Share News

28 నుంచి హెచ్‌పీవీ టీకా

ABN , Publish Date - Feb 26 , 2026 | 03:26 AM

దేశవ్యాప్తంగా 14 ఏళ్ల బాలికలకు హ్యూమన్‌ పాపిల్లోమా వైరస్‌ (హెచ్‌పీవీ) టీకా వేసే కార్యక్రమం ఈనెల 28న ప్రారంభం కానుంది. జాతీయ స్థాయిలో...

28 నుంచి హెచ్‌పీవీ టీకా

  • 14 ఏళ్లు నిండిన 15 ఏళ్లలోపు బాలికలకు టీకా

  • ఆ వయసున్న బాలికలు 3.3 లక్షల మంది

  • అందులో 1.45 లక్షల మందికి తొలిదశలో టీకా

  • ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కార్యక్రమం

హైదరాబాద్‌, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా 14 ఏళ్ల బాలికలకు హ్యూమన్‌ పాపిల్లోమా వైరస్‌ (హెచ్‌పీవీ) టీకా వేసే కార్యక్రమం ఈనెల 28న ప్రారంభం కానుంది. జాతీయ స్థాయిలో ప్రధాని మోదీ, రాష్ట్రంలో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. 14 ఏళ్ల వయసు నిండి, 15వ ఏట అడుగుపెట్టని బాలికలకు ఈ టీకా వేస్తారు. తెలంగాణలో ఈ వయసు బాలికలు 3.30 లక్షల మంది ఉన్నారు. తొలిదశలో ఇందులో 1.45 లక్షల మందికి టీకా వేయనున్నట్టు వైద్యారోగ్య శాఖ వర్గాలు తెలిపాయి.

మార్చి నుంచి మే వరకు ప్రత్యేక డ్రైవ్‌

మహిళల్లో గర్భాశయ ముఖద్వార (సర్వైకల్‌) క్యాన్సర్‌కు అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం దేశవ్యాప్తంగా ఈ టీకాల కార్యక్రమాన్ని చేపట్టింది. వ్యాక్సిన్‌ తీసుకోవడం వల్ల బాలికలకు సంబంధిత వైర్‌సల నుంచి దీర్ఘకాలిక రక్షణ ఉంటుంది. నిజానికి మన దేశ మహిళల్లో ఎక్కువగా వస్తున్న క్యాన్సర్లలో సర్వైకల్‌ క్యాన్సర్‌ రెండోది. తెలంగాణలో ప్రతీ లక్ష మంది మహిళల్లో 12.1 మంది దీని బారినపడుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. హెచ్‌పీవీ టీకా కార్యక్రమం కోసం మార్చి మొదటి నుంచి మే వరకు ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టనున్నారు. మెడికల్‌ ఆఫీసర్‌ పర్యవేక్షణలో టీకాలు ఇస్తారు. దీనిపై వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ విభాగం ఇప్పటికే సిబ్బందికి అవగాహన, శిక్షణ కార్యక్రమాలను నిర్వహించింది. వ్యాక్సినేషన్‌లో భాగంగా సింగిల్‌ షాట్‌ గార్డాసిల్‌ హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ను బాలికల చేతికి వేయనున్నారు. ఇక హెచ్‌పీవీ టీకాలపై ముందుగా బాలికల తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తామని, వారి అనుమతి మేరకే బాలికలకు వ్యాక్సిన్‌ వేస్తామని వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. టీకా కార్యక్రమంపై ఒకటి రెండు రోజుల్లో కేంద్ర వైద్యారోగ్య శాఖ నుంచి ప్రత్యేక మార్గదర్శకాలు వస్తాయని తెలిపారు. ఆ మార్గదర్శకాల మేరకు వ్యాక్సినేషన్‌ నిర్వహిస్తామన్నారు. టీకా తీసుకున్న తర్వాత కొందరిలో ఎదురయ్యే దుష్ప్రభావాలను వెంటనే గమనించి, తగిన చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. ఇందుకోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనే టీకాలు ఇవ్వనున్నామని.. ఇంటి వద్దకు కూడా ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని వెల్లడించారు.

Updated Date - Feb 26 , 2026 | 03:39 AM