40 ఏళ్ల తర్వాత..
ABN , Publish Date - Jun 20 , 2026 | 02:06 AM
జోరుగా సాగుతున్న ఫిఫా వరల్డ్‌కప్ 8వ రోజు ఆతిథ్య కెనడా, మెక్సికో జట్లకు చిరస్మరణీయంగా నిలిచింది. 1986 నుంచి ఈ మెగా టోర్నీలో ఆడుతున్న కెనడా జట్టు ఎట్టకేలకు గెలుపు బోణీ...
ఫిఫా కప్ మ్యాచ్‌లు
బ్రెజిల్ X హైతీ
(ఉదయం 6 గం.)
తుర్కియే X పరాగ్వే
(ఉ. 8.30 గం.)
నెదర్లాండ్స్ X స్వీడన్
( రాత్రి 10.30 గం.)
జర్మనీ X ఐవరీకోస్ట్
(శనివారం అర్ధరాత్రి 1.30 గం.)
కెనడా తొలి గెలుపు
జొనాథన్ డేవిడ్ హ్యాట్రిక్ జూ0-6తో కతార్ చిత్తు
జోరుగా సాగుతున్న ఫిఫా వరల్డ్‌కప్ 8వ రోజు ఆతిథ్య కెనడా, మెక్సికో జట్లకు చిరస్మరణీయంగా నిలిచింది. 1986 నుంచి ఈ మెగా టోర్నీలో ఆడుతున్న కెనడా జట్టు ఎట్టకేలకు గెలుపు బోణీ చేసింది. స్ట్రయికర్ జొనాథన్ డేవిడ్ హ్యాట్రిక్‌తో ప్రత్యర్థి కతార్‌ను ఏకంగా 6-0తో చిత్తు చేసింది. అయితే మ్యాచ్ ముగిశాక ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య తోపులాట సంచలనం రేకెత్తించింది. అటు మెక్సికో వరుసగా రెండో విజయంతో నాకౌట్‌కు చేరిన తొలి జట్టుగా నిలిచింది. ఇక స్విట్జర్లాండ్ జట్టు బోస్నియాను ఓడించి తమ గ్రూప్ ‘బి’లో అగ్రస్థానానికి చేరింది..
వాంకూవర్: ఒకటా.. రెండా.. నాలుగు దశాబ్దాల ఎదురుచూపులకు కెనడా ఫుట్‌బాల్ జట్టు తెర దించింది. తమ ఫిఫా వరల్డ్‌కప్ చరిత్రలో తొలిసారిగా గెలుపు రుచి చూసింది. శుక్రవారం కతార్ జట్టుతో పూర్తి ఏకపక్షంగా సాగిన గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో 6-0 తేడాతో ఘనవిజయం సాధించింది. తద్వారా స్విట్జర్లాండ్‌తో కలిసి నాలుగు పాయింట్లతో టాప్‌లో ఉంది. అలాగే తమ నాకౌట్ చాన్స్‌ను కూడా మెరుగుపర్చుకుంది. 1986-2022 మధ్య టోర్నీల్లో ఆడిన ఆరు మ్యాచ్‌ల్లోనూ కెనడా ఓటమి పాలైంది. అయితే తాజా కప్‌లో తొలి మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. స్ట్రయికర్ జొనాథన్ డేవిడ్ హ్యాట్రిక్ గోల్స్ (29, 45, 90 నిమిషాల్లో)తో మెరిశాడు. ఇలా సొంత గడ్డపై ఒకే మ్యాచ్‌లో మూడు గోల్స్ సాధించిన రెండో ప్లేయర్‌గా నిలిచాడు. 1966లో ఇంగ్లండ్ నుంచి జెఫ్ హాస్ట్ ఈ ఫీట్ సాధించాడు. ఇక కెనడా తరఫున కైల్ లారిన్ (16), నేథన్ సాలిబా (63), జేకబ్ షాఫెల్‌బర్గ్ (75) ఇతర గోల్స్ సాధించారు.

ఆధిపత్యం.. రెడ్ కార్డ్స్..
కెనడా-కతార్ జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్ అత్యంత నాటకీయంగా ముగిసింది. ఆరంభం నుంచి కెనడా ఆటగాళ్లదే హవా సాగింది. వీరి గోల్ కీపర్ మాక్సిమ్ ప్రత్యర్థి నుంచి ఒక్క షాట్‌ను కూడా ఎదుర్కోలేదు. కెనడా మొత్తంగా 30 ప్రయత్నాలతో విరుచుకుపడింది. 16వ నిమిషంలోనే లారిన్ బోణీ చేయగా.. ఆ తర్వాత రెండు గోల్స్‌ను డేవిడ్ అందించడంతో కెనడా తొలి భాగాన్ని 3-0తో ముగించింది. అయితే 33వ నిమిషంలో ఫార్వర్డ్ బుకానన్‌ను కతార్ డిఫెండర్ హోమెన్ అహ్మద్ కిందపడేయడంతో వివాదం చెలరేగింది. రెఫరీ.. అహ్మద్‌కు రెడ్ కార్డ్ చూపించగా కతార్ పది మందితోనే ఆడాల్సి వచ్చింది. ఇక ద్వితీయార్ధంలోనూ కతార్ మొరటు ఆటతో మూల్యం చెల్లించుకుంది. 53వ నిమిషంలో కతార్ మిడ్ ఫీల్డర్ ఆసిమ్ మడిబో కారణంగా కెనడా మిడ్‌ఫీల్డర్ ఇస్మాయిల్ కోన్ ఎడమకాలి ఎముక విరిగింది. దీంతో అతడిని స్ట్రెచర్‌పై తీసుకెళ్లాల్సి వచ్చింది. మడిబోకు కూడా రెఫరీ రెడ్ కార్డ్ చూపడంతో కతార్ మిగిలిన ఆటను 9 మందితోనే ఆడిం ది. దీన్ని సద్వినియోగం చేసుకుంటూ కెనడా మరో 3 గోల్స్‌తో చెలరేగింది.
