‘పేదల సంక్షేమం’పై తొలి సంతకం!
ABN , Publish Date - Mar 20 , 2026 | 05:58 AM
తెలుగు నూతన సంవత్సరాది తొలి రోజన పేదల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి సంతకం చేశారు. గురువారం ఉగాది పర్వదినాన ముఖ్యమంత్రి...
తెలుగు సంవత్సరాదిన సీఎంఆర్‌ఎఫ్ నిధులు విడుదల చేసిన చంద్రబాబు
6,787మంది పేదలకు లబ్ధి కలిగేలా రూ.55.63 కోట్ల ఫైలుపై సంతకం
21 నెలల్లో ఈ నిధి ద్వారా 1,242 కోట్ల సాయం
అమరావతి, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): తెలుగు నూతన సంవత్సరాది తొలి రోజన పేదల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి సంతకం చేశారు. గురువారం ఉగాది పర్వదినాన ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎ్‌ఫ)ఫైలుపై సీఎం సంతకం చేశారు. 6,787 మందికి లబ్ధి కలిగేలా రూ.55.63 కోట్ల ఆర్థిక సాయం విడుదల చేశారు. ఆర్థికఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు ఈ సాయం ఎంతో ఉపశమనం కలిగించనుంది. ప్రభుత్వం ఏర్పడిన 21 నెలల కాలంలో ఆర్థిక చేయూత, వైద్య సహాయం, ఎల్‌వోసిల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం రూ.1,241 కోట్లకు పైగా ఆర్థికసాయాన్ని కూటమి ప్రభుత్వం అందించింది. దీని ద్వారా 1,36,240 మంది పేదలకు లబ్ధి చేకూరింది. 2024లో 15,206 మందికి రూ.184 కోట్లు, 2025లో 1,03,568 మందికి రూ.889 కోట్లు, 2026లో ఇప్పటి వరకు 17,466 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ప్రభుత్వం సాయం చేసింది. తెలుగు సంవత్సరాదిన పేదల సంక్షేమం ఫైలుపై సంతకం పెట్టడం సీఎంకు ఆనవాయితీగా వస్తోంది. అదే ఒరవడిని ఆయన కొనసాగించారు.
చంద్రబాబుకు ఆశీర్వచనం
ఉగాది పండగ సందర్భంగా సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు టీటీడీ, దుర్గగుడి అర్చకులు ఆశీర్వచనం అందించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి, దుర్గగుడి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో శీనా నాయక్ పాల్గొన్నారు.