అదే మా ఓటమికి కారణం.. సీఎస్కే కెప్టెన్ రుతురాజ్
ABN , Publish Date - Mar 31 , 2026 | 11:08 AM
ఐపీఎల్ 2026 భాగంగా నిన్న జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో చెన్నై సూపర్ కింగ్స్ ఘోర పరాజయం చవిచూసింది. మ్యాచ్ అనంతరం ఓటమిపై సీఎస్కే కెప్టెన్ రుతరాజ్ గైక్వాడ్ స్పందించాడు.
స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్(IPL) 2026 భాగంగా నిన్న(సోమవారం)జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో చెన్నై సూపర్ కింగ్స్ ఘోర పరాజయం చవిచూసింది. చెన్నై జట్టు 127 పరుగులు చేయగా.. ఛేజింగ్‌లో రాజస్థాన్ సునాయాసంగా ఆధిపత్యం చెలాయించి, ఘన విజయాన్ని నమోదు చేసింది. ఈ ఓటమి బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సీఎస్కే ఎదుర్కొంటున్న ఇబ్బందులను బట్టబయలు చేసింది. ఇక మ్యాచ్ అనంతరం ఓటమిపై సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ పలు విషయాలను వెల్లడించాడు. రాజస్థాన్ మ్యాచ్ ఓటమి తమకు గుణపాఠం లాంటిదని, తప్పులతో సీజన్‌ను ప్రారంభించినప్పుడే రాబోయే మ్యాచ్‌ల్లో ఎలా ఆడాలన్న దానిపై స్పష్టత వస్తుందని తెలిపాడు.
మ్యాచ్ అనంతరం రుతురాజ్(Ruturaj Gaikwad) మీడియాతో మాట్లాడుతూ.. ‘మ్యాచ్ ఓటమి మాకు పెద్దగా నిరాశ కలిగించలేదు. అయితే మా ఇన్నింగ్స్ ఆరంభంలో రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు జోఫ్రా ఆర్చర్, నండ్రీ బర్గర్‌లు బౌలింగ్ చేస్తున్నప్పుడు పరిస్థితులు కఠినంగా ఉన్నాయనిపించింది. రాజస్థాన్ బౌలర్లు లైన్ అండ్ లెంగ్త్‌తో బంతులు వేశారు. ఇన్నింగ్స్ ఆరంభంలో పేసర్లు, మధ్యలో స్పిన్నర్లకు పిచ్ సహకరించినట్లు అనిపించింది. పిచ్ ఎలా ఉన్నప్పటికీ మేము బ్యాటింగ్ మరింత మెరుగ్గా చేసి ఉంటే.. 150 నుంచి 160 స్కోరు వచ్చేది' అని తెలిపాడు.
'ఈ రోజుల్లో, ఏది మంచి స్కోరో ఎవరికీ తెలియదు, కాబట్టి మనం ఆడుతూనే ఉండాలి. వికెట్ కఠినంగా ఉన్నప్పుడు పరుగులు రావడం కష్టమైపోతుంది. అందుకే ఫలితంపై మాత్రం పెద్దగా నిరాశ చెందడం లేదు. మరో మూడు రోజుల్లో ఇంకో మ్యాచ్ ఉంది. దీంతో జట్టులో అందరూ సానుకూలంగా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది. మా జట్టులో ఎక్కువ మంది యువ ప్లేయర్లు ఉన్నారు. మాకు బలమైన బ్యాటింగ్ లైనప్ ఉంది. భారీ స్కోర్లు చేయగల సత్తా మాకు ఉంది’ అని చెప్పుకొచ్చాడు. ఏప్రిల్ 3న చెన్నై సూపర్ కింగ్స్ తదుపరి మ్యాచ్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో తలపడనుంది.
ఇవి కూడా చదవండి:
ఆ భయంతో త్వరగా నిద్రపోయాను: వైభవ్ సూర్యవంశీ
ఐపీఎల్2026: అభిషేక్ శర్మ, రైనాల రికార్డును బ్రేక్ చేసిన వైభవ్...