పాఠశాల స్థాయి నుంచే ఏఐ పరిజ్ఞానం.. మిజోరం కొత్త ప్రయోగం
ABN , Publish Date - Nov 07 , 2026 | 12:58 PM
ఏఐ యుగానికి విద్యార్థులను సిద్ధం చేసే లక్ష్యంతో మిజోరం ప్రభుత్వం జనరేటివ్ ఏఐ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. 80 పాఠశాలలకు చెందిన 5,500 మందికి పైగా విద్యార్థులకు 30 ఉచిత శిక్షణ మాడ్యూళ్ల ద్వారా ఏఐ వినియోగంపై అవగాహన కల్పించనున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: అక్షరాస్యతలో ఇప్పటికే దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న మిజోరం మరో ముందడుగేసింది. రాబోయే ఏఐ యుగాన్ని దృష్టిలో ఉంచుకుని.. అందుకు తగినట్టుగా విద్యార్థులను సిద్ధం చేయాలన్న లక్ష్యంతో ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని లుంగ్లే జిల్లాలో 80 పాఠశాలలకు చెందిన 5,500 మందికి పైగా విద్యార్థులకు జనరేటివ్ ఏఐపై అవగాహన, శిక్షణ అందించనుంది. 'లుంగ్లే జెన్-ఏఐ మిషన్: ఏఐతో శక్తిమంతమైన లుంగ్లే జెన్-ఆల్ఫా' పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని సీఎం లాల్దుహోమా శుక్రవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. కృత్రిమ మేధ ఇప్పటికే నిత్యజీవితంలో భాగమైందని, విద్యార్థులు ఈ సాంకేతికత ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడం సహా దాన్ని సమర్థంగా వినియోగించుకోవడం నేర్చుకోవాలని సూచించారు. డిజిటల్ రంగంలో మిజోరం కూడా ముందంజ వేయగలదని ధీమా వ్యక్తం చేశారాయన.
కాగా.. జిల్లా విద్యాశాఖ, కోడ్‌యోగి ఫౌండేషన్ సంయుక్తంగా అమలు చేస్తున్న ఈ కార్యక్రమం తొలిదశలో భాగంగా ఫౌండేషన్ 30 శిక్షణ మాడ్యూళ్లను రూపొందించింది. ఒక్కో మాడ్యూల్‌ను పూర్తి చేసేందుకు గరిష్ఠంగా గంట సమయం పట్టనుంది. వీటిలో ఏఐ పరిచయం, ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏఐ ప్లాట్‌ఫామ్స్, వాటి వినియోగం, నిజ జీవితంలో వాటి వినియోగంపై విద్యార్థులకు పూర్తి స్థాయిలో శిక్షణనివ్వనున్నారు.
ఆ రాష్ట్రంలో ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ-ఆఫీస్ వ్యవస్థ, ఎలక్ట్రానిక్ ఫైళ్లు, ఆన్‌లైన్ సేవలను ప్రోత్సహిస్తున్నట్లు సీఎం తెలిపారు. రాష్ట్రంలో అక్షరాస్యత ఎక్కువగా ఉండటం, ఆంగ్ల పరిజ్ఞానం కలిగిన వారి సంఖ్య గణనీయంగా ఉండటం వంటి అంశాలు ఏఐ రంగంలో ముందుకు వెళ్లేందుకు అనుకూలిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని రానున్న కాలంలో ఇతర జిల్లాలకూ విస్తరించాలని ఆకాంక్షించారు.
ఇవీ చదవండి:
60 రోజులు నిద్రపోయి రూ.9.6 లక్షలు సొంతం చేసుకున్న మహిళ!
ఇరాన్ అణు రహస్యాలు చెబితే రూ.170 కోట్లు.. అమెరికా భారీ రివార్డు ప్రకటన