Share News

ఉత్కంఠ పోరులో న్యూజిలాండ్ విజయం.. సెమీస్ ఆశలు సజీవం!

ABN , Publish Date - Jun 20 , 2026 | 07:44 AM

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌2026లో డిఫెండింగ్ ఛాంపియన్ న్యూజిలాండ్‌కు త్రుటిలో పరాభవం తప్పింది. శుక్రవారం ఐర్లాండ్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో కివీస్ జట్టు 4 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఉత్కంఠ పోరులో న్యూజిలాండ్ విజయం.. సెమీస్ ఆశలు సజీవం!
New Zealand Women vs Ireland Women

స్పోర్ట్స్ డెస్క్: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌2026లో డిఫెండింగ్ ఛాంపియన్ న్యూజిలాండ్‌కు త్రుటిలో పరాభవం తప్పింది. శుక్రవారం ఐర్లాండ్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో కివీస్ జట్టు 4 పరుగుల తేడాతో విజయం సాధించి, టోర్నమెంట్‌లో తమ సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. వరుసగా తొలి రెండు మ్యాచ్‌ల్లో వెస్టిండీస్, శ్రీలంక చేతిలో ఓటమి పాలైన న్యూజిలాండ్‌కు ఈ మ్యాచ్‌లో గెలవడం అత్యంత కీలకం.


ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌కు ప్రారంభంలోనే గట్టి షాక్ తగిలింది. ఐర్లాండ్ బౌలర్లు ఓర్లా ప్రెండర్‌ గాస్ట్, ఐమీ మాగైర్ ధాటికి కివీస్ జట్టు 10 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో కెప్టెన్ మెలీ కెర్ (30) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దగా, బ్రూక్ హాలిడే, ఇజ్జీ షార్ప్ జోడి 50 బంతుల్లో 62 పరుగుల భాగస్వామ్యంతో జట్టును ఆదుకుంది. అనారోగ్యంతో ఉన్న సోఫీ డివైన్ స్థానంలో తుది జట్టులోకి వచ్చిన సీనియర్ ఆల్‌రౌండర్ సుజీ బేట్స్ చివర్లో మెరుపులు మెరిపించింది. కెరీర్‌లో తొలిసారి ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఆమె 12 బంతుల్లో 19 పరుగులు చేసింది. ముఖ్యంగా ఇన్నింగ్స్ ఆఖరి బంతికి బేట్స్ కొట్టిన సిక్సర్ మ్యాచ్ ఫలితాన్ని శాసించింది. దీంతో న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 140 పరుగులు చేసింది.


అనంతరం 141 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ విజయం అంచుల దాకా వచ్చింది. కివీస్ పేసర్ బ్రీ ఇల్లింగ్ (1/18) కట్టడి చేసినప్పటికీ, ఐర్లాండ్ కెప్టెన్ గాబీ లూయిస్ (58), ఓర్లా ప్రెండర్‌గాస్ట్ (59) రెండో వికెట్‌కు 110 పరుగుల భారీ భాగస్వామ్యంతో న్యూజిలాండ్ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టారు. దీంతో ఐర్లాండ్ చారిత్రాత్మక విజయం సాధించేలా కనిపించింది. అయితే, 18వ ఓవర్లో ప్రెండర్‌ గాస్ట్ ఔట్ కాగా, 19వ ఓవర్లో లూయిస్ కూడా పెవిలియన్ చేరడంతో మ్యాచ్ మలుపు తిరిగింది.


చివరి ఓవర్లో ఐర్లాండ్ విజయానికి 15 పరుగులు అవసరం కాగా.. బౌలింగ్ బాధ్యతలు చేపట్టిన సుజీ బేట్స్ కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చి ఐర్లాండ్‌ను 136 పరుగులకే పరిమితం చేసింది. దీంతో న్యూజిలాండ్ 4 పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించి.. ఊపిరి పీల్చుకుంది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో రాణించిన కివీస్ కెప్టెన్ మెలీ కెర్‌కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది. న్యూజిలాండ్ తన తదుపరి మ్యాచ్ జూన్ 23న స్కాట్లాండ్‌తో ఆడనుంది. అదే రోజు శ్రీలంకతో ఐర్లాండ్ తలపడనుంది.


ఇవి కూడా చదవండి:

40 ఏళ్ల తర్వాత..

‘కామన్వెల్త్‌’కు నీరజ్‌ క్వాలిఫై

Updated Date - Jun 20 , 2026 | 07:47 AM