పోటీకి ఢీ అంటే ఢీ..
ABN , Publish Date - Feb 03 , 2026 | 11:45 AM
మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న నేపధ్యంలో.. ప్రధాన పార్టీలకు నామినేషన్ల ఉపసంహరణ పరీక్షగా మారిందని చెప్పవచ్చు. కాంగెస్ పార్టీ నుంచి ఈ పోటీ తీవ్రంగా ఉండగా బీఆర్ఎస్ నుంచి కూడా అదేస్థాయిలో పోటీ ఉందని తెలుస్తోంది.
పార్టీలకు పరీక్షగా నామినేషన్ల ఉపసంహరణ
రెబల్స్‌ను బుజ్జగించే పనిలో పార్టీల నాయకులు
విత్‌డ్రాకు నేడు ఆఖరు.. తేలనున్న అభ్యర్థుల లెక్క
ఖమ్మం: మున్సిపల్ ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకు ప్రధాన పార్టీల నుంచి నామినేషన్లు వేసిన అభ్యర్థులు ఢీ అంటే ఢీ అంటూ సై అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో పోటీలో ఉండాల్సిందే అంటూ ఎవరికి వారు తమ ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఈ పరిస్థితులు పార్టీలకు పరీక్షగా మారాయి. బీ ఫాం ఇచ్చే అభ్యర్థులకు ఇబ్బందులు లేకుండా నాయకులు రెబల్స్‌ను బరిలో నుంచి తప్పించేందుకు వారితో బుజ్జగింపులు, రాయబారాలు నడుపుతున్నారు. అయితే నామినేషన్ల ఉపసంహరణకు మంగళవారం చివరి రోజు కావడంతో బరిలో ఉండే ఆయా పార్టీల అభ్యర్ధుల లెక్క తేలనుంది. అధికార పార్టీ నుంచి టికెట్లు ఆశిస్తూ అధిక సంఖ్యలో నాయకులు నామినేషన్లు దాఖలు చేయడంతో వారిని బుజ్జగించేందుకు కాంగ్రెస్ నాయకులు తంటాలు పడుతున్నారు.
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఉమ్మడి జిల్లాలో అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్‌ఎస్ తోపాటు వామపక్షాలు కూడా పలుచోట్ల కీలకపాత్ర పోషిస్తున్నాయి. వామపక్షాల పొత్తులు కొన్నిచోట్ల కాంగ్రె్‌సతో, కొన్నిచోట్ల బీఆర్ఎస్తో సర్దుబాటు చేసుకుంటుడడంతో జిల్లాలో చిత్రవిచిత్ర పొత్తులు పొడుస్తున్నాయి. మరోవైపు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మధిరలో ప్రచారం సాగిస్తూ అభ్యర్థుల ఎంపికలో తుదికసరత్తు చేస్తుండగా.. ఏదులాపురంలో రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. బరిలో ఉండే అభ్యర్థులకు బీ ఫాంలు అందిస్తున్నారు. మిగిలిన చోట్ల అదికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతో పాటు ఆయాపార్టీల నేతలు ప్రచారంలో పాలుపంచుకుంటున్నారు. సీపీఎం జిల్లా పరిధిలో బీఆర్‌ఎస్ తో పొత్తు కట్టగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కాంగ్రెస్ తో పొత్తులో ఉంది. సీపీఐ కొన్నిచోట్ల బీఆర్‌ఎ్‌సతో దోస్తీ సాగిస్తుండగా మధిర మినహా కాంగ్రెస్ తో సీపీఐకి మిత్రబంధం ఎక్కడా కుదిరే పరిస్థితి కనిపించడంలేదు.
ఏదులాపురం మునిసిపాలిటీలో కాంగ్రె్‌సతో మిత్రపక్షంగా ఉన్న సీపీఐకి పొత్తు కుదరలేదు. దీంతో సీపీఐ ఒంటరిగానే 15చోట్ల నామినేషన్లు వేసింది. కాగా ఇక్కడ బీఆర్‌ఎస్, సీపీఎం కలిసి పోటీ చేస్తున్నాయి. సీపీఎం ఏడు డివిజన్లలో బరిలో ఉంచింది. అయితే సీపీఐని కూడా పొత్తులో కలుపుకునేందుకు బీఆర్‌ఎస్ తెరవెనుక ప్రయత్నాలు చేస్తుండగా.. మంగళవారం ఉదయం వరకు సీపీఐ, కాంగ్రె్‌సతో పొత్తు విషయంలో వేచి చూసే అవకాశం ఉంది. తర్వాత పొత్తుల విషయంలో మార్పులు జరిగే అవకాశం లేకపోలేదు.
