఈ ప్రాంతం నుంచే ప్రచారం ప్రారంభించాలని తన మనసుకు తోచిందన్నారు.
ఐదేళ్ల డీఎంకే పాలనలో రాష్ట్రంలో మాదకద్రవ్యాల వాడకం పెరిగి ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని, ప్రభుత్వశాఖల్లో ఏ పని జరగాలన్న పెద్దమొత్తంలో లంచం ముట్టజెప్పాల్సిన పరిస్థితిలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. డీఎంకే ఇచ్చే నగదును తీసుకుని ఓటు మాత్రం విజిల్ గుర్తుకు వేయాలని ఆయన ప్రజలను అభ్యర్ధించారు. తనను ప్రతి కుటుంబంలో కుమారుడు, సోదరుడు, బంధువుగా భావించి భారీ ఓట్ల మెజారిటీతో గెలిపించాలని కోరారు.
రాష్ట్రాభివృద్ధి కోసం ఆలోచించని స్టాలిన్‌కు ఇవే చివరి ఎన్నికలని అభిప్రాయం వ్యక్తంచేశారు. పెరంబూరు ప్రచారాన్ని ముగించుకున్న విజయ్ అనంతరం స్టాలిన్ పోటీచేయనున్న కొళత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో టీవీకే తరుఫున బరిలో నిలిచిన వీఎస్ బాబుకు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు. ముందుగా టీవీకే అభ్యర్ధి వీఎస్ బాబు పేరుకు బదులు మాధవరం అభ్యర్ధి ప్రభును అభ్యర్ధిగా విజయ్ చెప్పడంతో కాసేపు గందరగోళం నెలకొంది.
ఆ తర్వాత విజిల్ గుర్తుపై ఓటెయ్యాలని ఆయన అభ్యర్ధించారు. రద్దీ పెరిగి మైకు పనిచేయకపోవడంతో 4 నిమిషాల్లో తన ప్రసంగాన్ని పూర్తిచేసుకుని అక్కడి నుండి తన నివాసానికి చేరుకున్నారు. కాగా, విల్లివాక్కంలో పోటీచేస్తున్న టీవీకే అభ్యర్ధి ఆదవ్ అర్జున్‌కు మద్దతుగా విజయ్ ప్రచారంలో పాల్గొంటారని ముందే ప్రకటించడంతో అక్కడ కూడా ప్రజలు పెద్దసంఖ్యలో గుమిగూడారు. అయితే పోలీస్ భద్రత లేని కారణం వల్ల విజయ్ ప్రచారాన్ని రద్దు చేసుకున్నట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి పూక్కడై మురుగన్ ప్రకటించడం గమనార్హం.
ఈ వార్తలు కూడా చదవండి:
బీహార్ ఆలయంలో తొక్కిసలాట.. 8 మంది మృతి..
రేపటి నుంచే మార్పులు.. మీ పాకెట్ పై ప్రభావం చూపించే అంశాలు!
Read Latest Telangana News and National News