పది మంది కోసం ఓ పోలింగ్ కేంద్రం !
ABN , Publish Date - Mar 20 , 2026 | 01:00 PM
తిరునల్వేలి జిల్లా పడమటికనుమల ప్రాంతానికి చేరువగా మణిముత్తారు డ్యామ్ నుండి సుమారు30 కి.మీ.ల దూరంలో మాంజోలై ప్రాంతం ఉంది. అక్కడి నుండి సుమారు 5 కి.మీ.ల దూరంలో నాలుముక్కు, అక్కడి నుండి 10 కి.మీ.ల దూరంలో ఊత్తు ప్రాంతం ఉన్నాయి.
చెన్నై: తిరునల్వేలి జిల్లా పడమటికనుమల ప్రాంతానికి చేరువగా మణిముత్తారు డ్యామ్ నుండి సుమారు30 కి.మీ.ల దూరంలో మాంజోలై ప్రాంతం ఉంది. అక్కడి నుండి సుమారు 5 కి.మీ.ల దూరంలో నాలుముక్కు, అక్కడి నుండి 10 కి.మీ.ల దూరంలో ఊత్తు ప్రాంతం ఉన్నాయి. కొన్నేళ్ల క్రితం వరకు పర్యాటక ప్రాంతంగా వెలుగొందిన మాంజోలై ప్రాంతంలో వేలాదిమంది కార్మికులు తేయాకు తోటల్లో పనిచేసేవారు. ఇటీవల టీ ఎస్టేట్‌లన్నీ మూతపడటంతో కార్మికులంతా కుటుంబసమేతంగా మాంజోలై కొండ నుంచి దిగి వేర్వేరు ప్రాంతాలకు వలసపోయారు. మాంజోలై ప్రాంతం అంబై నియోజకవర్గం పరిధిలో ఉంది.
గత లోక్‌సభ ఎన్నికల సమయంలో మాంజోలై, నాలుముక్కు, ఊత్తు, కాక్కాచ్చి, కుదిరైవెట్టి తదితర టీ ఎస్టేట్ ప్రాంతాల్లో నివసిస్తువారిలో 1650మందికి ఓటు హక్కు ఉండేది. గత యేడాది డిసెంబర్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ చేపట్టిన తర్వాత టీ ఎస్టేట్‌లో పనిచేస్తున్నవారంతా ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోవటంతో 78 మంది ఓటర్లు మాత్రమే మిగిలారు. ఓటర్ల తుది జాబితా సిద్ధం చేసినప్పుడు మాంజోలైలో 35 మంది ఓటర్లు, నాలుముక్కులో 33 మంది ఓటర్లు, ఊత్తు ప్రాంతంలో 10 మంది ఓటర్లు ఉన్నట్లు తేల్చారు.
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో మాంజోలైలో 5 పోలింగ్ బూత్‌లుండేవి. వీటిలో మాంజోలై వెస్ట్ (బూత్ నెం 98), కాకాచ్చి, నాలుముక్క ఎస్టేట్‌లకు కలిపి ఓ పోలింగ్ కేంద్రం (బూత్ నెం 102), నాలుముక్కు ఈస్ట్ ప్రాంతం ఓ పోలింగ్ కేంద్రం (బూత్ నెం 100), ఊత్తు ప్రాంతంలో ఓ పోలింగ్ కేంద్రం (బూత్ నెం 101), కుదిరైవెట్టి ప్రాంతంలో మరో పోలింగ్ కేంద్రం (నెం 102) ఉండేవి. ప్రస్తుతం మాంజోలై (106), నాలుముక్కు (బూత్ నెం 107), ఊత్తు (నెం108) అంటూ మూడు పోలింగ్ కేంద్రాలుగా తగ్గించారు.
వీటిలో ఊత్తు ప్రాంతంలో ఏర్పాటైన పోలింగ్ కేంద్రంలో మొత్తం పది మంది ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంది. ఈ పోలింగ్ కేంద్రంలో పోలింగ్ విధులకు కొండదిగువ నుండి సుమారు 40.కి.మీ కొండదారిలో ఎన్నికల సిబ్బందికి పైకి నడిచి వెళ్ళాల్సి ఉంది. ఐదుగురు ఓటర్లున్న పోలింగ్ కేంద్రంగా కొల్లిమలై ఎస్టేట్ పోలింగ్ కేంద్రం పేరుతెచ్చుకుంటే 10 మంది ఓటర్లునున్న పోలింగ్ కేంద్రంగా ఊత్తు ఎస్టేట్ పోలింగ్ కేంద్రం ద్వితీయ స్థానం సంపాదించుకుంది.
ఈ వార్తలు కూడా చదవండి:
డీఎంకేలోకి నటి రంజనా నాచ్చియార్
Read Latest Telangana News and National News