Share News

100 మంది అంబేడ్కర్లు రావాలి!

ABN , Publish Date - Jun 20 , 2026 | 05:08 AM

సోషల్‌ వెల్ఫేర్‌ హాస్టళ్లలో చదువుకుని ఇవాళ ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్ఎస్‌ అధికారులుగా మారిన ముగ్గురిని గవర్నర్‌కి పరిచయం చేశాను. నా సోషల్‌ వెల్ఫేర్‌ పిల్లలు దేశాన్ని ఏలే నాయకులు కావాలి.

100 మంది అంబేడ్కర్లు రావాలి!

  • దళిత, గిరిజన, బలహీన వర్గాల నుంచి దేశాన్ని ఏలే నాయకులు కావాలి

  • మన తలరాతలు మారేది తరగతి గదుల్లోనే

  • ప్రభుత్వం అందించే సంక్షేమం కంటే విద్యే ముఖ్యం

  • మీకేం కావాలన్నా నిమిషాల్లో చేసే బాధ్యత నాది

  • ఆరుట్ల స్కూల్లో ఇప్పటికే నో అడ్మిషన్‌ బోర్డు

  • గత పదేళ్లలో విద్యా శాఖ విధ్వంసానికి గురైంది

  • దాన్ని ఇప్పుడు వికాసం వైపు నడిపిస్తున్నా

  • ‘యంగ్‌ ఇండియా స్టూడెంట్‌ కిట్‌’ పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి): ‘‘సోషల్‌ వెల్ఫేర్‌ హాస్టళ్లలో చదువుకుని ఇవాళ ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్ఎస్‌ అధికారులుగా మారిన ముగ్గురిని గవర్నర్‌కి పరిచయం చేశాను. నా సోషల్‌ వెల్ఫేర్‌ పిల్లలు దేశాన్ని ఏలే నాయకులు కావాలి. శాస్త్రవేత్తలు కావాలి. ఆనాడు ఒక్క అంబేడ్కర్‌ వస్తేనే ప్రపంచానికి దిక్సూచి అయ్యారు. తెలంగాణ దళిత, గిరిజన, బలహీన వర్గాల నుంచి 100 మంది అంబేడ్కర్లు రావాలి. ఆ శక్తి మీలో ఉంది’’ అని విద్యార్థులకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పిలుపునిచ్చారు. మన తలరాతలు మారేది కేవలం తరగతి గదుల్లోనేనని, ప్రభుత్వం ఇచ్చే సంక్షేమం కంటే విద్యే ముఖ్యమని నొక్కిచెప్పారు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో ప్రభుత్వ, రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో చదువుతున్న 27.50 లక్షల మంది విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ‘యంగ్‌ ఇండియా స్టూడెంట్‌ కిట్‌’ పంపిణీ కార్యక్రమం శుక్రవారం ఎల్బీ స్టేడియంలో ఘనంగా జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లా హాజరయ్యారు. కిట్ల పంపిణీని గవర్నర్‌తో కలిసి సీఎం రేవంత్‌ ప్రారంభించారు. గురుకుల పాఠశాల విద్యార్థులకు 22 వస్తువులతో; వసతి గృహ విద్యార్థులకు 10; పాఠశాల విద్యార్థులకు ఏడు వస్తువులతో పంపిణీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.50.73 కోట్లతో గవర్నర్‌ చేతుల మీదుగా వర్చువల్‌గా శంకుస్థాపనలు జరిగాయి. అందులో రూ.36.65 కోట్లతో వివిధ జిల్లాల్లో మినీ స్టేడియాల నిర్మాణానికి, క్రీడా మౌలిక సదుపాయాలకు శ్రీకారం చుట్టగా.. రూ.14.08 కోట్లతో గచ్చిబౌలి, ఎల్బీ స్టేడియంలో బాలబాలికల క్రీడా శిక్షణకు వివిధ అకాడమీలను వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘మీ సోదరుడిగా, ముఖ్యమంత్రిగా మీ రేవంతన్న ఉన్నాడు. మీరు చదువుతారా, ఆటలు ఆడతారా.. మీకేం కావాలన్నా నిమిషాల్లో చేసి పెట్టే బాధ్యత నాది. ఉచిత బ్రేక్‌ఫాస్ట్‌, లంచ్‌, స్నాక్స్‌తోపాటు భవిష్యత్తులో విద్యార్థులకు ఉచిత రవాణా సౌకర్యాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వమే కల్పిస్తుంది’’ అని భరోసానిచ్చారు.


