జేఎన్‌టీయూలో డిజిలాకర్!
ABN , Publish Date - Sep 17 , 2026 | 10:31 AM
జేఎన్‌టీయూ అనుబంధ, ప్రైవేటు అఫిలియేటెడ్ కళాశాలల్లో ఇంజనీరింగ్, ఫార్మసీ, మేనేజ్‌మెంట్ కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు యూనివర్సిటీ పరీక్షల విభాగం ఈ ఏడాది కొత్తగా డిజిలాకర్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది.
3.50లక్షలకు పైగా విద్యార్థుల సర్టిఫికెట్లు ఆన్‌లైన్‌లో నిక్షిప్తం
హైదరాబాద్ సిటీ: జేఎన్‌టీయూ అనుబంధ, ప్రైవేటు అఫిలియేటెడ్ కళాశాలల్లో ఇంజనీరింగ్, ఫార్మసీ, మేనేజ్‌మెంట్ కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు యూనివర్సిటీ పరీక్షల విభాగం ఈ ఏడాది కొత్తగా డిజిలాకర్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన డిజిలాకర్ సదుపాయంతో జేఎన్‌టీయూ అనుసంధానం కావడం ద్వారా విద్యార్థులు తమ ధ్రువపత్రాలను ఇకపై డిజిటల్ రూపంలోనే పొందడానికి మార్గం సుగమమైంది. గత నాలుగు స్నాతకోత్సవాల్లో వివిధ అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులను పూర్తిచేసి పట్టాలు పొందిన 3,54,083 మంది అభ్యర్థుల ఒరిజనల్ డిగ్రీలను డిజిలాకర్‌లో నిక్షిప్తం చేసింది. ఇందులో అత్యధికంగా 2,84,303 బీటెక్, 22,250 బీఫార్మసీ, 22,624 ఎంబీఏ, 8,533 ఎంటెక్ ఒరిజనల్ డిగ్రీలు ఉన్నాయి. ఇవికాక మరెన్నో డిస్టెన్స్ ఎడ్యుకేషన్, ఎంఫార్మసీ, ఫార్మా-డి కోర్సులు చదివిన వారి డిగ్రీ పత్రాలను కూడా డిజిలాకర్‌లో పొందుపరిచారు.
డిజిలాకర్‌తో ప్రయోజనాలు
ఫిజికల్ కాపీలు చేతిలో లేకున్నా అవసరమైన సర్టిఫికెట్లను ఫోన్ నుంచి లేదా కంప్యూటర్ల నుంచి ఎప్పుడైనా, ఎక్కడైనా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. భారతీయ ఐటీ నిబంధనల ప్రకారం డిజిలాకర్‌లోని డిజిటల్ పత్రాలు అసలైన భౌతిక పత్రాలతో సమానంగా పరిగణిస్తారు. ఆధార్ నంబర్‌తో అనుసంధానమైన ప్రతి ఖాతాకు ఒక జీబీ ప్రత్యేక క్లౌడ్ స్టోరేజ్ లభిస్తుంది. వినియోగదారు అనుమతితో ప్రభుత్వ లేదా ప్రైవేట్ సంస్థలతో ధ్రువీకరించబడిన ఈ-పత్రాలను సురక్షితంగా షేర్ చేసుకోవచ్చు. జారీ చేేస అసలు సంస్థల నుంచి ట్యాంపర్-ప్రూఫ్ (మార్పులు చేయడానికి వీలులేని) పద్థతిలో డిజిటల్ సమాచారాన్ని పొందడం వల్ల నకిలీ బెడద తగ్గుతుంది. వినియోగదారుల అనుమతితో, సంస్థలు అసలైన సంస్థల నుంచి సర్టిఫికెట్లను తక్షణమే ధ్రువీకరించుకోవచ్చు. కాగిత రహితమైన సదుపాయంతో పరిపాలనాపరమైన భారం, ముద్రణ ఖర్చులు, స్టాక్ చేయాల్సిన అవసరం తగ్గుతుంది.
డిజిటల్‌గా ఓడీలు పొందడం ఇలా..
డిజిటల్ మొబైల్ ఫోన్‌లో డిజిలాకర్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇప్పటికే ఖాతా ఉన్నవాళ్లు సైన్‌ఇన్ అయి ఎడ్యుకేషన్ సెక్షన్‌లో జవహర్‌లాల్ నెహ్రూ టెక్నాలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ అని సెర్చ్ బాక్స్‌లో టైప్ చేసి ఎంటర్ చేయాలి. సెలెక్ట్ డాక్యుమెంట్ దగ్గర డిగ్రీ సర్టిఫికెట్ కాలమ్‌ను ఎంచుకొని, హాల్‌టికెట్ నెంబరు, పాసైన సంవత్సరం ఎంటర్ చేయాలి. గెట్ డాక్యుమెంట్ లింక్‌పై క్లిక్ చేసి ఒరిజినల్ డిగ్రీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
జి.కృష్ణమోహనరావు, పరీక్షల విభాగం డైరెక్టర్
డిజిలాకర్‌లో సర్టిఫికెట్ల వివరాలు
స్నాతకోత్సవం - సర్టిఫికెట్లు
11 91,856
12 88,080
13 91,687
14 82,460
మొత్తం 3,54,083
ఈ వార్తలు కూడా చదవండి:
నిజాం నిరంకుశత్వం తలవంచిన రోజు
మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..
Read Latest AP News And Telangana News And International News And Telugu News