రచ్చ.. రచ్చ: ఆట ముగిసిన వెంటనే ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. ఒకరినొకరు తోసుకోవడం, మాటా మాటా అనుకోవడం కనిపించింది. తమ ఆటగాడు తీవ్రంగా గాయపడడంతో కెనడా.. తమ ఇద్దరి ప్లేయర్లకు రెడ్ కార్డులు చూపడం, తొమ్మిది మందికే పరిమితమైనా కెనడా నిరంతరం దాడులు చేయడంపై కతార్ పూర్తి అసహనంతో కనిపించాయి. అటు కతార్ కోచ్ జూలెన్, కెనడా మేనేజర్ జెస్సీ మార్ష్ మధ్య కూడా వాగ్వాదం చోటు చేసుకుంది.
నాకౌట్‌కు మెక్సికో
దక్షిణ కొరియాపై 1-0తో విజయం
మెక్సికో సిటీ: ఫిఫా వరల్డ్‌కప్‌లో ఆతిథ్య మెక్సికో వరుసగా రెండో విజయం సాధించింది. దీంతో తాజా టోర్నీలో నాకౌట్‌కు చేరిన తొలి జట్టుగా నిలిచింది. శుక్రవారం దక్షిణ కొరియాతో జరిగిన గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌లో ఈ జట్టు 1-0తో గెలిచింది. 50వ నిమషంలో లూయిస్ రోమో ఏకైక గోల్ అందించాడు. ఆట 87వ నిమిషంలో కొరియా స్కోరు సమం చేసే అవకాశాన్ని వదులుకుంది. అయితే ఇప్పటికే ఓ విజయంతో ఉన్న కొరియా తమ చివరి గ్రూప్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై గెలిస్తే నాకౌట్‌కు చేరుతుంది.
స్విట్జర్లాండ్ జోరు
బోస్నియాపై 4-1 విజయం
బోస్నియా అండ్ హెర్జ్‌గోవినాతో జరిగిన గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో స్విట్జర్లాండ్ 4-1తో విజయం సాధించింది. దీంతో నాలుగు పాయింట్లతో తమ నాకౌట్ చాన్స్‌ను మెరుగుపర్చుకుంది. తొలి అర్ధభాగంలో ఇరు జట్ల నుంచి ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. అయితే ఆ తర్వాత జొహాన్ మన్‌జాంబి (74, 90వ నిమిషాల్లో) రెండు గోల్స్ అందించగా.. రూబెన్ వర్గాస్ (84), గ్రానిట్ హాకా (90+7) చెరో గోల్ సాధించారు. అదనపు సమయంలోనే బోస్నియా నుంచి ఎర్మిన్ మహ్మిక్ (90+3) ఏకైక గోల్‌తో ఊరటనిచ్చాడు.
రెండో మ్యాచ్‌కూ నెమార్ దూరం
బ్రెజిల్ సూపర్ స్టార్ నెమార్ బరిలోకి దిగడం మరింత ఆలస్యం కానుంది. గాయం కారణంగా ఇప్పటికే తమ తొలి మ్యాచ్‌కు దూ రమైన నెమార్ హైతీతో జరిగే రెండో మ్యాచ్‌లోనూ ఆడడం లేదు. ఫిలిడెల్ఫియాలో శనివా రం ఉదయం జరిగే ఈ మ్యాచ్ కోసం నెమా ర్ జట్టుతో పాటు వెళ్లకుండా న్యూజెర్సీలోనే ఉండిపోయాడు. మొత్తంగా గ్రూప్ మ్యాచ్‌లకే దూరమయ్యే అవకాశం ఉందని సమాచారం.
1
ఫిఫా వరల్డ్‌క్‌పలో యూరప్, దక్షిణ అమెరికాలకు చెందని మరో టీమ్ (కెనడా) ఒకే మ్యాచ్‌లో 5+ గోల్స్ సాధించడం ఇదే తొలిసారి.
ఇవి కూడా చదవండి:
ఢిల్లీ క్యాపిటల్స్ గూటికి రిషభ్ పంత్?
భారత హెల్మెట్ ధరించి.. సెంచరీ బాదిన సంగక్కర!