విధ్వంసం నుంచి వికాసానికి..

గత పదేళ్ల పాలనలో విద్యా శాఖ తీవ్ర విధ్వంసానికి గురైందని సీఎం రేవంత్‌ రెడ్డి విమర్శించారు. ‘‘విధ్వంసమైన విద్యా శాఖను వికాసంవైపు నడిపించాలని నిర్ణయించాం. అందుకే, మేం అధికారంలోకి రాగానే బడ్జెట్‌లో ఏకంగా 8.5 శాతం నిధులను విద్యా శాఖకు కేటాయించాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల కోసం రూ.26,600 కోట్లు కేటాయించాం. దీనిని ప్రభుత్వం ‘ఖర్చు’గా కాకుండా ‘భవిష్యత్తు పెట్టుబడి’గా చూస్తోంది. ఐటీ, రెవెన్యూ, ఫైనాన్స్‌ వంటి పెద్ద పోర్ట్‌ఫోలియోలు ఉన్నా.. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉందనే నమ్మకంతో విద్యా శాఖను నా వద్దే ఉంచుకుని స్వయంగా పర్యవేక్షిస్తున్నా. గత పదేళ్లుగా హాస్టల్‌ విద్యార్థుల డైట్‌ చార్జీలను పట్టించుకోలేదు. మేం రాగానే డైట్‌ చార్జీలను 40శాతం పెంచాం. 16 ఏళ్లుగా పెంచని కాస్మెటిక్‌ చార్జీలను ఏకంగా 200శాతం పెంచాం. అంతేనా.. ప్రతి నెలా ఒకటో తేదీనే వీటిని చెల్లించేలా కఠిన ఆదేశాలు జారీ చేశాం. కుల అసమానతలను తొలగించడమే లక్ష్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు విడివిడిగా కాకుండా, అందరూ కలిసి చదువుకునేలా కార్పొరేట్‌ స్థాయిలో ‘యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌’ నిర్మిస్తున్నాం. వచ్చే విద్యా సంవత్సరంనాటికి రాష్ట్రవ్యాప్తంగా 119 స్కూళ్లను దేశానికే రోల్‌ మోడల్‌గా నిలిచేలా అందుబాటులోకి తెస్తాం’’ అని వివరించారు.

ప్రభుత్వ పాఠశాలంటే ఓ భావోద్వేగం

ప్రభుత్వ పాఠశాల అంటే కేవలం చదువుకునే చోటో, ఉద్యోగం కోసం చేసే ప్రయత్నమో కాదని, ఇది 4 కోట్ల తెలంగాణ ప్రజల భావోద్వేగ బంధమని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. ‘‘తెలంగాణ కేవలం పరిపాలనా సౌలభ్యం కోసమో, భాషా ప్రయుక్తంగానో ఏర్పడిన రాష్ట్రం కాదు. 60 ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో వందలాది మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలు, ఎంతోమంది కన్నవారి కన్నీటి సాగరంలోంచి ఉద్భవించిన వేదిక. వారి ఆత్మ బలిదానాల వల్లే ఇవాళ మనం ఈ స్థానంలో ఉన్నాం’’ అంటూ సీఎం భావోద్వేగానికి లోనయ్యారు. 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశం ఒలింపిక్స్‌లో వెనకబడటం మన ఆత్మగౌరవానికి సంబంధించిన అంశమన్న సీఎం.. పాలకుల లోపం వల్లే మన బిడ్డలు వెనుకబడ్డారని తప్పుబట్టారు. అందుకే పీపీపీ పద్ధతిలో ‘యంగ్‌ ఇండియా స్పోర్ట్స్‌ యూనివర్సిటీ’ని ఏర్పాటు చేశామని, రాబోయే ఒలింపిక్స్‌లో తెలంగాణ బిడ్డలు గోల్డ్‌ మెడల్‌ సాధించడమే తన కల అని పునరుద్ఘాటించారు.


