ఏజెంటిక్ ఏఐలో కొలువులే కొలువులు
ABN , Publish Date - Jan 24 , 2026 | 04:10 AM
ఐటీ, టెక్ కంపెనీల నియామకాల్లో నైపుణ్యాల వడపోత ప్రక్రియ మారిపోతోంది. కృత్రిమ మేధ (ఏఐ)పై పట్టు ఉంటేనే జాబ్ అంటున్నాయి.
ఏటా 35 నుంచి 40 శాతం వృద్ధి
50 శాతానికిపైగా నిపుణుల కొరత
నియామకాల్లో జీసీసీలదే 54 శాతం వాటా
బెంగళూరు, హైదరాబాద్‌లదే హవా జూ క్వెస్ కార్ప్
ముంబై: ఐటీ, టెక్ కంపెనీల నియామకాల్లో నైపుణ్యాల వడపోత ప్రక్రియ మారిపోతోంది. కృత్రిమ మేధ (ఏఐ)పై పట్టు ఉంటేనే జాబ్ అంటున్నాయి. మళ్లీ ఏఐలోనూ ఏజెంటిక్ ఏఐ నైపుణ్యాలకు మరింత పెద్దపీట వేస్తున్నాయి. మిగతా వారితో పోలిస్తే ఏజెంటిక్ ఏఐపై పట్టున్న అభ్యర్థులకు 20 నుంచి 28 శాతం వరకు అధిక జీతాలు ఇచ్చి మరీ ఉద్యోగాలు ఇస్తున్నాయి. ఏటా వీరి డిమాండ్ 35 నుంచి 40 శాతం చొప్పున పెరుగుతోంది. అయితే పెరుగుతున్న ఈ డిమాండ్‌కు అనుగుణంగా ఏజెంటిక్ ఏఐ నిపుణులు దొరకడం లేదు. దీంతో ప్రస్తుతం ఈ రంగంలో యాభై శాతానికిపైగా నిపుణుల కొరత ఉందని క్వెస్ కార్ప్ అనే సంస్థ ఒక నివేదికలో తెలిపింది.
జీసీసీలదే జోరు
ఏజెంటిక్ ఏఐ నిపుణుల నియామకాల్లో దేశంలోని గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రాలు (జీసీసీ) ముందున్నాయి. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న ఏజెంటిక్ ఏఐ నిపుణుల నియామకాల్లో 54 శాతం వరకు ఈ కంపెనీల్లోనే జరుగుతున్నట్టు క్వెస్ కార్ప్ నివేదిక తెలిపింది. టెక్, సాఫ్ట్‌వేర్ యాజ్ ఏ సర్వీస్ (సాస్) కంపెనీలూ వీరి నియామకాల్లో ముందున్నాయి. ఏజెంటిక్ ఏఐ నిపుణుల నియామకాల్లో దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే బెంగళూరు, హైదరాబాద్ ముందున్నాయి. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న వీరి నియామకాల్లో ఈ రెండు నగరాల వాటా 62 శాతం వరకు ఉంది. వివిధ జాబ్ పోర్టల్స్‌లో వచ్చిన 28,000కు పైగా పోస్టింగ్స్‌ను పరిశీలించి క్వెస్ కార్ప్ సంస్థ ఈ నివేదిక రూపొందించింది.
‘ఏజెంటిక్ ఏఐ’ అంటే?
ఇచ్చిన పనులన్నీ ఒక ఏజెంట్‌లా సొంతంగా నిర్ణయాలు తీసుకుని పూర్తి చేసే టెక్నాలజీనే ఏజెంటిక్ ఏఐ అంటారు. స్పష్టంగా చెప్పాలంటే ప్రస్తుతం మొబైల్స్‌లో ఫొటోలు, వీడియోలు, టెక్స్ట్ వంటి చిన్నచిన్న పనుల కోసం అనేక ఏఐ టూల్స్ వాడుతున్నాం. ఈ టూల్స్ ప్రాంప్ట్ ఆధారంగానే ఆ పనులు పూర్తి చేస్తాయి. ఏజెంటిక్ ఏఐ.. ఆ ఏఐ టూల్స్‌కు అప్‌గ్రేడ్ వెర్షన్ లాంటిది. దీనికి ప్రాంప్ట్స్‌కు బదులు పనులు మాత్రమే పురమాయించాలి. ఆ పనులు పూర్తి చేసేందుకు ఎలాంటి ప్రాంప్ట్స్ కావా లో అదే నిర్ణయించుకుని, ఆ పని పూర్తి చేస్తుంది. ఇప్పటికే కొన్ని కీలక రంగాల్లో ఈ ఏజెంటిక్ ఏఐని వినియోగిస్తున్నారు.