తిరుమలలో సూర్యజయంతి వేడుకలకు సర్వం సిద్ధం..
ABN , Publish Date - Jan 24 , 2026 | 08:49 AM
మాఘ శుద్ధ సప్తమి నాడు వచ్చే రథ సప్తమిని సూర్య భగవానుడి జన్మదినంగా జరుపుకుంటారు. రథ సప్తమి రోజున తిరుమలలో సూర్య భగవానుడిని ఆరాధించడం ఎంతో పుణ్యం అని భక్తుల నమ్మకం.
తిరుమల: ప్రతి సంవత్సరం సూర్య జయంతి సందర్భంగా పవిత్రమైన రథసప్తమి వేడుకలు తిరుమల పుణ్య క్షేత్రంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది జనవరి 25న సూర్య జయంతి సందర్భంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రథసప్తమి సందర్భంగా రేపు(ఆదివారం) సప్త వాహనాలపై శ్రీనివాసుడు ఉరేగనున్నారు. భక్తులు ప్రశాంతంగా మాడ వీధుల్లోని గ్యాలరీలో కూర్చుని.. వాహన సేవలు తిలకించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.
జనవరి 25న స్వామివారి వాహన సేవ వివరాలు:
ఉదయం 5.30 నుంచి 8 గంటల వరకు సమ: సూర్యప్రభ వాహన సేవ
ఉదయం 9 నుంచి 10 గంటల వరకు చిన్న శేష వాహన సేవ
ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గరుడ వాహన సేవ
మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు హనుమంత వాహన సేవ
మధ్యాహ్నం 2 గంటలకు 3 గంటల వరకు చక్రస్నానం
సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు కల్పవృక్ష వాహనం
సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు సర్వభూపాల వాహనం
రాత్రి 8 నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనం
భక్తుల రద్దీ నేపథ్యంలో నేటి నుంచి 26వ తేదీ వరకు సర్వదర్శనం టోకెన్ల జారీ రద్దు చేశారు టీటీడీ అధికారులు. రేపు(ఆదివారం) ప్రొటోకాల్ మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. 25న కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలు, ఎన్‌ఆర్ఐలు, చంటి బిడ్డల తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్లు, దివ్యాంగుల ప్రివిలేజ్ దర్శనాలు రద్దు చేశామని తెలిపారు. రథ సప్తమి నాడు భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున స్వామివారిని సకాలంలో దర్శించుకునేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ఆలయ సిబ్బంది, అధికారులకు సహకరించాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు అధికారులు.
ఇవీ చదవండి:
ఏజెంటిక్ ఏఐలో కొలువులే కొలువులు
మళ్లీ నష్టాల బాట పట్టిన సూచీలు.. ఒత్తిడిలో అదానీ గ్రూప్ షేర్లు..