Share News

ఢిల్లీ క్యాపిటల్స్ గూటికి రిషభ్ పంత్?

ABN , Publish Date - Jun 19 , 2026 | 08:55 PM

ఐపీఎల్ చరిత్రలోనే అతిపెద్ద ట్రేడ్ డీల్‌కు రంగం సిద్ధమవుతున్నట్లు వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఐపీఎల్ 2026లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ కెప్టెన్‌గా వ్యవహరించిన రిషభ్ పంత్.. తిరిగి పాత ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్‌కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

ఢిల్లీ క్యాపిటల్స్ గూటికి రిషభ్ పంత్?
Rishabh Pant

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ చరిత్రలోనే అతిపెద్ద ట్రేడ్ డీల్‌కు రంగం సిద్ధమవుతున్నట్లు వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఐపీఎల్ 2026లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ కెప్టెన్‌గా వ్యవహరించిన రిషభ్ పంత్.. తిరిగి పాత ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్‌కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ స్టార్ ప్లేయర్ కుల్‌దీప్ యాదవ్‌ను లఖ్‌నవూ ఫ్రాంచైజీ ట్రేడ్ డీల్ ద్వారా జట్టులోకి తీసుకోనున్నట్లు సమాచారం. అయితే ఈ ఇద్దరు ఆటగాళ్ల మధ్య జరగనున్న ఈ ట్రేడ్ విలువ సుమారు రూ.40.25 కోట్లుగా ఉండనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే జరిగితే ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత హై ప్రొఫైల్ ట్రేడ్‌గా మారే అవకాశం ఉంది.


పంత్ ‘రిటర్న్’!

ఐపీఎల్ 2025 మెగా వేలంలో రూ.27 కోట్ల రికార్డు ధరకు లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ పంత్‌ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అయితే కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆడిన రెండు సీజన్లలోనూ పంత్ పేలవ ప్రదర్శన కనబర్చాడు. ఎల్ఎస్‌జీ ప్లే ఆఫ్స్ కూడా చేరుకోలేకపోయింది. ఐపీఎల్ 2026లో ఆ జట్టు ఆఖరి స్థానానికే పరిమితమైంది. దీంతో పంత్ స్వయంగా ఎల్ఎస్‌జీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. దీంతో గతంలో ఎనిమిదేళ్లు ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడిన పంత్.. తిరిగి అదే గూటికి చేరుకుంటాడన్న వార్తలు జోరందుకున్నాయి.


కుల్‌దీప్ యాదవ్ మార్పు!

ఇదే ట్రేడ్‌లో భాగంగా స్టార్ స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌కు రానున్నట్లు తెలుస్తోంది. గత సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. 12 మ్యాచుల్లో కేవలం 10 వికెట్లు తీసుకున్నాడు. పేలవ ప్రదర్శనతో కొన్ని మ్యాచ్‌లకు అతడిని బెంచ్‌కే పరిమితం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు కుల్‌దీప్ యాదవ్‌ను ఢిల్లీ ఫ్రాంచైజీ రూ.13.25 కోట్లకు రిటైన్ చేసుకుంది.


ఈ డీల్ చరిత్ర సృష్టించనుందా?

పంత్, కుల్‌దీప్ యాదవ్‌ల ప్రస్తుతం వేతనం కలిపితే రూ.40.25 కోట్లు. దీంతో ఈ ట్రేడ్ జరిగితే.. ఐపీఎల్‌లో ఇప్పటి వరకు జరిగిన అన్ని ట్రేడ్లను మించిపోయే అవకాశం ఉంది. అయితే ఈ విషయంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. నిజంగానే ఈ డీల్ కార్యరూపం దాల్చనుందా? అనే ఉత్కంఠ అభిమానుల్లో మొదలైంది.


ఇవి కూడా చదవండి:

ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్‌గా యువరాజ్ సింగ్!

టీమిండియాకు కోచ్ అవసరం లేదు.. గంభీర్‌పై శ్రీశాంత్ విమర్శలు

Updated Date - Jun 19 , 2026 | 08:55 PM