Share News

రాజంపేటలో భారీ అగ్నిప్రమాదం.. అర్ధరాత్రి లాడ్జిలో చెలరేగిన మంటలు..

ABN , Publish Date - Feb 26 , 2026 | 07:09 AM

కడప జిల్లా రాజంపేటలో అర్ధరాత్రి వేళ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక రైల్వేస్టేషన్ రోడ్డులో ఉన్న 'దీప్ లాడ్జి'లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. 32మంది అస్వస్థతకు గురయ్యారు.

రాజంపేటలో భారీ అగ్నిప్రమాదం.. అర్ధరాత్రి లాడ్జిలో చెలరేగిన మంటలు..
Rajampet fire accident

రాజంపేట (కడప), ఫిబ్రవరి 26: కడప జిల్లా రాజంపేటలో అర్ధరాత్రి వేళ ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక రైల్వేస్టేషన్ రోడ్డులో ఉన్న 'దీప్ లాడ్జి'లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. పలువురు అస్వస్థతకు గురయ్యారు.

ఘటన వివరాల్లోకి వెళ్తే..

బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత లాడ్జిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే మంటలు లాడ్జిలోని 22 గదులకూ వేగంగా వ్యాపించాయి. భవనం మొత్తం దట్టమైన పొగ అలుముకోవడంతో గదుల్లో నిద్రిస్తున్న ప్రయాణికులు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ప్రాణభయంతో హాహాకారాలు చేస్తూ బయటకు వచ్చేందుకు ప్రయత్నించారు.


ఒకరి మృతి, 32మందిని కాపాడిన సిబ్బంది

ప్రమాద సమయంలో లాడ్జిలో మొత్తం 33 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక దళం ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చింది. పోలీసులు, ఫైర్ సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి, లోపల చిక్కుకున్న 32 మందిని సురక్షితంగా బయటకు తీసి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

అయితే, దురదృష్టవశాత్తూ ప్రొద్దుటూరు మండలం కొర్రపాడు గ్రామానికి చెందిన వెంకట శ్రీనివాస్ అనే వ్యక్తి ఈ ప్రమాదంలో మృతి చెందారు. గదిలో నిద్రిస్తున్న సమయంలో పొగ దట్టంగా వ్యాపించడంతో ఆయన మరణించినట్లు తెలుస్తోంది.

ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. అగ్నిమాపక నిబంధనలు పాటించడంలో ఏవైనా లోపాలు ఉన్నాయా అనే కోణంలో అధికారులు విచారణ జరుపుతున్నారు. అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదం స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది.


ఈ వార్తలూ చదవండి

కృత్రిమ మేధకు భయపడం: టీసీఎస్ సీఈఓ

ఎన్‌ఎస్‌ఈ ఐఎక్స్ షురూ.. ఇక విదేశీ షేర్లలో నేరుగా పెట్టుబడులు

Updated Date - Feb 26 , 2026 | 07:25 AM