Share News

భర్తపై కోపంతో కన్న కూతురిని కడతేర్చింది..

ABN , Publish Date - Mar 16 , 2026 | 07:53 AM

కుటుంబ కలహాలతో భర్తపై కోపం పెంచుకున్న మహిళ తన కుమార్తె (14 నెలల చిన్నారి)ని దారుణంగా హతమార్చింది. ముఖంపై దిండుతో అదిమిపెట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేసింది.

భర్తపై కోపంతో కన్న కూతురిని కడతేర్చింది..

  • ముఖంపై దిండుతో అదిమిపట్టి..

  • 14 నెలల చిన్నారిని చంపేసిన తల్లి

  • ఆ తర్వాత పోలీసులకు లొంగిపోయిన వైనం.. గోల్కొండలో దారుణం

హైదరాబాద్‌ సిటీ: కుటుంబ కలహాలతో భర్తపై కోపం పెంచుకున్న మహిళ తన కుమార్తె (14 నెలల చిన్నారి)ని దారుణంగా హతమార్చింది. ముఖంపై దిండుతో అదిమిపెట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేసింది. హృదయాలను కలిచివేసే విషాదకరమైన ఈ ఘటన గోల్కొండ పోలీస్‌ స్టేషన్‌(Golconda Police Station) పరిధిలో ఆదివారం సాయంత్రం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అమీర్‌ అలీ, ఘౌసియా బేగం దంపతులు. గోల్కొండ పరిధిలోని రిసాలబజార్‌లో ఉంటున్నారు. వారికి 14 నెలల పాప ఉంది. బతుకుదెరువు కోసం ఆటో నడుపుతున్న అమీర్‌ఆలీ ఉదయం వెళితే రాత్రి సమయానికి ఇంటికి వస్తాడు.


తనను సరిగా పట్టించుకోకుండా ఆటో నడిపేందుకే ఎక్కువ సమయాన్ని గడుపుతున్నావని భర్తతో తరచూ గొడవపడేదని తెలిసింది. ఆర్థిక సమస్యలు గట్టెక్కేవరకు కష్టపడాల్సిందేనంటూ భర్త నచ్చజెప్పినా ఆమె మనసు కుదుటపడలేదు. ఒకానొక సమయంలో ఇద్దరూ విడిపోయేంతగా మనస్ఫర్థలు వచ్చినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా.. ఆదివారం తన కుమార్తెకు అమీర్‌ అలీ కొత్త దుస్తులు కొన్నాడు. తనకు ఎందుకు కొనలేదని భర్తతో వాగ్వాదానికి దిగిన గౌసియా బేగం.. క్షణికావేశంలో బెడ్‌పై ఉన్న కుమార్తె ముఖంపై దిండును అదిమిపెట్టి ఊపిరాడకుండా చేసి హతమార్చింది.


city3.2.jpgఆ తర్వాత ఏ మాత్రం జాలి దయలేకుండా పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. భార్య చేసిన ఘాతుకాన్ని గమనించిన భర్త, అతని తండ్రి ఆ చిన్నారిని హుటాహుటిన దగ్గరలోని ఓ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు ధ్రువీకరించారు. భర్తపై కోపం, కుటుంబ కలహాల నేపథ్యంలోనే చిన్నారిని ఆమె హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. నిందితురాలిపై హత్య కేసు నమోదు చేసి మరిన్ని కోణాల్లో ఆమెను విచారిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

రోహిత్‌రెడ్డి జైలుకు

నేనే తప్పూ చేయలేదు!

Read Latest Telangana News and National News

Updated Date - Mar 16 , 2026 | 07:53 AM