ప్రేమ వివాహం.. విషాదాంతం
ABN , Publish Date - Mar 31 , 2026 | 12:21 PM
ఇరువురూ ఒకరినొకరు ఇష్టపడ్డారు.. కడదాకా కలిసిమెలిసి ఉందామని బాసలు చేసుకున్నారు. పెద్దలకు చెప్పకుండా నామమాత్రంగా పెళ్లి చేసుకున్నారు.
కొద్దిరోజులక్రితం ప్రేయసి ఆత్మహత్యాయత్నం
పెద్దల నిరాకరణతో పంచాయితీ
ఇటీవల ప్రియుడు ఆత్మహత్యాయత్నం
పరిస్థితి విషమించి ఆస్పత్రిలో మృతి
చేర్యాల(సిద్దిపేట): ఇరువురూ ఒకరినొకరు ఇష్టపడ్డారు.. కడదాకా కలిసిమెలిసి ఉందామని బాసలు చేసుకున్నారు. పెద్దలకు చెప్పకుండా నామమాత్రంగా పెళ్లి చేసుకున్నారు. వేర్వేరు సామాజికవర్గాలు కావడంతో పెద్దలు అంగీకరించలేదు. ప్రియుడి సోదరి వివాహం పేరు చెప్పి వారిని దూరంగా ఉంచారు. దీంతో మనస్తాపం చెందిన యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. పెద్దలు ఇద్దరినీ కలవనివ్వడం లేదని ప్రియుడు ఆత్మహత్యాయత్నం చేయగా, ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ అతను మృతి చెందాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ముస్త్యాల గ్రామంలో చోటు చేసుకుంది.
స్థానికుల కథనం ప్రకారం.. ముస్త్యాలకు చెందిన అనుముల రాకేశ్(30) కారు డ్రైవర్. అదేగ్రామానికి చెందిన ఓ యువతి హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. కొంతకాలంగా వీరు ప్రేమించుకున్నారు. రహస్యంగా నామమాత్రపు పెళ్లి చేసుకున్నారు. తీరా విషయం బయటకు పొక్కడంతో రాకేశ్ కుటుంబీకులు ససేమిరా అన్నారు. అతడి సోదరి వివాహం చేసేంత వరకు కొంతకాలం గడువు కావాలని, పెద్దలసమక్షంలో వివాహం జరుపుతామని హమీ ఇవ్వడంతో ఇరువురు వేర్వేరుగా ఉంటున్నారు.
రోజులు గడుస్తున్నప్పటికీ ఎలాంటి స్పందన లేకపోవడంతో మనస్తాపానికి గురైన యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆస్పత్రిలో ఆమె కోలుకుంది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు రాకేశ్‌తో పాటు అతడి కుటుంబీకులను విచారించారు. విషయం వివాదాస్పదమవుతుండటంతో ఇటీవల పెద్దలు పంచాయతీ పెట్టారు. మరింత సమయం కావాలని తెలపడంతో ఇరువర్గాలు మాటామాటా అనుకున్నారు. వివాహానికి ససేమిరా అనడంతో గలాటాపడ్డారు.
మనోవేదనకు గురైన రాకేశ్ పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ఆరోగ్యపరిస్థితి క్షీణించడంతో సోమవారం రాత్రి మృతి చెందాడు. ఈవిషయమై ఎస్‌ఐ అపూర్వరెడ్డిని సంప్రదించగా, రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు ఇరువురూ తెలిపారని, రాకేశ్ తల్లిదండ్రుల నిరాకరణతో ప్రేయసి ఇటీవల ఆత్మహత్యయత్నానికి పాల్పడిందని, ఈవిషయమై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
ఎంఎల్‌ఎం మోసగాళ్లకు పదేళ్ల జైలు
దేశంలో మావోయిస్టు ఉద్యమం ముగిసిపోయింది: హోంమంత్రి అమిత్ షా
Read Latest Telangana News and National News