Share News

ఎంపీ పుట్టా మహేశ్‌కు పాజిటివ్‌

ABN , Publish Date - Mar 16 , 2026 | 06:14 AM

ఫాంహౌస్‌ డ్రగ్స్‌ పార్టీ కేసులో తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి కటకటాల్లోకి వెళ్లారు. రోహిత్‌రెడ్డితోపాటు డ్రగ్స్‌ పార్టీలో పాల్గొని నిర్ధారణ పరీక్షలో పాజిటివ్‌గా తేలిన ఆయన సోదరుడు రితేశ్‌రెడ్డి, నమిత్‌శర్మకు కూడా కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది.

ఎంపీ పుట్టా మహేశ్‌కు పాజిటివ్‌

  • రక్త నమూనాల్లో డ్రగ్స్‌ ఉన్నట్లు నిర్ధారణ

  • ఎంపీ సహా 8 మందికి స్టేషన్‌ బెయిల్‌.. డ్రగ్స్‌ పార్టీ కేసులో రోజంతా హైడ్రామా

  • మాజీ ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి జైలుకు.. 14 రోజుల రిమాండ్‌

  • సోదరుడు రితేశ్‌రెడ్డి, నమిత్‌శర్మకు కూడా.. కాల్పులు జరిపిన కేసులో విధింపు!

మొయినాబాద్‌/చేవెళ్ల, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): ఫాంహౌస్‌ డ్రగ్స్‌ పార్టీ కేసులో తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి కటకటాల్లోకి వెళ్లారు. రోహిత్‌రెడ్డితోపాటు డ్రగ్స్‌ పార్టీలో పాల్గొని నిర్ధారణ పరీక్షలో పాజిటివ్‌గా తేలిన ఆయన సోదరుడు రితేశ్‌రెడ్డి, నమిత్‌శర్మకు కూడా కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. దీంతో ఈ ముగ్గురిని పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. డ్రగ్స్‌ పార్టీలో మొత్తం 11 మందిని అదుపులోకి తీసుకోగా.. వారిలో ఆరుగురికి పాజిటివ్‌ వచ్చినట్లు తెలిపారు. వీరిలో ఏపీలోని ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్‌కుమార్‌ యాదవ్‌ కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే మహేశ్‌కుమార్‌తోపాటు మిగిలిన నిందితులందరికీ పోలీసులు స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చి పంపించివేశారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మునిసిపాలిటీ పరిధిలోని రోహిత్‌రెడ్డి ఫాంహౌస్‌లో డ్రగ్స్‌ పార్టీ జరుపుకొంటున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని డ్రగ్స్‌ పరీక్షలు నిర్వహించారు. ఆదివారం తెల్లవారు జామున వారందరినీ ఫాంహౌస్‌ నుంచి తరలించిన పోలీసులు.. మొయినాబాద్‌ పోలీస్ స్టేషన్‌కు కాకుండా ఫ్యూచర్‌ సిటీ పరిధిలోని శంషాబాద్‌ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడే వారిని విచారించి.. ఆ తరువాత హైదరాబాద్‌కు తీసుకెళ్లి డ్రగ్స్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.


ఇందులో రోహిత్‌రెడ్డితోపాటు మరికొందరికి పాజిటివ్‌ వచ్చినట్లు పేర్కొన్నారు. అనంతరం రక్త పరీక్షలు నిర్వహించగా.. రోహిత్‌రెడ్డి, ఎంపీ పుట్టా మహేశ్‌యాదవ్‌తోపాటు రోహిత్‌రెడ్డి సోదరుడు రితే్‌షరెడ్డి, నమిత్‌శర్మ, కౌశిక్‌ రవి, అర్జున్‌రెడ్డిలకు పాజిటివ్‌ వచ్చినట్లు పోలీసులు నిర్ధారించారు. నెగిటివ్‌ వచ్చిన వారిలో ఎం.రమేశ్‌, శ్రవణ్‌కుమార్‌, విజయ్‌కృష్ణ, సిలివేరి శరత్‌కుమార్‌, ప్రియాంకరెడ్డి ఉన్నట్లు పేర్కొన్నారు. ఆయా వ్యక్తుల మెటబాలిజం ఆధారంగా డ్రగ్స్‌ తీసుకున్నవారి శరీరంలో వాటి ఆనవాళ్లు యూరిన్‌లో ఆలస్యంగా బయట పడతాయని పోలీసులు చెబుతున్నారు. ఫ్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన చట్టం ప్రకారం రక్త పరీక్షల నమూనాల ఆధారంగానే కేసులు నమోదు చేశామని అన్నారు. తాము ఫాంహౌస్‌కు వెళ్లిన సమయంలో నమిత్‌శర్మ అనే వ్యక్తి కాల్పులు జరిపాడని, అయితే తుపాకీ లైసెన్స్‌ రితేశ్‌రెడ్డి పేరిట ఉందని, కాల్పులు జరపాల్సిందిగా రోహిత్‌రెడ్డి చెప్పారని పోలీసులు తెలిపారు. ఈ ఆరోపణలపైనే ఈ ముగ్గురిని రిమాండ్‌కు తరలించినట్లు చెబుతున్నారు. ఎంపీ మహేశ్‌కుమార్‌తోపాటు మిగిలిన వారందరికీ పోలీసులు స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చారు.


డ్రగ్స్‌ సరఫరాపై ఆరా..

పైలట్‌ రోహిత్‌రెడ్డి ఫాంహౌస్‌లో జరిగిన పార్టీకి డ్రగ్స్‌ సరఫరా జరిగిన అంశంపై పోలీసులు మరిన్ని వివరాలు సేకరించారు. రోహిత్‌రెడ్డి పీఏ సిలివేరి శరత్‌కుమార్‌ ఇచ్చిన సమాచారంతోనే కౌశిక్‌ రవిని ప్రశ్నించారు. రెండు కొకైన్‌ ప్యాకెట్లను పార్టీకి వచ్చిన వారందరికీ పంచి మిగిలినది జేబులో పెట్టుకున్నానని శరత్‌కుమార్‌ చెప్పాడు. కాగా, రోహిత్‌రెడ్డికి స్నేహితుడైన బెంగళూరుకు చెందిన కౌశిక్‌ రవి.. సిమ్లా ట్రిప్‌లో గుర్తు తెలియని వ్యక్తి నుంచి డ్రగ్స్‌ కొనుగోలు చేసినట్టు విచారణలో తెలిపాడు. ఇదిలా ఉండగా.. పోలీసుల దాడి సమయంలో రోహిత్‌రెడ్డి పీఏ శ్రవణ్‌ తనవద్ద ఉన్న రెండు సెల్‌ఫోన్లను ధ్వంసం చేసినట్లు తెలిసింది. ఇందులో ఒకటి రోహిత్‌రెడ్డిదికాగా, మరొకటి శ్రవణ్‌ది. సెల్‌ఫోన్లను నేలకేసి కొట్టి పగలగొట్టినట్లు సమాచారం. దీనిపై పోలీసులు శ్రవణ్‌ను విచారించారు.

Updated Date - Mar 16 , 2026 | 06:17 AM