హీరోయిన్ రుక్మిణి వసంత్ ఫిర్యాదు.. ముగ్గురి అరెస్ట్..
ABN , Publish Date - Jun 20 , 2026 | 06:56 AM
ఏఐ సాయంతో హీరోయిన్ రుక్మిణి వసంత్‌కు సంబంధించిన అసభ్య చిత్రాలు, వీడియోలు తయారు చేసిన ముగ్గురు వ్యక్తులను బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇంటర్‌నెట్ డెస్క్: ఏఐ సాయంతో హీరోయిన్ రుక్మిణి వసంత్‌కు సంబంధించిన అసభ్య చిత్రాలు, వీడియోలు తయారు చేసిన ముగ్గురు వ్యక్తులను బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాగోల్ కోట్ జిల్లా, చిలకముఖి గ్రామానికి చెందిన 24 ఏళ్ల రవి కుమార్.. బెంగళూరుకు చెందిన 33 ఏళ్ల చంద్రకాంత్.. బెంగళూరు, మహాలక్ష్మీ నగర్‌కు చెందిన 25 ఏళ్ల రంజిత్‌లను అరెస్ట్ చేశారు. వారినుంచి మొబైల్ ఫోన్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురినీ శుక్రవారం కోర్టులో హాజరుపరిచారు. కోర్టు వారికి రిమాండ్ విధించింది.
రుక్మిణి వసంత్ ఫిర్యాదుతో రంగంలోకి..
కొంతమంది వ్యక్తులు ఏఐ సాయంతో తనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను మార్ఫింగ్ చేసి, అసభ్యకరంగా మార్చి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారంటూ రుక్మిణి వసంత్ పోలీసులను ఆశ్రయించారు. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో దీనిపై ఫిర్యాదు చేశారు. తాను బికినీ ధరించినట్లు అసభ్యకరమైన చిత్రాలను తయారు చేశారంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్ఫింగ్ ఫొటోలు, వీడియోల కారణంగా తన కుటుంబసభ్యులు ఆవేదనకు గురవుతున్నారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తాజాగా, ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు.
మూడో సినిమాతో దేశ వ్యాప్తంగా రుక్మిణికి గుర్తింపు..
రుక్మిణి వసంత్ 2019లో విడుదలైన బీర్బల్ ట్రయాలజీ సినిమాతో కన్నడ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. 2023లో విడుదలైన ‘సప్త సాగరదాచే ఎల్లో’ సినిమాతో కన్నడతో పాటు తెలుగు, తమిళంలోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వరుస అవకాశాలు తలుపుతట్టాయి. ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. యశ్ టాక్సిక్ సినిమాలోనూ హీరోయిన్‌గా చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటలు
సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు రూ. 10 కోట్లు