మధిర మునిసిపాలిటీలో సీపీఐ ఐదు డివిజన్లలో నామినేషన్లు వేయగా కాంగ్రెస్ సీపీఐని పొత్తుకు ఆహ్వానించింది. ఒక వార్డు ఇచ్చేందుకు సానుకూలత వ్యక్తం చేసింది. సీపీఐ కనీసం రెండువార్డులైనా ఇవ్వాలని పట్టుబడుతోంది. ఇక్కడ పొత్తు కుదిరే అవకాశాలపై మంగళవారం స్పష్టత రానుంది. మధిరలో బీఆర్‌ఎస్, సీపీఎం కలిసి పోటీచేస్తున్నాయి. సీపీఎం మూడుచోట్ల బరిలో ఉంది. ఇక వైరా మునిసిపాలిటీలో కూడా కాంగ్రెస్, సీపీఐ మధ్య పొత్తు కుదరలేదు. దీంతో బీఆర్‌ఎస్ తో సీపీఐకి దోస్తీ కుదిరగా.. ఒక డివిజన్‌లో నామినేషన్ వేసింది.
వైరాలో బీఆర్‌ఎస్ సీపీఎం కూడా మిత్రపక్షంగా ఉన్నాయి. దీంతో బీఆర్‌ఎస్, వామపక్షాలు కూటమిగా పోటీలో ఉన్నాయి. వైరాలో సీపీఎం కూడా మూడుచోట్ల పోటీలో ఉంది. కాగా కాంగ్రెస్ వైరాలో వర్గాలు ఎవరికి వారు టికెట్లు ఆశిస్తూ నామినేషన్లు వేశారు. అటు భట్టి వర్గం, ఇటు పొంగులేటి వర్గం రెండు ప్యానళ్లు నామినేషన్లు వేయడంతో బుజ్జగింపుల పర్వం సాగుతోంది. ఎవరికివారు ససేమిరా అనడం ఎమ్మెల్యే రాందాస్ నాయక్‌కు తలనొప్పిగా మారింది.
సత్తుపల్లిలో కూడా కాంగ్రెస్, సీపీఐ మధ్య పొత్తులు కుదరలేదు. సత్తుపల్లిలో కాంగ్రె్‌స,సీపీఐ మధ్య పొత్తుకుదరకపోవడంతో సీపీఐ రెండుచోట్ల నామినేషన్లు వేసింది. ఇక్కడ బీఆర్‌ఎస్, సీపీఎం కలిసి పోటీ చేస్తున్నాయి. సీపీఎంకు బీఆర్‌ఎస్ రెండు సీట్లు కేటాయించింది.
కల్లూరులోనూ కాంగ్రెస్, సీపీఐకి పొత్తు కుదరలేదు. ఒకచోట సీపీఐ నామినేషన్ వేసి ఒంటరిగా బరిలో నిలిచింది. ఇక్కడ బీఆర్‌ఎ్‌సకు సీపీఎం మద్దతిస్తోంది. ఇక్కడ కూడా కాంగ్రెస్ టికెట్లలో గట్టి పోటీ ఉంది. అందరినీ సమన్వయం చేసి టికెట్లు ఇవ్వడం కాంగ్రెస్ పార్టీకి సవాల్‌గా ఉంది. కాంగ్రెస్ లో టికెట్లు దక్కని ఆశాపరులను రెబల్స్‌గా బరిలో ఉంచి మద్దతిచ్చేందుకు బీఆర్‌ఎస్ ప్రయత్నాలు చేస్తోంది. ఈ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చెప్పలేని పరిస్థితి.
ఈ వార్తలు కూడా చదవండి.
దిగి వస్తున్నాయి.. ఈ రోజు మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
రైల్వే బడ్జెట్‌లో.. రాష్ట్రానికి 10134 కోట్లు
Read Latest Telangana News and National News