తమ్ముడి మరణాన్ని తట్టుకోలేక.. అన్నకు గుండెపోటు
ABN , Publish Date - Jun 20 , 2026 | 09:42 AM
వారిద్దరి మధ్య కేవలం రక్త సంబంధం మాత్రమే కాదు.. ప్రాణమిత్రులు.
ఒకే రోజు ఇద్దరూ అనంతలోకాలకు
హైదరాబాద్: వారిద్దరి మధ్య కేవలం రక్త సంబంధం మాత్రమే కాదు.. ప్రాణమిత్రులు. అందుకే ఒకరు లేక మరొకరు ఉండలేక పోయారేమో. తమ్ముడు మరణించిన కొద్ది గంటల్లోనే, ఆశోకాన్ని తట్టుకోలేక అన్న కూడా గుండెపోటుతో కన్నుమూశాడు. దీంతో ఫిలింనగర్ గౌతమ్‌నగర్‌లో విషాదఛాయలు నెలకొన్నాయి. బస్తీకి చెందిన మార్ల యాదగిరి అలియాస్ యాదయ్య రాయి కొట్టే పని చేస్తాడు. అతని పెదనాన్న కుమారుడు మార్ల వెంకటేష్ కూడా ఇదే వృత్తిలో ఉన్నారు. వీరిద్దరి మధ్య బంధుత్వంతో పాటు విడదీయరాని స్నేహం ఉంది. ఎక్కడికెళ్లినా, ఏం చేసినా ఇద్దరూ కలిసే ఉండేవారు. కొంతకాలం క్రితం యాదయ్య పక్షవాతం బారిన పడ్డాడు. పరిస్థితి విషమించడంతో ఈ నెల 18న మరణించాడు.
గుండె పగిలిన అన్న
కంటికి రెప్పలా ఉండే తమ్ముడు ఇక లేడనే వార్త వెంకటేష్‌ను తీవ్రంగా కలచివేసింది. యాదయ్య భౌతికకాయాన్ని చూసి అతను తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు. కొద్ది గంటలకే వెంకటేష్ గుండెపోటుతో కుప్పకూలాడు. కుటుంబసభ్యులు ఇద్దరి అంత్యక్రియలను ఒకేసారి నిర్వహించారు. వీరి మరణంతో బస్తీ వాసులంతా కంటతడి పెట్టారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చిన్న శ్రీశైలం యాదవ్ బాధిత కుటుంబ సభ్యులకు 20 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
పసిడి ధరల పతనం.. ప్రస్తుతం రేట్స్ ఎలా ఉన్నాయంటే..
శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటలు
Read Latest AP News And Telangana News And International News And Telugu News