Share News

ప్రియుడు పెళ్లికి అంగీకరించలేదని..

ABN , Publish Date - Feb 26 , 2026 | 08:04 AM

ఉన్నత చదువులకోసం నగరానికి వచ్చిన యువతి.. చదువుతూనే మరోవైపు యూత్‌ను ఆకట్టుకునేలా యూట్యూబ్‌ వీడియోలు చేసేది.

ప్రియుడు పెళ్లికి అంగీకరించలేదని..

  • యూట్యూబర్‌ కోమలి బలవన్మరణం

హైదరాబాద్‌ సిటీ: ఉన్నత చదువులకోసం నగరానికి వచ్చిన యువతి.. చదువుతూనే మరోవైపు యూత్‌ను ఆకట్టుకునేలా యూట్యూబ్‌ వీడియోలు చేసేది. ఈ క్రమంలో పరిచయమైన ఓ యువకుడిని ప్రేమించగా అతను తిరస్కరించడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌(Rayadurgam Police Station) పరిధి, మణికొండలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాయదుర్గం ఇన్‌స్పెక్టర్‌ సీహెచ్‌ వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం... విశాఖపట్నానికి చెందిన కోమలికి, అదే ప్రాంతానికి చెందిన నిఖిల్‌రెడ్డితో 2023 నుంచి పరిచయం ఉంది.


నిఖిల్‌రెడ్డి తల్లి నిర్వహించే బ్యూటీ పార్లలకు కోమలి తరచూ వెళ్లేది. ఈ క్రమంలో నిఖిల్‌రెడ్డితో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. నిఖిల్‌రెడ్డికి సాప్ట్‌వేర్‌ ఉద్యోగం రావడంతో 2024లో హైదరాబాద్‌కు వచ్చి చిత్రపురి కాలనీలో ఉంటూ ఉద్యోగం చేస్తున్నాడు. ఇదిలా ఉండగా.. కోమలికి మల్లారెడ్డి ఇంజనీరింగ్‌ కళాశాలలో సీటు రావడంతో నగరానికి వచ్చి బాలానగర్‌లో ఉంటూ చదువుతోంది. ఈ క్రమంలో 11 నెలల క్రితం కోమలి బాలానగర్‌ నుంచి చిత్రపురి కాలనీకి మకాం మార్చింది. కళాశాలకు వెళ్తూనే యుట్యూబర్‌గా వీడియోలు చేస్తూ.. యూత్‌ను ఆకర్శిస్తూ అనతికాలంలోనే మంచి గుర్తింపు పొందింది. కాగా కొంతకాలంగా నిఖిల్‌రెడ్డిని ప్రేమిస్తున్న కోమలి.. మనం వివాహం చేసుకుందామంటూ ఒత్తిడి చేయసాగింది.


city3.2.jpgదీంతో నిఖిల్‌రెడ్డి తాను పెళ్లి చేసుకోలేనని కోమలితో తేల్చిచెప్పాడు. ఆరు నెలల క్రితం కోమలి ఇదే ప్రస్తావనం తేవడంతో అతను నిరాకరించగా.. అప్పట్లోనే కోమలి ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. దాంతో కోమలి ప్రేమ విషయం ఆమె తల్లికి తెలియడంతో వారించింది. అతనికి ఇష్టం లేకుండా బలవంతంగా ఎలా పెళ్లి చేసుకుంటావని నచ్చచెప్పడంతో స్థిమితపడింది. ఆ తర్వాత ఈ నెల 21న కోమలి మరోసారి నిఖిల్‌ రెడ్డిని తన ఇంటికి పిలిపించి పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చింది. అయినా నిఖిల్‌రెడ్డి పెళ్లికి నిరాకరించాడు. దాంతో తీవ్ర మనస్థాపానికి గురైన కోమలి 23న రాత్రి తానునివాసం ఉంటున్న గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్యహత్య చేసుకుంది.


ఆత్మహత్య చేసుకోవడానికి ముందు రాత్రి 10గంటల సమయంలో తన తల్లికి కోమలి మెసేజ్‌ పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. ఈనెల 21న కోమలి ఇంటికి నిఖిల్‌ వచ్చి వెళ్లినట్లుగా ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కోమలి ఆత్మహత్యలో నిఖిల్‌కు ప్రత్యక్షంగా లేక పరోక్షంగా సంబంధం ఉందా..? ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా..? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కోమలి డైరీలో సూసైడ్‌ నోట్‌ దొరికినట్లు తెలిసింది. అందులో కోమలి తన ప్రేమ గురించి రాసుకుంది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా జనరల్‌ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి:

రాజకీయాల్లోకి మావోయిస్టులు?

పింఛను పెంపు!

Read Latest Telangana News and National News

Updated Date - Feb 26 , 2026 | 08:04 AM