ప్రభుత్వ స్కూళ్లలో ‘నో అడ్మిషన్‌’ బోర్డులు

ఇంగ్లిష్‌ మీడియం విద్యను తమ పిల్లలకు అందించాలనే పేద తల్లిదండ్రుల కలను సాకారం చేసేందుకు నర్సరీ నుంచి 12వ తరగతి (ఇంటర్‌) వరకు ‘తెలంగాణ ఎడ్యుకేషన్‌ పాలసీ’ని రూపొందిస్తున్నామని సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు. ‘‘పైలెట్‌ ప్రాజెక్ట్‌గా ఇబ్రహీంపట్నం పరిధిలోని ఆరుట్ల మోడల్‌ స్కూల్‌లో నర్సరీ నుంచి అడ్మిషన్లు ఇచ్చాం. అక్కడ 1,814 సీట్లున్నాయి. కానీ, మరో 1,500 అదనపు దరఖాస్తులు వచ్చాయి. ఇప్పుడు అక్కడ ‘నో అడ్మిషన్‌’ బోర్డు పెట్టే పరిస్థితి వచ్చింది’’ అని వివరించారు. ప్రభుత్వ పాఠశాలలో ఇలాంటి బోర్డు పెట్టడం ఉపాధ్యాయుల పనితనానికి, నిబద్ధతకు నిదర్శనమన్నారు.

ఏఐ భూతాన్ని ఎదుర్కొనేలా..

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ వల్ల వైట్‌ కాలర్‌ ఉద్యోగాలు ఊడిపోతున్న తరుణంలో, నైపుణ్యంతో కూడిన బ్లూ కాలర్‌ ఉద్యోగాల కోసం ఐటీఐలను ‘అడ్వాన్స్డ్‌ టెక్నాలజీ సెంటర్స్‌ (ఏటీసీ)’గా మార్చామని, అక్కడ చేరే పిల్లలకు నెలకు రూ.2,000 స్టైపెండ్‌గా ఇస్తున్నామని సీఎం రేవంత్‌ తెలిపారు. ‘యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ’ ద్వారా వృత్తి నైపుణ్యాలు అందిస్తున్నామని, ఇంగ్లిష్‌ మాత్రమే కాకుండా జర్మన్‌, జపనీస్‌, సౌత్‌ కొరియన్‌ భాషలు నేర్పుతున్నామని, వాటిని అందిపుచ్చుకుని గ్లోబల్‌ ఉద్యోగాలు సాధించాలని పిలుపునిచ్చారు. గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌ వంటి సంస్థలకు సుందర్‌ పిచాయ్‌, సత్య నాదెళ్ల, శాంతను నారాయణ్‌, అజయ్‌ బంగా వంటి మన సీఈఓలు ఉంటే సరిపోదని, మనమే యజమానులం కావాలని, తెలంగాణ నుంచి యూనికార్న్‌ కంపెనీలు రావాలని ఆకాంక్షించారు. ఇందుకు మంత్రి శ్రీధర్‌ బాబు ఆధ్వర్యంలో రీసెర్చ్‌ ఫండింగ్‌ కోసం గూగుల్‌ సంస్థతో ఒప్పందాలు చేసుకున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌ బాబు, పొన్నం ప్రభాకర్‌, అడ్లూరి లక్ష్మణ్‌, వాకిటి శ్రీహరి, మహమ్మద్‌ అజరుద్దీన్‌, ప్రొఫెసర్‌ కోదండరాం, సీనియర్‌ నేత కేశవరావు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, విద్యా శాఖ అధికారులు పాల్గొన్నారు.

4.jpg

Updated Date - Jun 20 , 2026 | 05:31 AM